
యడ్లపల్లి ప్రాంజల... హైదరాబాద్‌కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. కొన్నేళ్ల క్రితం వరకు చక్కటి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మే, 2019లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 265కు చేరుకుంది.
మరింత మెరుగైన ప్రదర్శనతో పైకి దూసుకు పోతూ మెరుగైన భవిష్యత్తుపై ప్రాంజల ఆట నమ్మకం కలిగించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఆమె మళ్లీ మళ్లీ గాయాలపాలైంది. ఒక గాయం నుంచి కోలుకోగానే మరొకటి ఆమెను వెంటాడింది.
15 ఏళ్ల వయసులోనే ఐటీఎఫ్ స్థాయిలో వరుసగా టైటిల్స్ గెలిచిన ఆ అమ్మాయికి అసలు సమయంలో గాయాల విషయంలో సరైన మార్గనిర్దేశనం లేకుండా పోయింది. దాంతో కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ఆమె ఆటకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
ఇప్పుడు 26 ఏళ్ల వయసులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 1409వ స్థానానికి పడిపోయింది! అంటే కెరీర్‌లో ఎదుగుతున్న కీలకమైన 20–25 మధ్య ఐదేళ్ల కెరీర్‌ను ఆమె దాదాపు పూర్తిగా నష్టపోయింది.
‘నాకు ఇప్పటికీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. గాయాలతో పాటు టోర్నమెంట్ షెడ్యూల్, ఫిట్‌నెస్‌వంటివాటిపై సరైన రీతిలో మార్గనిర్దేశనం లభించి ఉంటే పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో అనిపిస్తుంది’ ఆమె ప్రాంజల వ్యాఖ్యానించింది.
జిమ్ ఎక్సర్‌సైజ్‌లే సమస్యగా...
ప్రాంజల మాత్రమే కాదు భారత టెన్నిస్‌లో ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత టెన్నిస్‌లో ముఖ్యంగా మహిళల టెన్నిస్‌లో ఇలాంటివి చూసేందుకు ఒక సరైన వ్యవస్థనే లేదు.
అసలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఎంత వరకు చేయాలి, అవి పరిమితి దాటితో ఎలాంటి నష్టం కలిగిస్తాయో కూడా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వద్ద కూడా దీనికి సరైన సమాధానం లేదు. ఆటలో దూసుకుపోతున్న సమయంలో ‘అతి’గా ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం కూడా ప్రాంజలను నష్టపర్చింది. ఒక మ్యాచ్‌లో 6–3, 5–2, 30–30తో విజయానికి బాగా చేరువైన సమయంలో కూడా అనారోగ్యంతో తప్పుకోవాల్సి రావడం ఆమె పరిస్థితిని చూపించింది.
‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ట్రైనింగ్ చేసేదానిని. జిమ్‌లో కూడా చాలా ఎక్కువగా బరువును ఎత్తేదానిని. దాని వల్ల ఏమైనా అయితే ఎలా కోలుకోవాలనే విషయంపై కనీస సమాచారం కూడా లేదు.
వెన్నునొప్పి, తుంటి నొప్పి, మోకాలు, మడమ... ఇలా ఒకదాని తర్వాత మరో గాయం వెంటాడింది. జిమ్‌లో బరువుల ప్రభావంతో కండరాలు బాగా బిగుసుకుపోయాయి. దాంతో శరీరంలో సమతుల్యత లభించింది.
రెండు నెలలో తగ్గే గాయాలకు కూడా ఆరు నెలలు పట్టింది. నేను చేసిన ఎక్సర్‌సైజ్‌లతోనే నాకు బాగా నష్టం జరిగిందనే విషయం కూడా నాకు ఇటీవల అర్థమైంది. అంతకుముందు ఏమీ తెలీదు. తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని’ అని ప్రాంజల తన ఆవేదనను ప్రదర్శించింది.
ఏఐటీఏ చొరవ చూపిస్తేనే...
కొన్నేళ్ల క్రితం చైనా మహిళా టెన్నిస్ ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టింది. ముఖ్యంగా తమ అగ్రశ్రేణి క్రీడాకారిణులకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు భారత్‌లో 16–24 వయసు మధ్య టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలకు కూడా అలాంటిది అవసరం ఉంది. దీనిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి.
‘భారత మహిళా ప్లేయర్లు విడివిడిగా కాకుండా ఒక బృందంగా టోర్నీలకు వెళ్లటం మేలు చేస్తుంది. అప్పుడు ఏఐటీఏ వారి కోసమే ఒక కోచ్‌ను, ఫిజియోను పంపే అవకాశం ఉంటుంది.
సరిగ్గా చెప్పాలంటే అమ్మాయిలకు 360 డిగ్రీ పర్యవేక్షణ అవసరం. న్యూట్రిషన్, మానసిక దృఢత్వం, మ్యాచ్‌ల విశ్లేషణ, సరైన షెడ్యూలింగ్, ప్రాక్టీస్‌కు స్పేర్ పార్ట్‌నర్‌లు...ఇలా అన్నింటి అవసరం ఉంది.
రాబోయే రోజుల్లో భారత్‌లో పెద్ద సంఖ్యలో టోర్నీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 3–4 ఏళ్ల పాటు ప్రస్తుత ప్లేయర్లకు అండగా నిలవాల్సి ఉంది. లేదంటే ఈ ప్రతిభ వృథా అవుతుంది’ అని ప్రముఖ టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్ సుందర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఏఐటీఏ మేల్కొనకపోతే ప్రాంజల కెరీర్‌ను దెబ్బ తీసిన అనుభవాలు మున్ముందూ ఎదురు కావచ్చు.
-సాక్షి క్రీడా విభాగం