
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 28వ ర్యాంకర్ ప్రణయ్ 75 నిమిషాల్లో 18–21, 21–16, 23–21తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం.
మరోవైపు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ టోర్నీ నుంచి వైదొలిగారు. సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అతను బుధవారం ఆడాల్సిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి డారెన్ లీకి వాకోవర్ ఇచ్చాడు. సాయిప్రణీత్‌తో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) 14–21, 21–18, 13–21తో హూ పాంగ్ రోన్–చెయి యి సీ (మలేసియా) చేతిలో... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి 11–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు.