
పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధతపై పీవీ సింధు వ్యాఖ్య
పారిస్: ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ పతకంపై దృష్టి పెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తను ఎంతగా కష్టపడింది కోర్టులోనే తెలుస్తుందని చెప్పింది. రియో (2016)లో రజతం, టోక్యో (2020)లో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ షట్లర్ గత కొన్నాళ్లుగా కఠోర ప్రాక్టీసులో నిమగ్నమైంది. ఇప్పుడదే ఆత్మవిశ్వాసంతో ‘పారిస్’ కలను సాకారం చేసుకునేందుకు వచి్చంది. గతంలో ఏ భారత క్రీడా కారుడు కూడా మూడు ఒలింపిక్ పతకాలు గెలిచిన దాఖలాల్లేవు. ఒకవేళ సింధు గనక పోడియంలో నిలిస్తే అది గొప్ప చరిత్రే అవుతుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘అవును మరో పతకమే నా లక్ష్యం.
నేను ఇప్పటికే రెండు పతకాలు గెలిచాను. కానీ అదేపనిగా ఆలోచించి ఆ ఒత్తిడిని తలకెక్కించుకోను. ఎప్పుడు ఒలింపిక్స్ ఆడినా అదే కొత్తగా అనిపించింది నాకు. అందుకేనేమో పతకం గెలిచా. ఇప్పుడు కూడా అలాగే బరిలోకి దిగుతాను. మూడో పతకంతో ‘హ్యాట్రిక్’ సాధిస్తా’ అని సింధు తెలిపింది. ఇక్క డికి వచ్చేముందు చివరగా ఆమె జర్మనీలోని సార్ బ్రుకెన్‌లో తుది సన్నాహాలు చేసింది. పారిస్‌లాంటి వాతావరణ పరిస్థితులు సార్‌బ్రుకెన్‌లోనూ ఉండటం వల్ల సింధు స్థానిక పరిస్థితుల్ని ఆకలింపు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రాక్టీస్ వేదికను ఎంచుకుంది.
ప్రకాశ్ పడుకోన్ వద్ద తీసుకున్న శిక్షణలో కచి్చతమైన స్ట్రోక్స్‌ను నేర్చుకున్నానని చెప్పింది. ‘ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యాచ్‌లు కూడా చాలా సేపు జరుగుతుండటంతో ఆ దిశగా నేను కసరత్తు చేశాను. ఇప్పుడు ర్యాలీలు ఎంతసేపు సాగినా ఏ ఇబ్బంది లేదు. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని 29 ఏళ్ల సింధు వివరించింది.