‘హ్యాట్రిక్’కు అడుగు దూరంలో...
మకావు ఓపెన్ ఫైనల్లో సింధు
వరుసగా మూడో ఏడాది ఈ ఘనత
నేడు మితానితో అమీతుమీ
మకావు: గత ఏడాది కాలంగా లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి అంతిమ సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఐదో సీడ్ సింధు 21-8, 15-21, 21-16తో ప్రపంచ పదో ర్యాంకర్, రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు, యామగుచి 1-1తో సమమయ్యారు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఆరో సీడ్ మినత్సు మితాని (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది.
ముఖాముఖి రికార్డులో సింధు 0-1తో వెనుకబడి ఉంది. వీరిద్దరూ ఇదే సంవత్సరం జపాన్ ఓపెన్‌లో ఏకైకసారి తలపడగా సింధు మూడు గేమ్‌ల పోరాటంలో ఓడిపోయింది. మకావు ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంటుంది. గత ఏడాది ఇదే మకావు ఓపెన్‌లో చివరిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించిన సింధుకు ఆ తర్వాత ఇతర టోర్నీల్లో నిరాశ ఎదురైంది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా సంతృప్తి పడింది.
రెండుసార్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యామగుచితో జరిగిన మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు తొలి గేమ్‌ను సునాయాసంగానే సొంతం చేసుకున్నా... రెండో గేమ్‌లో తడబడి మూల్యం చెల్లించుకుంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు పుంజుకొని 11-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి తేరుకున్నా సింధు సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.
నేటి ఫైనల్స్
ఉదయం గం. 10.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం