చైనాను చిత్తు చేసిన భారత్‌.. | Badminton Asia Team Championships: Anmol Kharb Thrilling Win India Beat China | Sakshi
Sakshi News home page

చైనాను చిత్తు చేసిన భారత్‌.. ‘విలువైన’ విజయం

Published Wed, Feb 14 2024 1:11 PM | Last Updated on Wed, Feb 14 2024 1:43 PM

Badminton Asia Team Championships: Anmol Kharb Thrilling Win India Beat China - Sakshi

అన్మోల్‌ గెలుపుతో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ (PC: BAI Media X)

బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌-2024 టోర్నీలో భారత మహిళా జట్టు అదరగొట్టింది. మలేషియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో టాప్‌ సీడ్‌ చైనా జట్టును ఓడించి టేబుల్‌ టాపర్‌గా క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. 

ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్‌- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్‌ హాన్‌ యేతో తలపడింది. దాదాపు మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఒలింపియన్‌ 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది.

అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్‌ జంట అశ్విన్‌ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్‌ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్‌ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్‌ ఖర్బ్‌.. వూ లువో యూతో బుధవారం తలపడింది. 

భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల ఈ యువ ప్లేయర్‌ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్‌ అయిన అన్మోల్‌.. 172వ ర్యాంకర్‌ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది.  

ఈ క్రమంలో చైనాను 3-2తో చిత్తు చేసిన భారత మహిళా జట్టు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌లో ఇదొక చారిత్రక దినమంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement