క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్‌నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్‌నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్‌మెంట్ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం.
కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్‌తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు.
ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
నిరంతరం రిస్క్‌తో కూడుకున్నదే. ఆటలను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్ బరిలోకి దిగా' అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.
చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!


