అశ్విని, సాత్విక్ సాయిరాజ్
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్‌లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment