విశ్వ క్రీడలకు సిద్ధమవుతున్న భారత క్రీడాకారులకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. వీలైనన్ని ఎక్కువ పసిడి, రజత, కాంస్య పతకాలు గెలవాలని ఆకాంక్షించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.
కాగా జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు ప్యారిస్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. భారత్ నుంచి మొత్తంగా 118 మంది అథ్లెట్లు ఇందులో భాగం కానున్నారు. ఇందులో 48 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. పతకధారిగా బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు వ్యవహరించనున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశాడు. ‘‘ఇండియా, భారత్, హిందుస్థాన్. ఒకప్పుడు ఇండియా అంటే ఏనుగులు, పాములను తమ నాగస్వరంతో అలరించే వ్యక్తులు మాత్రమే అని ప్రపంచం భావించేది.
కాలం మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామ్య దేశంగా మనదేశం గుర్తింపు పొందింది. గ్లోబల్ టెక్ హబ్‌గా రూపుదిద్దుకుంది.
అన్నిటికంటే గొప్ప విషయం అదే
క్రికెట్, బాలీవుడ్, స్టార్టప్ యూనికార్న్‌లు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మనకు పేరొచ్చింది. మన జాతికి వీటి కంటే గొప్ప విషయం ఇంకేదైనా ఉందా అంటే? మరిన్ని స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలవడమే.
మన సోదర సోదరీమణులు మెడల్స్ గెలవాలనే సంకల్పంతో ప్యారిస్‌కు పయనమవుతున్నారు. కోట్లాది మంది భారతీయుల కలలను మోసుకు వెళ్తున్నారు.
దేశం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు వారికి మద్దతునివ్వాలి. తిరంగా సగర్వంగా రెపరెపలాడుతూ ఉన్నవేళ మన వాళ్లు పోడియం వద్ద పతకాలు స్వీకరిస్తుంటే.. ఇండియా.. ఇండియా.. ఇండియా అంటూ చేసే హర్షధ్వానాల్లో మీరూ భాగం కావాలి’’ అని విరాట్ కోహ్లి ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్తున్న క్రీడాకారులకు మద్దతు తెలిపాడు.
నీరజ్ చోప్రా పసిడి పతకంతో మురిసిన భారత్
కాగా టోక్యో వేదికగా గత ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణ పతకం అందించిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
చదవండి: Champions Trophy: పాక్ కాదు.. భారత్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!
Comments
Please login to add a commentAdd a comment