నిలకడే కీలకం | Pusarla Venkata Sindhu shines bright in Macau, lifts second Grand Prix title | Sakshi
Sakshi News home page

నిలకడే కీలకం

Published Wed, Dec 4 2013 1:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నిలకడే కీలకం - Sakshi

నిలకడే కీలకం

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... రెండు గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలలో రెండు స్వర్ణాలు... ఏడు నెలల వ్యవధిలో ఒక వర్ధమాన క్రీడాకారిణి ఎదుగుదలకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు సాధించిన ఘనతలివి. చక్కటి ఆటతీరుతో విజయాలు సాధిస్తూ సింధు 2013 సంవత్సరాన్ని ప్రత్యేకంగా మలుచుకుంది.
 
 సాక్షి, హైదరాబాద్
 అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్ సైనా నిరాశపరచగా... అందరి అంచనాలను తారుమారు చేస్తూ సింధు ఈ ఏడాది అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది.తాజాగా మకావు ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి స్వస్థలం చేరిన అనంతరం ‘సాక్షి’తో ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే...
 
 ఈ ఏడాది ప్రదర్శన...
 చాలా బాగుంది. మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్‌తో పాటు మకావులో కూడా టైటిల్ సాధించాను. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కూడా చేరుకోగలిగాను. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అయితే మరీ స్పెషల్! ఐబీఎల్‌లాంటి కొత్త టోర్నీలో ఆడటం కూడా ప్రత్యేక అనుభూతినిచ్చింది. జూనియర్ స్థాయిలో చాలా విజయాలు సాధిస్తూ వచ్చినా సీనియర్ స్థాయి వేరు. వరుస విజయాలతో చాలా సంతోషం కలిగింది. వీటిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాను.
 
 మకావు ఓపెన్ ఫలితం...
 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం తర్వాత ఆడిన టోర్నీల్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాను. ఆ వైఫల్యాలతో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. కానీ మకావులో టాప్‌సీడ్‌గా నా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చగలిగాను. చైనా ఓపెన్‌కు వెళ్లకుండా గోపీచంద్ సర్ నాతో ప్రాక్టీస్ చేయించారు. అది ఫలితాన్నిచ్చింది. సీజన్ ఆఖరి టోర్నీ కావడంతో కొంత మంది టాప్ ప్లేయర్లు రాకపోయినా పోటీ తక్కువగా ఏమీ లేదు. సెమీస్‌లో  చైనా వర్ధమాన క్రీడాకారిణి జిన్‌జింగ్ బాగా ఇబ్బంది పెట్టింది. పోటీలో ఎవరు ఉన్నా లేకపోయినా టైటిల్ గెలవడమనేదే ముఖ్యం. కాబట్టి గెలుపు గెలుపే!
 
 ఆటతీరులో నిలకడ...
 వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 స్థాయికి చేరుకున్నాక అందరికీ సవాల్ ఎదురవుతుంది. దానిని ఎదుర్కోవడానికి నేను రెడీ. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీ కోసం భిన్నమైన వ్యూహాలతో సిద్ధం కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విజయాలు, మరికొన్ని సార్లు పరాజయాలు ఎదురు కావచ్చు. ఈ స్థితిలో ఏదో ఒక గెలుపుతో సరిపెట్టుకోకుండా నిలకడగా ఆడాల్సి ఉంటుంది కూడా. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాను. కోచ్ సూచనలతో ఆటతీరు మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. మరో ఏడాది, ఏడాదిన్నర సమయాన్ని లక్ష్యంగా పెట్టుకొని గోపీ సర్ నన్ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలుసు. ప్రత్యేకంగా ఫలానా అని చెప్పలేకపోయినా... బ్యాడ్మింటన్ ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారిణులందరినీ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
 
 తదుపరి టోర్నీలపై...
 ఈ ఏడాది విజయంతో ముగించాను. వచ్చే ఏడాది శుభారంభం చేయాలని భావిస్తున్నా. త్వరలో జరిగే సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నాను. స్థాయి ఏదైనా నా అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. 2014లో కొరియా ఓపెన్‌తో మొదలు పెట్టి ఆ తర్వాత మలేసియా సూపర్ సిరీస్, వివిధ టోర్నీలలో కూడా పాల్గొంటాను. గ్రాండ్ ప్రి గోల్డ్‌లలో విజేతగా నిలిచాను కాబట్టి ఇక సూపర్ సిరీస్‌లలో బాగా ఆడాల్సి ఉంది.
 
 సైనాతో పోలిక...
 ఇది ఊహించిందే. ఆమె నాకు ఆదర్శం. సైనాతో కలిసి అకాడమీలో ఎంతో ప్రాక్టీస్ చేస్తాను. ఎన్నో విషయాలు ఆమె నుంచి నేర్చుకుంటాను కూడా. ఒక గొప్ప ప్లేయర్‌తో నాకు పోలిక తీసుకురావడం వల్ల సమస్య లేదు. భవిష్యత్‌లో ఆమెలాగే మరిన్ని విజయాలు సాధిస్తా. ఈ ఏడాది నాకు ‘ది బెస్ట్’ కాగా... సైనాకు అంతగా కలిసి రాలేదనేది వాస్తవం. అయితే టాప్ ప్లేయర్లు ఇలాంటి దశను దాటి మళ్లీ సత్తా చాటుకోగల సమర్థులు. కాబట్టి వచ్చే సంవత్సరం సైనా మెరుగైన విజయాలు అందుకోవాలని నేనూ కోరుకుంటున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement