మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి–సుమీత్ రెడ్డి జోడీ ముందంజ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో రెండో సీడ్, భారత స్టార్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–12తో హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్ ఆరంభంలో కాస్త పోటీ ఎదురైంది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ సుపనిదతో సింధు ఆడుతుంది.
ముఖా ముఖి రికార్డులో సింధు 5–3తో ఆధిక్యంలో ఉంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ ద్వయం 22–20, 21–18తో ప్రెస్లీ స్మిత్–అలీసన్ లీ (అమెరికా) జంటపై గెలిచింది.
అశ్విని–తనీషా జోడీ గెలుపు
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా జంట 21–14, 21–8తో టిఫానీ హో–గ్రోన్యా సోమర్‌విల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–అర్జున్ (భారత్) ద్వయం 21–17, 21–19తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్) జంటపై నెగ్గగా... గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జోడీ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్–తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment