Ind vs Pak: పాకిస్తాన్‌ను ఓడించిన భారత్‌ | Asian Champions Trophy 2024: India Beat Pakistan Enter Semis Unbeaten | Sakshi
Sakshi News home page

Ind vs Pak: పాకిస్తాన్‌ను ఓడించి.. అజేయంగా సెమీస్‌కు

Published Sat, Sep 14 2024 3:18 PM | Last Updated on Sat, Sep 14 2024 3:51 PM

Asian Champions Trophy 2024: India Beat Pakistan Enter Semis Unbeaten

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టోర్నీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దాయాదిని 2-1తో ఓడించింది. తద్వారా లీగ్‌ దశలో ఓటమన్నదే లేకుండా.. సెమీస్‌ వరకు అజేయంగా నిలిచింది. కాగా ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌- పాకిస్తాన్‌ ఇప్పటికే సెమీ ఫైనల్‌ చేరుకున్న విషయం తెలిసిందే.

చిరకాల ప్రత్యర్థిపై మరోసారి పైచేయి
టీమిండియా పన్నెండు పాయింట్లతో.. పాక్‌ ఎనిమిది పాయింట్లతో టాప్‌-4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, లీగ్‌ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీపడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ దుమ్ములేపింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో పైచేయి సాధించి జయభేరి మోగించింది. 

ఆదిలో పాక్‌కు ఆధిక్యం
చైనాలోని మోకీ వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో.. తొలి గోల్‌ పాక్‌ కొట్టింది. ఆట ఎనిమిదవ నిమిషంలో అహ్మద్‌ నదీం తమ జట్టుకు తొలి పాయింట్‌ అందించాడు. అయితే, భారత జట్టు కెప్టెన్‌, ఉత్తమ డ్రాగ్‌ఫికర్లలో ఒకడైన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ దాయాదిని పైచేయి సాధించనివ్వలేదు. 

హర్మన్‌ చేసెను అద్భుతం 
మ్యాచ్‌ తొలి అర్ధభాగంలోనే పెనాల్టీ కార్నర్‌ ద్వారా రెండు గోల్స్‌ కొట్టి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మిగిలిన ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి.. మ్యాచ్‌ ముగిసే వరకు పాక్‌కు మరో గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 2-1తో భారత్‌ గెలుపొందింది.

ఇక ఈ టోర్నీలో భారత్‌ అంతకుముందు చైనాను 3–0తో, జపాన్‌ను 5–1తో, మలేషియాను 8–1, కొరియాను 3–1తో ఓడించింది. ఇక భారత్‌తో పాటు పాకిస్తాన్‌, సౌత్‌ కొరియా సెమీ ఫైనల్‌ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. మలేషియా, చైనాలలో ఏదో ఒక జట్టు వీటితో పాటు సెమీస్‌లో నిలిచే అవకాశం ఉంది.

చదవండి: టెన్నిస్‌ టోర్నమెంట్‌.. హెలికాప్టర్లలో స్టేడియానికి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement