యూఎస్ ఓపెన్‌లో కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో 19 ఏళ్ల లేలా వరుసగా మూడో సంచలన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) కూడా యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
న్యూయార్క్: అనామక క్రీడాకారిణిగా యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టిన కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ అద్భుత విజయాలతో వారం రోజుల్లోనే అందరూ తనవైపు దృష్టి సారించేలా చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్ లేలా 2 గంటల 24 నిమిషాల్లో 6–3, 3–6, 7–6 (7/5)తో ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. స్వితోలినాతో జరిగిన మ్యాచ్‌లో లేలా కీలక సందర్భాల్లో సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే ఏస్ సంధించిన లేలా నెట్ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలవడం విశేషం.
క్రిచికోవా ఓటమి
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–3, 6–4తో 11వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి క్వాలిఫయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది.
ఫిలిక్స్ తొలిసారి...
పురుషుల సింగిల్స్‌లో 12వ సీడ్ ఫిలిక్స్ ఉజెర్ అలియాసిమ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరాడు. తద్వారా యూఎస్ ఓపెన్ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి కెనడా ప్లేయర్‌గా ఘనత వహించాడు. స్పెయిన్ టీనేజ్ సంచలనం కార్లోస్ అల్కారజ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల ఫిలిక్స్ తొలి సెట్‌ను 6–3తో సొంతం చేసుకొని, రెండో సెట్‌లో 3–1తో ఆధిక్యం సాధించాడు. ఈ దశలో అల్కారజ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు.
US Open 2021 Leylah Fernandez: సూపర్ లేలా... వరుసగా మూడో సంచలన విజయం
Published Thu, Sep 9 2021 5:19 AM | Last Updated on Thu, Sep 9 2021 9:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment