న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం అంచనాలతో బరిలోకి దిగినా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో కూడా ఆమె విఫలమైంది. ఈ నేపథ్యంలో సింధు భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. అయితే తాను ఆటను ఇంకా ముగించలేదని సింధు స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు... 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించింది. వచ్చే ఒలింపిక్స్ సమయానికి సింధుకు 33 ఏళ్లు నిండుతాయి. ‘ఆ సమయానికి నేను ఫిట్‌గా, గాయాలు లేకుండా ఉంటే కచి్చతంగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతాను.
ఇప్పుడైతే నా ఆలోచన ఇదే. కాబట్టి ప్రస్తుత నా లక్ష్యం పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ప్రయతి్నంచడం. అప్పుడు సహజంగానే ఆడాలనే ప్రేరణ లభిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ఎంతో సాధించాలనే తపన ఉంది. మరిన్ని టైటిల్స్ గెలిచి పోడియం మీద నిలబడాలని భావిస్తున్నా. నా ఆటతో భవిష్యత్ తరాలను స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నా. అందుకోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తా’ అని సింధు పేర్కొంది. పారిస్‌లో ఓటమితో తానేమీ బాధ పడలేదని, పరాజయంతో ప్రపంచం ఆగిపోదని ఆమె అభిప్రాయ పడింది. ‘నా కెరీర్‌లో రెండు ఒలింపిక్స్‌లు అద్భుతంగా సాగాయి. అయితే ప్రతీసారి అలా జరగదు. మూడోసారి పతకం గెలవలేకపోయా.
నేను బాగానే ఆడానని అనుకుంటున్నా. అక్కడితో అంతా ముగిసిపోలేదు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి పారిస్ వైఫల్యంపై బాధ లేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు’ అని సింధు చెప్పింది. తన ఆటతీరు మెరుగుపర్చుకునే క్రమంలో మాజీ ఆటగాళ్లు లీ హ్యూన్, అనూప్ శ్రీధర్‌ల వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మార్పు తప్పనిసరి అవుతుందని... అదే కారణంతో గత కోచ్‌ల వద్ద శిక్షణకు గుడ్‌బై చెప్పి కొత్త కోచ్‌లను ఎంచుకున్నట్లు సింధు వివరించింది. త్వరలో జరిగే జపాన్, చైనా ఓపెన్‌లపై దృష్టి పెట్టానని, మళ్లీ వరుస విజయాలు దక్కుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
‘ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నా. పూర్తి ఫిట్‌గా కూడా మారాను. స్పీడ్, డిఫెన్స్‌కు సంబంధించి కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. కోచ్‌ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. వారి పర్యవేక్షణలో రాబోయే జపాన్, చైనా టోర్నీల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. అక్కడినుంచే మ్యాజిక్ మొదలవుతుంది. చూస్తూ ఉండండి’ అని సింధు వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలో తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని... ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాబోయే ఏడాదిన్నర కాలంలో అది సిద్ధమవుతుందని సింధు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment