
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది.
వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది.