దాదాపు ఏడాది క్రితం... దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ జరుగుతోంది. భారత్, కొరియా మధ్య పోరు... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... ఎదురుగా ప్రత్యర్థి ఒక వర్ధమాన షట్లర్... ఆమె ఆట గురించి సింధుకు కూడా బాగా తెలుసు. అందుకే తనదైన వ్యూహాలతో సన్నద్ధమై బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు 21–18తో గెలుచుకుంది. కానీ అటు వైపు ఉన్న అమ్మాయి వెంటనే కోలుకుంది.
అంతే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తర్వాతి రెండు గేమ్‌లను అలవోకగా 21–5, 21–9తో సొంతం చేసుకొని మ్యాచ్‌ను తన ఖాతాలో వేసేసుకుంది. సింధు ముఖంలో తీవ్ర నిరాశ... ఎందుకంటే ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇద్దరూ 6 మ్యాచ్‌లలో తలపడితే ఆరోసారి కూడా కొరియా ప్లేయరే విజయం సాధించింది. 2019 నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క మ్యాచ్‌లో కూడా సింధు గెలవలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.
రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, వరల్డ్ చాంపియన్, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్‌లు సాధించి వరల్డ్ బ్యాడ్మింటన్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సింధును కూడా ఒక ఆటాడుకుంటున్న ఆ అమ్మాయి పేరే ఆన్ సె యంగ్... టీనేజ్ దాటకముందే టాప్ షట్లర్లందరినీ ఓడిస్తూ దూసుకు వచ్చి ఆపై విశ్వ విజేతగా కూడా నిలిచిన 22 ఏళ్ల కొరియన్ స్టార్ షట్లర్.
‘కొరియాను ఆదుకున్న స్కూల్ గర్ల్’... ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్‌లో గ్రూప్ దశలో డెన్మార్క్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆన్ సె యంగ్ విజయం తర్వాత కొరియా అంతటా కనిపించిన హెడ్‌లైన్స్ ఇవి. ఈ పోరులో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత టీమ్ స్కోరు 2–2తో సమంగా ఉన్న దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగింది. తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటిన యంగ్ తన డెన్మార్క్ ప్రత్యర్థి లైన్ క్రిస్టోఫర్‌సెన్‌ను ఓడించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ఈ టోర్నీలో కొరియా జట్టుకు కాంస్య పతకం అందించడంలో కూడా 16 ఏళ్ల యంగ్ కీలక పాత్ర పోషించింది.
ఈ క్రమంలో కొరియా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి స్కూల్‌గర్ల్‌గా ఈ అమ్మాయి గుర్తింపు పొందింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆపై ఇవే విజయాలను కొనసాగిస్తూ ఉన్నతస్థానానికి దూసుకుపోయింది. అంతకు ముందు ఏడాదే కొరియా జూనియర్ టీమ్ తరఫున ఆసియా చాంపియన్‌షిప్ గెలిచినప్పుడే ఈ టీనేజర్‌లో ఎంతో సత్తా ఉందని, సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్మారు. వాటిని వమ్ము చేయకుండా ఆన్ సె యంగ్.. నిజం చేసి చూపించింది.
స్టార్ షట్లర్లను ఓడించి...
కరోలినా మరీన్, అకీనా యమగూచి, సైనా నెహ్వాల్... బ్యాడ్మింటన్‌లో ఈ ముగ్గురూ సూపర్ స్టార్లు. ఎన్నో గొప్ప విజయాలు వీరి ఖాతాలో ఉన్నాయి. మరి ఈ ముగ్గురినీ ఒకే టోర్నమెంట్‌లో ఒక ప్లేయర్ ఓడగొడితే ఆ ప్లేయర్ స్థాయి ఏంటో ప్రపంచమంతటికీ అర్థమవుతుంది. ఆన్ సె యంగ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఉబెర్ కప్‌లో సీనియర్ల చాటున జూనియర్‌గా టీమ్ ఈవెంట్‌లో మంచి ప్రదర్శన కనబరచిన యంగ్ 2019 ఆరంభం నుంచే వ్యక్తిగత టోర్నీల్లో ప్రదర్శనతో సత్తా చాటింది. సూపర్–100 నుంచి సూపర్–300 స్థాయి వరకు వరుసగా నాలుగు టోర్నీల్లో ఆమె విజేతగా నిలిచింది.
ఇందులో ఒక టోర్నీలో 2012 ఒలింపిక్స్ విజేత లీ జురుయ్‌ని ఫైనల్లో ఓడించగలిగింది. అయితే ప్రతిష్ఠాత్మక, పెద్ద టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో ఆటతో ఆన్ సె యంగ్ స్థాయి మరింత పెరిగింది. పై ముగ్గురు స్టార్లను ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడంతో యంగ్‌కు ఎదురు లేకుండా పోయింది. 2019లో ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకొని మరోదాంట్లో రన్నరప్‌గా నిలవడంతో సహజంగానే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఆమె ఎంపికైంది.
ఈ అవార్డు సాధించడం అంటే ఈ అసాధారణ ప్లేయర్ ఇక ముందు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించేందుకు సిద్ధంగా ఉందని అర్థం. యంగ్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాతి రెండేళ్లలో డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్, కొరియా ఓపెన్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్... ఇలా వేదిక మారడమే తప్ప యంగ్ విజయాల్లో మార్పు లేదు. వరుసగా టోర్నీలు ఆమె ఖాతాలో చేరాయి. 2022 ముగిసే సరికి సీనియర్ కెరీర్‌లో అప్పటికే 11 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలుచుకొని మరో 5 టోర్నీల్లో సె యంగ్ రన్నరప్‌గా నిలవడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం.
సూపర్ 2023...
చాలామంది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్లతో పోలిస్తే ఆన్ సె యంగ్ ఆట శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ శారీరక కదలికలతోనే ప్రత్యర్థిని బోల్తా కొట్టించే తత్వం ఆమెది. కోర్టులో అన్ని వైపులా పరుగెత్తుతూ సమాధానమిచ్చే శైలికి యంగ్ దూరం. కెరీర్ తొలుతలో దూకుడుగా ఆడుతూ అటాకింగ్‌ను ఇష్టపడిన ఆమె ఇప్పుడు ఎక్కువ భాగం డిఫెన్స్‌తోనే పాయింట్లు రాబడుతోంది. అటు వైపు షట్లర్ ఎంత వేగంగా షటిల్‌ను సంధించినా ప్రశాంతంగా రిటర్న్ ఇవ్వగలదు. దాంతోనే వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఒత్తిడిలోకి నెట్టడం, ఫలితంగా విన్నర్ల ద్వారానే పాయింట్లు రాబట్టగలగడం యంగ్ ఆటతీరులో కనిపిస్తుంది.
ఇదే ఆట ఆమెకు 2023లో అద్భుతాలను అందించింది. తిరుగులేని ఆటతో ఒకటి, రెండు కాదు... ఏకంగా 9 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ ఆమె గెలుచుకోగలిగింది. ఇందులో బ్యాడ్మింటన్‌లో అన్నింటికంటే అత్యున్నత స్థాయి అయిన సూపర్ 1000 టైటిల్స్ మూడు ఉన్నాయి. మరో రెండు టోర్నీల్లో యంగ్ రన్నరప్‌గా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో ప్లేయర్ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఏకఛత్రాధిపత్యంతో ఈ కొరియా అమ్మాయి ఆటను శాసించింది.
విశ్వవిజేతగా... నంబర్‌వన్‌గా...
ఆన్ సె యంగ్ సత్తా, స్థాయి ఏమిటో ఇతర అగ్రశ్రేణి స్టార్ షట్లర్లతో ముఖాముఖీ సమరాల్లోనే తెలుస్తుంది. పీవీ సింధుపై ఏకపక్ష ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రికార్డు స్థాయిలో 214 వారాల పాటు వరల్డ్ నంబర్ ఉన్న తై జు యింగ్, మరీన్, ఒకుహారాలపై విజయాలపరంగా ఆమెదే పైచేయి. 2016 నుంచి ఇటీవలి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించిన తై జుపై 10–3 విజయాల ఆధిక్యం ఉందంటే ఆమె స్థానాన్ని యంగ్ అందుకొని కొత్త తరం ఘనతకు శ్రీకారం చుట్టినట్లే. 2023లో మరో మూడు ప్రత్యేకతలు యంగ్‌ను వరల్డ్ బ్యాడ్మింటన్‌లో హాట్ స్టార్‌ను చేశాయి.
డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి కొరియా మహిళగా రికార్డులకెక్కింది. హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి ఇక్కడా కొరియా తరఫున తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇన్ని విజయాల తర్వాత సహజంగానే ర్యాంకింగ్స్‌లో శిఖరానికి చేరడం లాంఛనంగానే మిగిలింది.
ఊహించినట్లుగానే ఆగస్టులో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచి ఆపై వరుస టైటిల్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఒలింపిక్స్‌లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగినా... ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ మాత్రం పతకం కోసం ఆమెను పిలుస్తోంది. యంగ్ ప్రస్తుత ఫామ్ చూస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కొరియా ప్లేయర్ ఇప్పటికే సాధించిన ఘనతలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో చెలరేగుతున్న ఆమె మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
∙మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment