మన దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) పతకం లక్ష్యంగా బరిలోకి దిగి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన ఓటమికి గల కారణాలను వివరిస్తూ..తన మనసు శరీరం విరామం కోరుకుంటుందంటూ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంది. మానసిక శారీరం ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకుని బ్యాడ్మింటన్‌లో కొనసాగుతానని చెప్పుకొచ్చింది. ఇక్కడ పీవీ సింధు తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య నిపుణులు స్వాగతించడమే గాక ప్రశంసించారు. నిజానికి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకోవడమే మంచిదా..? నిపుణులే ఏమంటున్నారంటే..
ఏ వృత్తి లేదా క్రీడల్లో ఒత్తిడి అనేది సహజం. ప్రతిసారి మనదే పైచేయి అవుతుందని చెప్పలేం. అలాగే మనపై మన వాళ్లు పెట్టుకునే భారీ అంచనాలు ఒక్కోసారి తలకిందులై విమర్శలపాలవ్వుతాం. అలాంటప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అన్నికంటే ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన క్లిష్టమైన సమయం అని అంటున్నారు నిపుణులు. ఇక్కడ పీవీ సింధుపై భారీ అంచానలు ఉన్నాయి.
ఈసారి ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకుంటుందనుకున్నారు. అలాగే ఆమె కూడా విజయం తనదే అని గట్టిగా విశ్వసించింది. అందుకోసం జరిగిన ప్రిపరేషన్‌లో గాయాలు, ఒత్తిడి మాములుగా ఉండవు. తీరా బరిలోకి దిగాక ప్రత్యర్థి ఎత్తు, దూకుడు ఊహకందని విషయం అనేది తెలిసిందే. అనుకోని రీతీలో పరాజయం పాలైతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడికైన జీర్ణించుకోలేని బాధ, ఆవేదన ఉంటాయి. అయినా ఆటలో గెలుపోటములు సహజం అని తెలిసినా..ఒక్కోసారి ఇంత కష్టం వృధా అయ్యిందన్న బాధ నిలువనియ్యదు.
అలాంటప్పడే ఏ మనిషి అయినా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అమూల్యమైన సమయం. ఇక్కడ కోపం, బాధను పక్కన పెట్టి మానసికంగా దృఢంగా ఉండేందుకు యత్నించాలి. అంటే ఆరోగ్యంపై పూర్తి దృష్టిసారించగలిగితేనా ఏదైనా చేయడం సాధ్యం అవుతుందనేది గుర్తించాలి. అదే పని సింధు చేసింది ఇక్కడ. అలుపెరగని ప్రాక్టీస్, ఒత్తిడులతో అలసిపోయానని చెప్పడమే గాక తన మనుస్సు, శరీరం విశ్రాంతి కోరుకుంటుందనే సంకేతాల్ని గుర్తించి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది సింధు.
అన్ని సంపదల్లోకెల్లా "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న నానుడిని స్పురణకు తీసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పకనే చెప్పింది అని నిపుణులు అంటున్నారు. ఆటలోనే కాదు జీవనశైలిలోనూ స్ఫూర్తిగా నిలిచిందంటూ సింధు నిర్ణయాన్ని కొనియాడుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడైనా శరీరం, మనసు తాను బాగాలేను, సిద్ధంగా లేను అని చెబుతున్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కాస్త విశ్రాంతి తీసుకుని నూతన ఉత్సాహంతో మళ్లీ కార్యరంగంలోకి దిగి మంచి మంచి విజయాలను అందుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగుంటాం అని చెబుతున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment