Defeat in semis
-
Tokyo Olympics: నాలుగులోనూ వెలుగు
విశ్వ క్రీడల్లో వరుస పరాజయాలతో మొదలైన భారత మహిళల హాకీ జట్టు ఆట జేజేలతో ముగిసింది. అలా అని మన హాకీ జట్టేమీ పతకం గెలవలేదు. కానీ చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్ బరిలో నిలిచి! మనసుల్ని గెలిచింది.... కాంస్యం కోసం పోరాడి! ఇక్కడా మళ్లీ భారత్ ఓడి ఉండవచ్చు. కానీ మరీ బాధపడాల్సిన పరాజయమైతే కాదు... పరాభవం అంతకన్నా కాదు... త్రుటిలో చేజారిన విజయం. పతకం రాకున్నా వేనోళ్లా ప్రశంసలు వస్తున్నాయన్నది నిజం... అడుగడుగునా అమ్మాయిల పోరాటం అద్వితీయం. అందుకే జాతి యావత్తు జేజేలు పలుకుతోంది. ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం గర్వపడుతోంది. టోక్యో: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు పోరాటం చివరికి నిరాశగా ముగిసింది. కానీ బంగారంలాంటి ప్రదర్శనతో కోట్ల మంది మనసుల్ని గెలిచింది. కాంస్యం చేజారిందనే బాధ ఉంది. అయితే కాంస్యం కూడా ‘వీరి మెడలో ఎందుకు పడలేదు’ అనుకునేలా మన జట్టు పోరాడింది. మూడో స్థానం కోసం శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున గుర్జీత్ సింగ్ (25వ, 26వ ని.లో) రెండు గోల్స్, వందన కటారియా (29వ ని.లో) ఒక గోల్ చేశారు. బ్రిటన్ జట్టుకు ఎలీనా (18వ ని.లో), సారా రాబర్ట్సన్ (24వ ని.లో), వెబ్ హోలీ పెర్న్ (35వ ని.లో), గ్రేస్ బాల్స్‌డన్ (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మనదే ఆధిపత్యం... తొలి క్వార్టర్లో బ్రిటన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ భారత మహిళలు గట్టిగా బదులు చెప్పడంతో నిష్ఫలమయ్యాయి. ప్రత్యర్థి దాడుల్ని భారత డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. అక్కడి నుంచి గోల్‌పోస్ట్‌ను సమీపిస్తే సవిత ఊరుకోలేదు. రెండు పెనాల్టీ కార్నర్లను, మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను సవిత చాకచక్యంగా ఆపేసింది. దీం తో గోల్ లేకుండా ఈ క్వార్టర్ ముగిసింది. ఎట్టకేలకు రెండో క్వార్టర్లో బ్రిటన్ ప్లేయర్లు ఎలీనా రేయ ర్, సారా రాబర్ట్సన్ లక్ష్యాలు ఫలించాయి. కానీ ఈ ఆనందం మరో ఐదు నిమిషాలకే ఆవిరైంది. ఈ క్వార్టర్‌తో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3– 2తో పైచేయి సాధించింది. అది కూడా 5 నిమిషాల వ్యవధిలోనే భారత్ మూడు గోల్స్ సాధించింది. కలిసిరాని మూడో క్వార్టర్ అయితే మూడో క్వార్టర్లో హోలీ పియర్న్ వెబ్ గోల్ చేయడంతో స్కోరు 3–3 వద్ద సమమైంది. ఈ క్వార్టర్లో మనకు లభించిన 3 పెనాల్టీ కార్నర్లను గుర్జీత్ (రెండుసార్లు), దీప్ ఎక్కా గ్రేస్ గోల్‌గా మలచలేకపోవడం భారత్‌కు ప్రతికూలించింది. చివరి క్వార్టర్లో బ్రిటన్ పకడ్బందీగా కదంతొక్కడం... ఇదే సమయంలో ఉదిత ఎల్లో కార్డుతో, షర్మిలా గ్రీన్ కార్డ్‌తో కాసేపు ఆటకు దూరమవడం బ్రిటన్ పనిని సులువు చేసింది. 48వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గ్రేస్ బాల్స్‌డన్ గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో భారత్ 3–4తో వెనుకబడింది. ఆ తర్వాత తుదికంటా అమ్మాయిలు పోరాడినా భారత్‌కు ఫలితం దక్కలేదు. రూ. అర కోటి నజరానా... కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు భారీ నజరానాలే అందనున్నాయి. ఈ జట్టులో హరియాణాకు చెందిన 9 మంది క్రీడాకారిణులకు రూ. 50 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ ప్లేయర్లు సలిమా టేటే, నిక్కీ ప్రధాన్లకు రూ. 50 లక్షల నగదు పురస్కారం ఇస్తామని సీఎం వెల్లడించారు. ఇక చాలు...నే వెళ్తా కోచ్ జోర్డ్ మరీన్ రాజీనామా భారత మహిళల జట్టు చీఫ్ కోచ్ జోర్డ్ మరీన్ మ్యాచ్ ముగిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ‘కొనసాగే ఆలోచనలేవీ లేదు. ఇదే నా ఆఖరి మ్యాచ్. ఈ జట్టుతో నా ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. మూడున్నరేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న నేను ఇప్పుడు పూర్తిగా కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నాను’ అని వర్చువల్ మీడియా సమావేశంలో తెలిపారు. పొడిగింపు ఇస్తామన్నా కోచ్ నిరాకరించినట్లు తెలిసింది. మీరెవరూ ఏడవొద్దు ఫోన్లో ఓదార్చిన ప్రధాని మోదీ కాంస్యం చేజార్చుకున్న మహిళల హాకీ జట్టు పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఫోన్లో భారత జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధను జీర్ణించుకోలేక విలపిస్తున్న అమ్మాయిల్ని వారించారు. ఏడిచే పని చేయలేదని జాతి యావత్ గర్వపడే పోరాటం చేశారని ప్రశంసించారు. ‘మీరంతా బాగా ఆడారు. మీ కృషికి పతకం దక్కలేదేమో కానీ కోట్ల మంది చిన్నారులకు మీ నుంచి ఎంతో ప్రేరణ దక్కింది. కోచ్, జట్టు సభ్యులందరికీ అభినందనలు’ అని ఫోన్లో మాట్లాడుతుండగానే అమ్మాయిలు ఏడ్చారు. ఇది గమనించిన ప్రధాని ‘ప్లీజ్ మీరెవరూ ఏడవొద్దు. మొత్తం దేశం మీ ప్రదర్శన పట్ల గర్విస్తోంది. మీ వల్లే మన జాతీయ క్రీడకు మళ్లీ పునరుత్తేజం వచ్చింది’ అని అన్నారు. -
PV Sindhu: స్వర్ణ, రజతాలకు సింధు దూరం
రియో ఒలింపిక్స్‌లో రజతం నుంచి టోక్యోలో స్వర్ణానికి... ఇదే లక్ష్యంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు దురదృష్టవశాత్తూ ఆ అవకాశం దూరమైంది. తొలి నాలుగు మ్యాచ్‌లలో తిరుగులేని ఆటతో ఆశలు రేపిన సింధు జోరును వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ అడ్డుకుంది. మొదటి గేమ్ హోరాహోరీగా జరిగినా, రెండో గేమ్‌లో పూర్తిగా చైనీస్ తైపీ అమ్మాయి దూకుడు సాగింది. ఆమె ముందు నిలవలేకపోయిన భారత షట్లర్‌కు నిరాశ తప్పలేదు. అయితే మరో ఘనతను అందుకునేందుకు కాంస్యం రూపంలో సింధుకు అవకాశం ఉంది. నేడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు నిలుస్తుంది. టోక్యో: ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్రీడాకారిణులు (బాంగ్ సూ హ్యూన్–కొరియా, జాంగ్ నింగ్–చైనా)లకు మాత్రమే రెండుసార్లు ఫైనల్ చేరిన ఘనత ఉంది. శనివారం తర్వాత పీవీ సింధు పేరు కూడా ఆ జాబితాలో చేరేది. కానీ ఆమె చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమితో అది సాధ్యం కాలేదు. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తెలుగమ్మాయి ప్రయత్నం గెలిచేందుకు సరిపోలేదు. ఓవరాల్‌గా వీరిద్దరు తలపడిన 19 మ్యాచ్‌లలో తై జు చేతిలో సింధుకు ఇది 14వ పరాజయం. ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం సాధించే అవకాశం కానీ, 2016 ‘రియో’లో సాధించిన రజత పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం గానీ సింధుకు లేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకునేందుకు ఆమె ప్రయత్నించనుంది. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో హి బింగ్ జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) 21–16, 13–21, 21–12తో తన దేశానికే చెందిన హి బింగ్ జియావోపై గెలుపొందింది. సింధు, బింగ్ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు. హోరాహోరీ నుంచి ఏకపక్షంగా... ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క గేమ్ కూడా కోల్పోని సింధు సెమీస్‌లోనూ అదే ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టింది. సుదీర్ఘ ర్యాలీలతో గేమ్ మొదలైనా... కొన్ని చక్కటి స్మాష్‌లు కొట్టడంతో పాటు ప్రత్యర్థి సొంత తప్పిదాలను అవకాశంగా మలచుకున్న సింధు 7–3తో ఆపై 8–4తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11–8తో ఆమె ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా కోలుకున్న తై జు మూడు పాయింట్లు సాధించి 11–11తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా, నేనా అంటూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో స్కోరు 18–18కి చేరింది. క్వార్టర్స్‌లో యామగూచితో జరిగిన మ్యాచ్ రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడి ఉన్న దశలో సింధు వరుసగా నాలుగు అద్భుత పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు ఇదే స్థితిలో ఒక్కసారిగా చెలరేగిన తై వరుస పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ను తై జు శాసించింది. ఉత్సాహం పెరిగిన ఆమె సింధు డిఫెన్స్ లోపాలను సమర్థంగా వాడుకుంది. భారత ప్లేయర్ క్రాస్ కోర్ట్ స్మాష్‌లు గానీ రిటర్న్‌లు గానీ పని చేయలేదు. సగం గేమ్ ముగిసేసరికి 11–7తో ముందంజలో ఉన్న తై జు... ఆ తర్వాత మరింత వేగంగా దూసుకుపోయింది. తైపీ ప్లేయర్ జోరుకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ కాలం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న రికార్డుతో పాటు అత్యధికంగా 11 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్ తన పేరిటే ఉన్నా... తై జు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో గానీ, వరల్డ్ చాంపియన్‌షిప్‌లోగానీ విజేతగా నిలవలేదు. తొలి ఒలింపిక్ పతకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఇప్పుడు ఆమె ముందు నిలిచింది. చాలా బాధగా ఉంది. ఇది సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి ఫలితం ఇంకా ఎక్కువ బాధిస్తోంది. అయితే నేను చివరి వరకు పోరాడుతూ శాయశక్తులా ప్రయత్నించాను. ఈ రోజు నాది కాదు. రెండో గేమ్‌లో నేను చాలా వెనుకబడ్డా పోరాడాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఆట మనకు అనుకూలంగా మారిపోవచ్చు. ఒలింపిక్స్ అంటే ఆఖరి పాయింట్ వరకు పోరాడాల్సిందే. నేను అదే పని చేశాను. ఆమె బలాలు ఏమిటో నాకు తెలుసు కాబట్టి సన్నద్ధమయ్యే వచ్చాను. అయితే సెమీఫైనల్ హోరాహోరీగా సాగడం సహజం. సులువైన పాయింట్లనేవి లభించవు. ఏం చేసినా నాకు గెలుపు దక్కలేదు. ఈ ఓటమి కొంత సమయం బాధిస్తూనే ఉంటుంది. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాంస్య పతక మ్యాచ్ కోసం వ్యూహం రూపొందించుకుంటా. అంతా ముగిసిపోలేదు. నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. –పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో సింధు ఆట కొంత లయ తప్పినా ఆ వెంటనే కోలుకొని మళ్లీ బాగా ఆడగలిగింది. కానీ ఈ మ్యాచ్‌లో అది సాధ్యం కాలేదు. ఒక్కసారి వెనుకబడిన తర్వాత మళ్లీ లయ అందిపుచ్చుకోకపోతే ఇలాంటి కీలక మ్యాచ్‌లలో గెలవడం కష్టం. సింధుకు తై జు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రతీ డ్రాప్ షాట్ తైపీ అమ్మాయికి పాయింట్లు అందించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడితే అలాంటి ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోవచ్చు కానీ అదీ జరగలేదు. మూడో స్థానం కోసం మ్యాచ్ ఆడాల్సి రావడం ఏ ప్లేయర్‌కైనా బాధ కలిగిస్తుంది. అయితే సింధు సెమీస్ ఫలితం గురించి ఆలోచించకుండా తాజాగా బరిలోకి దిగితే మంచిది. –పీవీ రమణ, సింధు తండ్రి -
సరిపోని పోరాటం
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
బజరంగ్‌ను ఓడించారు
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బజరంగ్ ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...ఒకే సారి నాలుగు పాయింట్లు సాధించిన ‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. ఈ బౌట్లో ఓటమితో బజరంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు రజతం, బంగారం దూరమయ్యాయి. కాంస్యం కోసం బజరంగ్... డేవిడ్ హబట్ (స్లోవేనియా)తో తలపడతాడు. మహిళల ఈవెంట్లో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కాంస్యం బరిలో నిలిచిన పూజ ధండా కూడా ఓడిపోయింది. పట్టించుకోని రిఫరీలు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజరంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురు లేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో, పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. పైగా బౌట్ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా నియజ్బెకొవ్ కోలుకునేందుకు చాలా సమయం ఇచ్చారు. కనీసం మూడు సార్లు ఇలా జరగ్గా ఒక్కసారి హెచ్చరిక కూడా జారీ చేయలేదు. బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో అతను 6–1తో యుకి టకహషి (జపాన్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జువర్ వుగుయెవ్ (రష్యా) 6–4తో రవి జోరుకు బ్రేకులేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం రవికి ఊరట. సాక్షి మలిక్ అవుట్... మహిళల 59 కేజీల కాంస్య పతక పోరులో పూజ 3–5తో జిన్ గ్రూ పీ (చైనా) చేతిలో ఓడింది. 62 కేజీల కేటగిరీలో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి 7–10తో నైజీరియాకు చెందిన అమినట్ అడెనియి చేతిలో కంగుతింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ 0–2తో ఒలింపిక్ చాంపియన్ సార దొషొ (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. సాక్షి, దివ్యలను ఓడించిన ప్రత్యర్థులు క్వార్టర్స్‌లో ఓడటంతో రెపిచేజ్ అవకాశం లేకుండా పోయింది. -
సింధు, శ్రీకాంత్‌లకు నిరాశ
కౌలాలంపూర్: గతేడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ సీజన్లో మరోసారి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్ వరల్డ్ టూర్–750 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం సెమీఫైనల్స్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు 15–21, 21–19, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 13–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. సింధు, శ్రీకాంత్‌లకు 9,800 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 71 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తై జు యింగ్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధుకు ఈసారీ అలాంటి ఫలితమే వచ్చింది. ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా కీలకదశలో సింధు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. -
సైనా చేజేతులా...
♦ మలేసియా సెమీస్‌లో ఓటమి ♦ చేజారిన నంబర్‌వన్ కౌలాలంపూర్ : కచ్చితమైన షాట్లు... బలమైన బేస్‌లైన్ ఆటతీరు... నాణ్యమైన డ్రాప్ షాట్లు... తిరుగులేని ఆధిపత్యంతో తొలి గేమ్ సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మొదలైన తడబాటును కీలకమైన మూడో గేమ్‌లోనూ అధిగమించలేకపోయింది. ప్రత్యర్థి మోకాలి గాయంతో కోర్టులో ఇబ్బందిగా కదులుతున్నా... ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరిగిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో ‘నంబర్‌వన్’ ర్యాంక్‌ను కూడా చేజార్చుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ సైనా 21-13, 17-21, 20-22తో టాప్‌సీడ్, ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 6-6తో సమమైన తర్వాత సైనా వరుస పాయింట్లతో 11-6, 15-7 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పుంజుకునే ప్రయత్నం చేసినా... హైదరాబాదీ నాణ్యమైన బేస్‌లైన్ ఆటతీరుతో గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో స్కోరు 10-10తో సమమైంది. ఈ దశలో జురుయ్ నెట్ వద్ద కీలకమైన డ్రాప్ షాట్లతో సైనాను కట్టిపడేసి 18-17తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత మరో మూడు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్‌లో సైనా 12-7 ఆధిక్యంలో నిలిచినా... జురుయ్ తన ఎత్తుతో చిత్తు చేసింది. బలమైన స్ట్రోక్స్‌తో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 12-12తో సమంగా నిలిచింది. అయితే సైనా గేమ్ చివర్లో తడబడింది. సైనా 19-18తో ఆధిక్యంలో ఉన్న దశలో జురుయ్ 19-19, 20-20తో స్కోరును సమం చేయడంతో పాటు మరో రెండు పాయింట్లతో మ్యాచ్ గెలిచింది. సెమీస్‌లో ఓటమితో మహిళల విభాగంలో సైనా నంబర్‌వన్ ర్యాంక్ కూడా పోయింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో అగ్రస్థానానికి చేరిన ఈ హైదరాబాదీ... గురువారం అధికారికంగా టాప్కు చేరింది. అయితే మలేసియా సెమీస్‌లో ఓడిపోవడంతో తిరిగి నంబర్‌వన్‌ను లీ జురుయ్‌కు కోల్పోయింది. గురువారం అధికారికంగా ప్రకటించేవరకు సైనాయే నంబర్‌వన్.