సాధించాల్సింది చాలా ఉంది! | Sakshi
Sakshi News home page

సాధించాల్సింది చాలా ఉంది!

Published Tue, Dec 2 2014 12:05 AM

సాధించాల్సింది చాలా ఉంది!

‘సాక్షి’కి ప్రత్యేకం
ఇది ఆరంభం మాత్రమే
వచ్చే ఏడాది ఇంకా బాగా ఆడతా
పీవీ సింధు మనోగతం
సాక్షి, హైదరాబాద్: పూసర్ల వెంకట సింధు... 19 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించిన ఆమె ఆటతీరు ప్రతి ఏటా మరింత మెరుగుపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మరింత నిలకడగా ఆమె ఫలితాలు సాధించింది. తాజాగా మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన సింధు, తన కెరీర్ గురించి పలు అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే...
 
మకావు విజయం: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాను. మకావులో మళ్లీ విజేతగా నిలవడం సంతోషకరం. గత ఏడాది ఇదే టోర్నీ గెలుచుకోవడానికి, దీనికి పోలిక లేదు. పోటీ, ప్రత్యర్థులు అంతా మారిపోయారు. నా శ్రమకు తగిన ఫలితం లభించింది. దీనికి ముందు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. అయితే గెలుపుతో ఏడాది ముగించగలిగాను.
 
2014లో ప్రదర్శన: కచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే నా ఆట మెరుగు కావడంతో పాటు, గుర్తుంచుకోదగ్గ విజయాలు దక్కాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఉబెర్ కప్‌లో పతకాలు...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు ఇప్పుడు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచాను. కాబట్టి  మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది.
 
మకావుకు ముందు పరాజయాలు:
నిజమే, మంచి విజయాలతో పాటు ఈ సారి నేను కొన్ని ఓటములు కూడా ఎదుర్కొన్నాను. అయితే ఆటలో ప్రతీ రోజు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మననుంచి అద్భుతమైన ప్రదర్శన వస్తుంది. మరికొన్ని సార్లు ఏమీ ఆడకుండా చేతులెత్తేస్తాం. కానీ ఒక టోర్నీ గెలవాలంటే ఆ రోజు అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకంటే బాగా ఆడితే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. కష్టపడటం కొనసాగించాలి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి.  
 
కోచింగ్‌పై ప్రత్యేక ప్రణాళికలు: ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కోచ్ గోపీచంద్ కారణం. ఆయనకు నా కృతజ్ఞతలు. నేనే కాదు చాలా మంది ఇతర ప్లేయర్లకు కూడా గోపీ సర్ వల్లే గుర్తింపు దక్కింది. చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవడం తప్ప ఇప్పటి వరకైతే కోచింగ్ విషయంలో ప్రత్యేక ప్రణాళికలు ఏమీ లేవు. ఆయన నాకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. దీనిని కొనసాగిస్తే చాలు.
 
వచ్చే ఏడాది టోర్నీలు:
సరిగ్గా ఏయే టోర్నీల్లో బరిలోకి దిగుతానో ఇంకా నిర్ణయించలేదు. దానిని కోచ్ నిర్ణయిస్తారు. నేను నా ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాను. అయితే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఏడాది కూడా కాబట్టి కచ్చితంగా కీలక సంవత్సరంగా చెప్పగలను. రియోలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మరిన్ని సూపర్ సిరీస్ టోర్నీలలో గెలవాలని కోరుకుంటున్నా. కానీ దాని కోసం ఒత్తిడి పెంచుకోను. నా వయసు ఇంకా 19 ఏళ్లే. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అయితే కొత్త ఏడాదిలో నా ఆట ఇంకా మెరుగవుతుందని నమ్ముతున్నా.
 
కొత్త పాయింట్ల పద్ధతి: ప్రస్తుతం దీనిని  గ్రాండ్ ప్రి ఈవెంట్లలోనే అమలు చేస్తున్నారు. మేం ఇంకా ఆ పద్ధతిలో ఆడలేదు. అయితే ప్రత్యేకంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... నా దృష్టిలో 21 పాయింట్ల పద్ధతే బాగుంటుంది. భవిష్యత్తులో స్కోరింగ్ పద్ధతిలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement