పరుగుల ప్రవాహమే అనుకుంటే... వికెట్లు టపటపా పడ్డాయి. ఇరు జట్ల నుంచి ఒకటైనా సెంచరీ నమోదవుతుందని ఊహిస్తే... వంద పరుగులు చేయడం, ఛేదించడమే కష్టమైపోయింది. పట్టుమని పది ధనాధన్ షాట్లైనా లేవు... మెరుపు ఇన్నింగ్స్ అనే మాటే లేదు... అసలు ఆడుతున్నది టి20నేనా అనేంత అనుమానంతో సాగింది భారత్–వెస్టిండీస్ మ్యాచ్. మొదట్నుంచి నిస్సారంగానే కనిపించినా చివరకు టీమిండియానే విజయం సాధించడంతో ఊరట దక్కింది.
లాడర్‌హిల్ (అమెరికా)
ప్రపంచ కప్ అనంతర ప్రయాణాన్ని భారత్ విజయంతో ప్రారంభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌లో శనివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్ర పేసర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవదీప్ సైనీ (3/17) అదరగొట్టడంతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో ప్రత్యర్థిని కట్టిపడేసిన కోహ్లి సేన... బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు చేయడంతో లక్ష్యాన్ని అందుకోగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (49 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. పొలార్డ్ మినహా నికొలస్ పూరన్ (16 బంతుల్లో 20; ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. లక్ష్యం స్వల్పమే అయినా ఛేదనలో భారత్ చెమటోడ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ (25 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫటాఫట్ షాట్లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (29 బంతుల్లో 19; ఫోర్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు) అవసరమైన పరుగులు చేశారు. దీంతో 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం ఇక్కడే రెండో టి20 జరగనుంది.
ఆడింది విండీసేనా...?
టి20ల్లో భీకర హిట్టింగ్‌కు వెస్టిండీస్ మారుపేరు. కానీ, ఈ మ్యాచ్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. టీమిండియా బౌలింగ్ దాడిని ప్రారంభించిన యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (0)ను ఔట్ చేశాడు. ఇదే మైదానంలో మూడేళ్ల క్రితం భారత్‌పై చెలరేగి శతకం బాదిన ఓపెనర్ ఎవిన్ లూయీస్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. సిక్స్‌తో తనకు స్వాగతం పలికిన పూరన్‌పై ఆ వెంటనే సైనీ ప్రతీకారం తీర్చుకున్నాడు. దూకుడైన హెట్‌మైర్ (0)ను తదుపరి బంతికే బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు.
అయితే, రావ్‌మన్ పావెల్ (4) అడ్డుకున్నాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత పావెల్‌ను ఖలీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసిన ఈ దశలో విండీస్ స్కోరు 33/5. స్పిన్నర్లు జడేజా, కృనాల్ రంగంలోకి దిగాక సిక్స్‌లు బాది పొలార్డ్ స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ, కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ (24 బంతుల్లో 9) మరీ పేలవంగా ఆడాడు. బ్రాత్‌వైట్‌ను కృనాల్, నరైన్ (2)ను జడేజా వెనక్కుపంపాక కరీబియన్లు తేరుకోలేకపోయారు. అప్పటికీ సైనీ, భువీ ఓవర్లలో సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ కాసిన్ని పరుగులు జోడించాడు. 120 బంతుల విండీస్ ఇన్నింగ్స్‌లో 79 బంతులకు పరుగే రాకపోవడం గమనార్హం.
ఇబ్బందిపడ్డా... గెలుపు గట్టెక్కారు
గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఓపెనర్ ధావన్ (1) నిరుత్సాహపర్చినా రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత్ ఛేదనను నడిపించాడు. కోహ్లి అతడికి సహకరించాడు. అయితే, నరైన్ (2/14) వరుస బంతుల్లో రోహిత్, రిషభ్ పంత్ (0)ను ఔట్ చేసి కలవరపెట్టాడు. నరైన్ యార్కర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రోహిత్ లాంగాన్‌లో పొలార్డ్‌కు చిక్కాడు. పంత్ బంతి గమనాన్ని ఊహించకుండా బల ప్రయోగం చేసి వికెట్ పారేసుకున్నాడు. దాదాపు విండీస్ తరహాలోనే 32/3తో నిలిచిన భారత్‌ను కోహ్లి, పాండే ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 30 బంతుల్లో 32 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. వీరిద్దరూ ఒకరివెంట ఒకరు వెనుదిరిగినా... కృనాల్ (12), జడేజా (10 నాటౌట్) లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చారు. కీమో పాల్ ఓవర్లో సిక్స్ కొట్టిన సుందర్ (8 నాటౌట్) లాంఛనాన్ని ముగించాడు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కాంప్‌బెల్ (సి) కృనాల్ (బి) సుందర్ 0; లూయిస్ (బి) భువనేశ్వర్ 0; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 20; పొలార్డ్ ఎల్బీ (బి) సైనీ 49; హెట్‌మైర్ (బి) సైనీ 0; పావెల్ (సి) పంత్ (బి) ఖలీల్ 4; బ్రాత్‌వైట్ (సి అండ్ బి) కృనాల్ 9; నరైన్ (సి) ఖలీల్ (బి) జడేజా 2; పాల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 3; కాట్రెల్ నాటౌట్ 0; థామస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 95.
వికెట్ల పతనం: 1–0, 2–8, 3–28, 4–28, 5–33, 6–67, 7–70, 8–88, 9–95.
బౌలింగ్: సుందర్ 2–0–18–1, భువనేశ్వర్ 4–0–19–2, సైనీ 4–1–17–3, ఖలీల్ 2–0–8–1, కృనాల్ 4–1–20–1, జడేజా 4–1–13–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పొలార్డ్ (బి) నరైన్ 24; ధావన్ ఎల్బీ (బి) కాట్రెల్ 1; కోహ్లి (సి) పొలార్డ్ (బి) కాట్రెల్ 19; పంత్ (సి) కాట్రెల్ (బి) నరైన్ 0; పాండే (బి) పాల్ 19; కృనాల్ (బి) పాల్ 12; జడేజా నాటౌట్ 10; సుందర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.2 ఓవర్లలో 6 వికెట్లకు) 98.
వికెట్ల పతనం: 1–4, 2–32, 3–32, 4–64, 5–69, 6–88.
బౌలింగ్: థామస్ 4–0–29–0, కాట్రెల్ 4–0–20–2, నరైన్ 4–0–14–2, పాల్ 3.2–0–23–2, బ్రాత్‌వైట్ 2–0–12–0.
అమెరికాలో మ్యాచ్... అయినా
అగ్ర రాజ్యం అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు... అటు కరీబియన్ దీవులకు దగ్గరగానూ ఉండే ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌కు తొలి మ్యాచ్‌లో స్పందన అంతంతే కనిపించింది. ఈ మైదానంలో మూడేళ్ల క్రితం భారత్–విండీస్ మ్యాచ్‌కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈసారి మాత్రం కనిష్ట టికెట్ ధర 50 డాలర్లే అయినా స్టాండ్స్ నిండలేదు. లాడర్‌హిల్‌లో మొత్తమ్మీద ఇది తొమ్మిదో మ్యాచ్ కావడం గమనార్హం.
సై.. సై.. సైనీ
తొలి టి20లో భారత్‌కు పెద్ద సానుకూలాంశం నవదీప్ సైనీ. ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్‌ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్‌కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్‌ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా ముగించి భళా అనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment