PV Sindhu: స్వర్ణ, రజతాలకు సింధు దూరం | PV Sindhu defeated in semifinals of badminton women singles at Tokyo | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: స్వర్ణ, రజతాలకు సింధు దూరం

Published Sun, Aug 1 2021 4:58 AM | Last Updated on Sun, Aug 1 2021 8:18 AM

PV Sindhu defeated in semifinals of badminton women singles at Tokyo - Sakshi

రియో ఒలింపిక్స్‌లో రజతం నుంచి టోక్యోలో స్వర్ణానికి... ఇదే లక్ష్యంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ప్రపంచ చాంపియన్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు దురదృష్టవశాత్తూ ఆ అవకాశం దూరమైంది. తొలి నాలుగు మ్యాచ్‌లలో తిరుగులేని ఆటతో ఆశలు రేపిన సింధు జోరును వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ అడ్డుకుంది. మొదటి గేమ్‌ హోరాహోరీగా జరిగినా, రెండో గేమ్‌లో పూర్తిగా చైనీస్‌ తైపీ అమ్మాయి దూకుడు సాగింది. ఆమె ముందు నిలవలేకపోయిన భారత షట్లర్‌కు నిరాశ తప్పలేదు. అయితే మరో ఘనతను అందుకునేందుకు కాంస్యం రూపంలో సింధుకు అవకాశం ఉంది. నేడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు నిలుస్తుంది.   

టోక్యో: ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు క్రీడాకారిణులు (బాంగ్‌ సూ హ్యూన్‌–కొరియా, జాంగ్‌ నింగ్‌–చైనా)లకు మాత్రమే రెండుసార్లు ఫైనల్‌ చేరిన ఘనత ఉంది. శనివారం తర్వాత పీవీ సింధు పేరు కూడా ఆ జాబితాలో చేరేది. కానీ ఆమె చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమితో అది సాధ్యం కాలేదు. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తెలుగమ్మాయి ప్రయత్నం గెలిచేందుకు సరిపోలేదు. ఓవరాల్‌గా వీరిద్దరు తలపడిన 19 మ్యాచ్‌లలో తై జు చేతిలో సింధుకు ఇది 14వ పరాజయం.

ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం సాధించే అవకాశం కానీ, 2016 ‘రియో’లో సాధించిన రజత పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం గానీ సింధుకు లేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకునేందుకు ఆమె ప్రయత్నించనుంది. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో హి బింగ్‌ జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ చెన్‌ యు ఫె (చైనా) 21–16, 13–21, 21–12తో తన దేశానికే చెందిన హి బింగ్‌ జియావోపై గెలుపొందింది. సింధు, బింగ్‌ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు.

హోరాహోరీ నుంచి ఏకపక్షంగా...
ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క గేమ్‌ కూడా కోల్పోని సింధు సెమీస్‌లోనూ అదే ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టింది. సుదీర్ఘ ర్యాలీలతో గేమ్‌ మొదలైనా... కొన్ని చక్కటి స్మాష్‌లు కొట్టడంతో పాటు ప్రత్యర్థి సొంత తప్పిదాలను అవకాశంగా మలచుకున్న సింధు 7–3తో ఆపై 8–4తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11–8తో ఆమె ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా కోలుకున్న తై జు మూడు పాయింట్లు సాధించి 11–11తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా, నేనా అంటూ ప్రతీ పాయింట్‌ కోసం పోరాడటంతో స్కోరు 18–18కి చేరింది.

క్వార్టర్స్‌లో యామగూచితో జరిగిన మ్యాచ్‌ రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడి ఉన్న దశలో సింధు వరుసగా నాలుగు అద్భుత పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. దాదాపు ఇదే స్థితిలో ఒక్కసారిగా చెలరేగిన తై వరుస పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ను తై జు శాసించింది. ఉత్సాహం పెరిగిన ఆమె సింధు డిఫెన్స్‌ లోపాలను సమర్థంగా వాడుకుంది. భారత ప్లేయర్‌ క్రాస్‌ కోర్ట్‌ స్మాష్‌లు గానీ రిటర్న్‌లు గానీ పని చేయలేదు. సగం గేమ్‌ ముగిసేసరికి 11–7తో ముందంజలో ఉన్న తై జు... ఆ తర్వాత మరింత వేగంగా దూసుకుపోయింది. తైపీ ప్లేయర్‌ జోరుకు సింధు వద్ద సమాధానం లేకపోయింది.

మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ కాలం వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఉన్న రికార్డుతో పాటు అత్యధికంగా 11 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్స్‌ తన పేరిటే ఉన్నా... తై జు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో గానీ, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లోగానీ విజేతగా నిలవలేదు. తొలి ఒలింపిక్‌ పతకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఇప్పుడు ఆమె ముందు నిలిచింది.

చాలా బాధగా ఉంది. ఇది సెమీఫైనల్‌ మ్యాచ్‌ కాబట్టి ఫలితం ఇంకా ఎక్కువ బాధిస్తోంది. అయితే నేను చివరి వరకు పోరాడుతూ శాయశక్తులా ప్రయత్నించాను. ఈ రోజు నాది కాదు. రెండో గేమ్‌లో నేను చాలా వెనుకబడ్డా పోరాడాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఆట మనకు అనుకూలంగా మారిపోవచ్చు.

ఒలింపిక్స్‌ అంటే ఆఖరి పాయింట్‌ వరకు పోరాడాల్సిందే. నేను అదే పని చేశాను. ఆమె బలాలు ఏమిటో నాకు తెలుసు కాబట్టి సన్నద్ధమయ్యే వచ్చాను. అయితే సెమీఫైనల్‌ హోరాహోరీగా సాగడం సహజం. సులువైన పాయింట్లనేవి లభించవు. ఏం చేసినా నాకు గెలుపు దక్కలేదు. ఈ ఓటమి కొంత సమయం బాధిస్తూనే ఉంటుంది. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాంస్య పతక మ్యాచ్‌ కోసం వ్యూహం రూపొందించుకుంటా. అంతా ముగిసిపోలేదు. నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా.
–పీవీ సింధు

క్వార్టర్‌ ఫైనల్లో సింధు ఆట కొంత లయ తప్పినా ఆ వెంటనే కోలుకొని మళ్లీ బాగా ఆడగలిగింది. కానీ ఈ మ్యాచ్‌లో అది సాధ్యం కాలేదు. ఒక్కసారి వెనుకబడిన తర్వాత మళ్లీ లయ అందిపుచ్చుకోకపోతే ఇలాంటి కీలక మ్యాచ్‌లలో గెలవడం కష్టం. సింధుకు తై జు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రతీ డ్రాప్‌ షాట్‌ తైపీ అమ్మాయికి పాయింట్లు అందించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడితే అలాంటి ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోవచ్చు కానీ అదీ జరగలేదు. మూడో స్థానం కోసం మ్యాచ్‌ ఆడాల్సి రావడం ఏ ప్లేయర్‌కైనా బాధ కలిగిస్తుంది. అయితే సింధు సెమీస్‌ ఫలితం గురించి ఆలోచించకుండా తాజాగా బరిలోకి దిగితే మంచిది.
–పీవీ రమణ, సింధు తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement