సింధు తాత్కాలిక కోచ్ అనూప్ శ్రీధర్ వ్యాఖ్యా
న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంచుకున్న సింధు దాదాపు గత మూడు వారాలుగా అతనితో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోందని, తన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కొనసాగుతోందని శ్రీధర్ వెల్లడించాడు. ‘సింధు ఆటలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంతో పాటు కొన్ని కొత్త విషయాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా.
ఇప్పటి వరకు మేం ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా పక్కా ప్రణాళికతో సాధన చేస్తున్నాం. ఈ మూడు వారాల్లో ఆమె ఆటలో చాలా మార్పు వచ్చింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సింధులో మరిన్ని విజయాలు సాధించాలనే తపన ఉంది. గతంలోకంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతోంది. ఈ సాధనతో వచ్చే టోరీ్నల్లో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆరంభ రౌండ్లలో బాగా ఆడితే ఆ తర్వాత టైటిల్స్ సాధించడం లాంఛనమే అవుతుంది.
ఆమె ఆటలో నిలకడ తీసుకొచ్చి మరిన్ని విజయాలు వచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని అనూప్ శ్రీధర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక కోచ్‌గానే వచ్చాను కాబట్టి ఒక్కో వారం చొప్పున సమీక్ష చేస్తూ కోచింగ్ కొనసాగిస్తున్నానన్న శ్రీధర్... ఇదే కారణంతో సుదీర్ఘ కాలపు ప్రణాళికలు వేయడం లేదని స్పష్టం చేశాడు.
సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్
పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్‌లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్‌లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సల్టింగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది.
రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది. దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్‌తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్‌లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది.
మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్
అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు.
ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు.
Comments
Please login to add a commentAdd a comment