
సుదిర్మన్ కప్ సమరానికి సిద్ధం
ఏప్రిల్ 27 నుంచి మే 4 వరకు చైనాలో మెగా ఈవెంట్
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్‌లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈనెల 27 నుంచి చైనాలోని జియామెన్ నగరంలో ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’కు తెర లేవనుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.
బ్యాడ్మింటన్‌లో ప్రముఖ టీమ్ ఈవెంట్స్ అయిన థామస్ కప్, ఉబెర్ కప్‌లలో... ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లలో భారత జట్లు పతకాలు సాధించాయి. కానీ 36 ఏళ్ల చరిత్ర కలిగిన సుదిర్మన్ కప్‌లో మాత్రం ఇప్పటి వరకు భారత్ పతకాల బోణీ కొట్టలేదు. అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులతో చైనాకు బయలుదేరనున్న భారత బృందం ఈసారి పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.
న్యూఢిల్లీ: మొత్తం ఐదు మ్యాచ్‌లు... అందులో మూడు గెలిస్తే చాలు విజయం ఖరారు... పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు స్టార్లు... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్... పురుషుల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ... ఈ మూడు విభాగాల్లో మనవాళ్లు సహజశైలిలో విజృంభిస్తే భారత్‌కు గెలుపుతోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న పతకం అందుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సుదిర్మన్ కప్‌లో విశేషంగా రాణిస్తేనే పతకాన్ని మెడలో వేసుకోవడం సాధ్యమవుతుంది.
ఈనెల 27 నుంచి మే 4 వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్‌లో పోటీపడనున్న భారత జట్టును మంగళవారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. చిరాగ్ శెట్టి వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ నెలలోనే జరిగిన ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ జోడీ పాల్గొనలేదు. ప్రస్తుతం చిరాగ్ ఈ గాయం నుంచి తేరుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో సుదిర్మన్ కప్‌లో ఈ జోడీ పునరాగమనం చేయనుంది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఐదు టోర్నీల్లో ఆడి రెండింటిలో సెమీఫైనల్‌కు చేరుకుంది.
మహిళల డబుల్స్‌లో మినహా మిగతా నాలుగు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. భారత నంబర్‌వన్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఈ జంట సుదర్మిన్ కప్‌లో ఆడటంలేదు. ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లోనూ గాయత్రి–ట్రెసా జోడీ బరిలోకి దిగలేదు. గాయత్రి–ట్రెసా జోడీ స్థానంలో ప్రియా–శ్రుతి మిశ్రా ద్వయం సుదిర్మన్ కప్‌లో ఆడనుంది. నాలుగు విభాగాల్లో బ్యాకప్ ప్లేయర్లను ఎంపిక చేసిన ‘బాయ్’ మహిళల డబుల్స్‌లో ఒక్క జోడీనే ఎంపిక చేయడం గమనార్హం.
క్లిష్టమైన ‘డ్రా’...
ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా సుదిర్మన్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘డి’లో భారత్, మాజీ చాంపియన్ ఇండోనేసియా, మాజీ రన్నరప్ డెన్మార్క్‌తోపాటు ఇంగ్లండ్ జట్లున్నాయి.
ఇంగ్లండ్ జట్టుపై భారత్ గెలిచే అవకాశం ఉన్నా... ఇండోనేసియా, డెన్మార్క్‌లపై నెగ్గాలంటే స్టార్ క్రీడాకారులు పూర్తిస్థాయిలో విజృంభించాల్సి ఉంటుంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగిశాక నాలుగు గ్రూప్‌ల నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ చేరుకున్న జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి.
సుదిర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ జట్టు
పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ (ప్రపంచ 18వ ర్యాంక్), హెచ్‌ఎస్ ప్రణయ్ (ప్రపంచ 30వ ర్యాంక్).
మహిళల సింగిల్స్: పీవీ సింధు (ప్రపంచ 18వ ర్యాంక్), అనుపమ ఉపాధ్యాయ్ (ప్రపంచ 44వ ర్యాంక్).
పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ప్రపంచ 11వ ర్యాంక్); హరిహరన్–రూబన్ కుమార్ (ప్రపంచ 42వ ర్యాంక్).
మహిళల డబుల్స్: ప్రియా కొన్‌జెంగ్‌బమ్–శ్రుతి మిశ్రా (ప్రపంచ 39వ ర్యాంక్).
మిక్స్‌డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (ప్రపంచ 17వ ర్యాంక్), సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ (ప్రపంచ 33వ ర్యాంక్).