జకార్తా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ నేటి నుంచి మొదలయ్యే ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సీజన్‌లో ఆరు టోర్నీల్లో ఆడిన సింధు ఒక్క దాంట్లోనూ ఫైనల్ చేరలేకపోయింది. గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత్ ఆశలన్నీ సింధుపైనే ఉన్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడుతుంది.
సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌లో అతను కెంటో నిషిమోటో (జపాన్)తో ఆడతాడు. వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment