పీవీ సింధు
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవంలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడం అనిర్వచనీయమైన అనుభూతి. ఒలింపిక్ వేదికపై తొలిసారి పతాకధారిగా టీమిండియాకు ముందు నిలవడంతో ఇది నాకు మరింత ప్రత్యేకం. గతంలో రియో, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా ఇవి నాకు మూడో విశ్వక్రీడలు. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని మాటల్లో వర్ణించలేం. ఈసారి కూడా అంతే. పారిస్ క్రీడాగ్రామంలో అడుగుపెట్టగానే కొత్త ఉత్సాహం వచి్చంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
ఈసారి భారత బృందంలో 70 మందికి పైగా అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు. వారు కాస్త ఆందోళన చెందుతుండొచ్చు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో నా పరిస్థితి కూడా అంతే. కానీ ఈసారి విశ్వక్రీడల్లో అరంగేట్రం చేస్తున్న వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారు యువభారతానికి ప్రతీకల్లా కనిపిస్తున్నారు. ఈ తరం మరింత ఉత్సాహంగా ఉంది. తాము ఎవరికంటే తక్కువ కాదనే నమ్మకం వారిలో కనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సాధించిన విజయాల వల్ల వారి ఆలోచనల్లో ఈ మార్పు వచి్చంది. ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే క్రమంలో ప్రభుత్వ సహకారం మరవలేనిది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన ప్రేరణ, మానసిక బలం అథ్లెట్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 117 మంది భారత బృందం అటు అనుభవజు్ఞలు, ఇటు యువకులతో సమతూకంగా ఉంది.
ప్రతీ అథ్లెట్ తమ తమ విభాగాల్లో అత్యుత్తమ శిక్షణ పొందడంతో పాటు... మానసిక స్థయిర్యాన్ని సాధించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇతోధిక సాయం చేసింది. అథ్లెట్లు అడిగిన సౌకర్యాలన్నింటినీ క్రీడాశాఖ సమకూర్చింది. ఇప్పుడు యావత్ భారతావని నమ్మకాన్ని నిలబెట్టడం అథ్లెట్ల బాధ్యత. పారిస్ ఒలింపిక్స్–2024లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసేందుకు సిద్ధంగా ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment