శ్రీకాంత్, ప్రణయ్‌ జోరు | Indias star shuttlers into the quarter finals | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్, ప్రణయ్‌ జోరు

Published Fri, Jun 16 2023 3:11 AM | Last Updated on Fri, Jun 16 2023 3:11 AM

Indias star shuttlers into the quarter finals - Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్‌ ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)పై గెలుపొందాడు.

గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్‌ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్‌ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ 20–14తో విజయానికి పాయింట్‌ దూరంగా నిలిచాడు.

అయితే లక్ష్య సేన్‌ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్‌ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్‌ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 

మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్‌ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్‌ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన  సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్‌ తైపీ ప్లేయర్‌ చేతిలో ఓడిపోయింది.  

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ  పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ –చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్‌–జౌ హావో డాంగ్‌ (చైనా) జంటపై గెలిచింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement