భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధుకు పెళ్లి గడియలు సమీపించాయి. వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్యక్తితో ఆమె వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.
ఆసక్తికర విషయాలు
ఈ నేపథ్యంలో పీవీ సింధుకు కాబోయే భర్త, వరుడు వెంకట దత్తసాయి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటన్న అంశం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు.
అంతకంటే ముందు.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ
అనంతరం.. బహుళజాతి సంస్థ జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్)లో వెంకట దత్తసాయి తన కెరీర్ మొదలుపెట్టారు. అక్కడ సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్‌హౌజ్‌గా కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే, తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం.
లింక్డిన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు.. ‘‘ఐపీఎల్ జట్టు నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చు. అయితే, ఈ రెండింటి నుంచి నేను కావాల్సినంత విజ్ఞానం పొందాను’’ అని వెంకట దత్తసాయి రాసుకొచ్చారు.
కృతజ్ఞతలు సింధు
ఇక గతంలోనూ వెంకట దత్తసాయి, పీవి సింధుకు లింక్డిన్‌లో రిప్లై ఇచ్చిన తీరును కూడా నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. దత్తసాయి తండ్రిని ఉద్దేశించి.. ‘‘లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని పీవీ సింధు పేర్కొనగా.. ‘‘నాన్నను స్వాగతించినందుకు కృతజ్ఞతలు సింధు’’ అని వెంకట దత్తసాయి పేర్కొన్నారు.
ఉదయ్‌పూర్ వేదికగా
కాగా వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక పీవీ సింధు వివాహానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. డిసెంబరు 22న పెళ్లి జరుగనుంది. రెండురోజుల తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. కాగా సింధు 2016 రియో విశ్వ క్రీడల్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment