Thailand Open
-
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
శ్రీకాంత్ శుభారంభం
బ్యాంకాక్: కొత్త ఏడాదిలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి విజయం అందుకున్నాడు. థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–18తో డానిల్ దుబోవెంకో (ఇజ్రాయెల్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్ ఆరంభంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 15–15తో సమమైన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–15తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి 11–21, 15–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 15–21, 17–21తో జింగ్ హాంగ్ కోక్ (మలేసియా) చేతిలో, మిథున్ మంజునాథ్ 14–21, 13–21తో షోలే ఐదిల్ (మలేసియా) చేతిలో, సతీశ్ కుమార్ 15–21, 18–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ (భారత్) 15–21, 21–15, 21–19తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ ముందంజ వేయగా... తాన్యా హేమంత్, తారా షా, శ్రియాన్షి వలిశెట్టి తొలి రౌండ్లో ఓడిపోయారు. రక్షిత శ్రీ 21–19, 21–16తో లుయో యు వు (చైనా)పై గెలుపొందగా... తాన్యా 21–15, 11–21, 13–21తో కిసోనా సెల్వదురయ్ (మలేసియా) చేతిలో, తారా షా 15–21, 16–21తో థమనోవన్ నితిత్క్రాయ్ (థాయ్‌లాండ్) చేతిలో, శ్రియాన్షి 17–21, 13–21తో పిచమోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారుమిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–8, 21–16తో వీరాఫట్–సరారట్ (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ..
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై 21-11 21-12 తేడాతో సాత్విక్-చిరాగ్ ద్వయం విజయం సాధించింది.కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ఈ జంట ఫినిష్ చేసింది. వరుస రెండు గేమ్‌లలోనూ వీరిద్దరూ ప్రత్యర్ధి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.ఇక ఆదివారం జరగనున్న తుది పోరులో చైనా జోడీ చెన్బో యాంగ్-లియు యితో భారత టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వయం తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబు ల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–11తో జి సావో నాన్–జెంగ్ వె హాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మైస్నం మిరాబా లువాంగ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మణిపూర్ ఆటగాడు 21–14, 22–20తో మాడ్స్ క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అశ్విని–తనీషా ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–19, 21–17తో హంగ్ ఎన్ జు–లిన్ యు పె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అష్మిత (భారత్) 15–21, 21–12, 12–21తో హాన్ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో ఓడిన అష్మిత
థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీకాంత్ ముందంజ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి, మిథున్ మంజునాథ్ శుభారంభం చేశారు. సమీర్ వర్మ, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 45 నిమిషాల్లో 22–20, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... శంకర్ 21–14, 21–17తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను, మిథున్ 21–17, 21–8తో జేసన్ (హాంకాంగ్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 14–21, 18–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... లె లాన్ జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి తొలి గేమ్‌ను 17–21తో కోల్పోయాక గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో అషి్మత, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... హైదరాబాద్ అమ్మాయి సామియా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అష్మిత 21–10, 21–16తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, మాళవిక 22–20, 21–8తో ఇనెస్ (పెరూ)పై నెగ్గగా... సామియా 14–21, 18–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
శ్రమించి నెగ్గిన గాయత్రి–ట్రెసా జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 74 నిమిషాల్లో 16–21, 21–10, 21–18తో లోక్ లోక్ లుయ్–వింగ్ యంగ్ ఎన్జీ (హాంకాంగ్) జంటపై శ్రమించి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టోలతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–17తో లింగ్ ఫాంగ్ హు–జియావో మిన్ లిన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మరోవైపు భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. -
పోరాడి ఓడిన లక్ష్యసేన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్ కూడా సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ 21–13, 17–21, 13–21తో థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21 ఏళ్ల భారత ఆటగాడు తొలి గేమ్‌లో సీడెడ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచాడు. ఆరంభంలో 11–6 స్కోరు వద్ద పైచేయి సాధించాడు. కానీ థాయ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు చేశాడు. అయితే దీటుగా ఆడిన లక్ష్యసేన్ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. అక్కడినుంచి గేమ్ తన నియంత్రణలోనే ముగిసింది. రెండో గేమ్ అయితే నువ్వానేనా అన్నట్లు సాగింది. కున్లావుత్ క్రాస్‌కోర్ట్ స్మాష్‌లతో పదును పెంచగా... దీటుగా ఎదుర్కొన్న భారత ఆటగాడు సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చాటుకున్నాడు. స్థానిక షట్లర్ 12–10 వద్ద ఉన్నప్పుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి జోరు పెంచినా చివరకు గేమ్ ప్రత్యర్థికే దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ పోరాడినా... కున్లావుత్ జోరు ముందు సేన్ ఆట ఫలితమివ్వలేదు. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
మెయిన్ ‘డ్రా’కు ప్రణవ్ రావు అర్హత
థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు గంధం ప్రణవ్ రావు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్ షి చియె (చైనీస్ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్ గౌడ, రవి కూడా మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు. -
Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్ సాయిప్రణీత్ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పోరాడి ఓడిన సింధు..సెమీస్‌లో ఒలింపిక్ ఛాంపియన్ చేతిలో ఓటమి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు థాయ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో చుక్కెదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు శనివారం జరిగిన సెమీస్‌లో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలైంది. కేవలం 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆరో సీడ్ సింధు 17-21, 16-21 తేడాతో ఓటమి చెందింది. ఫలితంగా ఆమె పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్.. ఈ పోటీలో సింధుకు ఊపిరాడనీయకుండా వరుస క్రమంలో పాయింట్లు సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు చెన్పై 6-4 ఆధిక్యం కలిగిన సింధు.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేసింది. ఈ ఇద్దరు చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తలపడగా అప్పుడు కూడా చెన్నే విజయం వరించింది. కాగా, సింధు ఈ టోర్నీ క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచీకి షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. చదవండి: చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు -
సెమీఫైనల్లో అడుగు పెట్టిన పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధూ.. పాన్‌కు చెందిన అకానె యమగుచిపై 21-15, 20-22, 21-13 స్కోర్‌తో విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. కాగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం జరగనున్న సెమీఫైనల్లో చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో సింధు తలపడనుంది. చదవండి: India Tour of Ireland: టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు. -
Thailand Open: మెయిన్ ‘డ్రా’కు అష్మిత అర్హత
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతారలు అష్మిత చాలియా, మాళవిక బన్సోద్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అష్మిత 21–16, 21–18తో జెనీ గాయ్ (అమెరికా)పై... మాళవిక 21–18, 21–8తో అనుపమ ఉపాధ్యాయ్ (భారత్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ప్రియాన్షు రజావత్, శుభాంకర్, కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
Boxing Tourney: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పసిడి పతకానికి పంచ్ దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆశిష్ (75 కేజీలు), గోవింద్ (48 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు)... మహిళల విభాగంలో మోనిక (48 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై, గోవింద్ 4–1తో ఎన్గుయెన్ లిన్ ఫుంగ్ (వియ త్నాం)పై నెగ్గగా... వరీందర్‌కు తన ప్రత్యర్థి అబ్దుల్ (పాలస్తీనా) నుంచి ‘వాకోవర్’ లభించింది. మోనిక 5–0తో ట్రాన్ థి డియెక్ కియు (వియత్నాం)పై గెలిచింది. భారత్‌కే చెందిన అమిత్ (52 కేజీలు), భాగ్యబతి (75 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
సరిపోని పోరాటం
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సూపర్ సాత్విక్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో... చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్ జోడీ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సాత్విక్ జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్ యెవ్ సిన్–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సమీర్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
క్వార్టర్స్‌లో సింధు
బ్యాంకాక్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత స్టార్ షట్లర్ 21–10, 21–12తో కిసొనా సెల్వడ్యురె (మలేసియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ... డెన్మార్క్ ఆటగాడు రస్మస్ గెంకెను వరుస గేముల్లో 21–12, 21–9తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో మలేసియాకు చెందిన లియూ డారెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 23–21తో ఏడో సీడ్ చొయి సొల్గి యు–సి సియంగ్ జె (కొరియా) జంటకు షాకిచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జోడీ 22–20, 14–21, 21–16తో జర్మనీకి చెందిన మార్క్ లమ్స్‌ఫుస్–ఇసాబెల్ హెర్ట్రిచ్ జంటను ఓడించి ముందంజ వేసింది. అర్జున్–ధ్రువ్ కపిల జంట ప్రిక్వార్టర్స్‌లో 9–21, 11–21తో బెన్ లెన్–సియాన్ వెండి (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడింది. -
ప్రణయ్ సంచలనం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 28వ ర్యాంకర్ ప్రణయ్ 75 నిమిషాల్లో 18–21, 21–16, 23–21తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. మరోవైపు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ టోర్నీ నుంచి వైదొలిగారు. సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అతను బుధవారం ఆడాల్సిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి డారెన్ లీకి వాకోవర్ ఇచ్చాడు. సాయిప్రణీత్‌తో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) 14–21, 21–18, 13–21తో హూ పాంగ్ రోన్–చెయి యి సీ (మలేసియా) చేతిలో... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి 11–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
సైనా నెహ్వాల్‌కు కరోనా.. టోర్నమెంట్ నుంచి అవుట్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. నేటి నుంచి(మంగళవారం) థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి సైనా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. చదవండి: నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్ నెగిటివ్‌గా పరీక్షించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగటీవ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. Badminton players Saina Nehwal, HS Prannoy and Parupalli Kashyap withdraw from Yonex Thailand Open after Nehwal and Prannoy tested positive for COVID19. While Kashyap is under quarantine due to close proximity with a player: Badminton Association of India (BAI) — ANI (@ANI) January 12, 2021 -
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్‌కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. -
బ్యాంకాక్‌కు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. ఈనెల 12–17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీతో పాటు... 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత్ నుంచి స్టార్ షట్లర్లు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ బయలుదేరారు. వీరి వెంట డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్ వర్మ, ధ్రువ్ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు. లక్ష్యసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. లండన్ నుంచి సింధు గత అక్టోబర్ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్ డబుల్స్ ఆటగాళ్లు బెన్ లేన్, సీన్ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లతో సింధు -
అది మంచి నిర్ణయం: పీవీ సింధు
న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఏర్పడిన విరామ సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చెప్పింది. మెరుగైన శిక్షణ కోసం అక్టోబర్‌లో ఇంగ్లండ్ వెళ్లిన సింధు అక్కడే ఉండి తాజా సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనుంది. ‘నిజం చెప్పాలంటే ఇంగ్లండ్ రావడం చాలా మంచి నిర్ణయం. ఇక్కడ శీతల వాతావరణం ఉన్నప్పటికీ, తీవ్రమైన ప్రాక్టీస్ సెషన్లను ఆస్వాదిస్తున్నా. థాయ్‌లాండ్ ఈవెంట్‌తో సీజన్‌ను ప్రారంభిస్తా. చాలా కాలం తర్వాత ఈ టోర్నీల్లో పాల్గొనడం ఉత్సాహంగా అనిపిస్తోంది. ఇప్పుడు చాలా ఓపికగా ఆడాల్సి ఉంటుంది. మానసికంగానూ సిద్ధం అవ్వాలి. ఇది ఒలింపిక్స్ ఏడాది కాబట్టి థాయ్‌లాండ్‌లో విజయంతో ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాలని ఆశిస్తున్నా’ అని లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్న సింధు పేర్కొంది. ఆమె చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో తలపడింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్‌లో సంచలన ప్రదర్శనతో డబుల్స్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ కెరీర్ బెస్టు ర్యాంక్‌కు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం ఏడు స్థానాలు పురోగతి సాధించి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. గతవారం థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా... ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా సాత్విక్ జంట చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరో భారత ద్వయం మను అత్రి–సుమీత్ రెడ్డి నిలకడగా 25వ స్థానంలోనే కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో పెద్దగా మార్పులేవీ జరగలేదు. కిడాంబి శ్రీకాంత్ 10, సమీర్ వర్మ 13, భమిడిపాటి సాయిప్రణీత్ 19, ప్రణయ్ 31, సౌరభ్ వర్మ 44వ ర్యాంక్‌ల్లోనే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 5వ, సైనా నెహ్వాల్ 8వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని 23వ ర్యాంక్‌కు చేరింది. మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి– ప్రణవ్ చోప్రా జంట ఒక స్థానాన్ని కోల్పోయి 23వ ర్యాంక్‌లో నిలువగా, అశ్విని–సాత్విక్ జోడీ నాలుగు స్థానాల్ని కోల్పోయి 27వ ర్యాంక్‌కు పడిపోయింది. -
సాత్విక్–చిరాగ్ జంట చిరస్మరణీయ విజయం
నిరీక్షణ ముగిసింది. లోటు తీరింది. ఆందోళనకు తెర పడింది. అంతర్జాతీయస్థాయి డబుల్స్ విభాగంలో మనకు అత్యున్నత విజయాలు లభించట్లేదని విమర్శిస్తున్న వారందరికీ భారత యువతారలు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ అద్వితీయ ఆటతో సమాధానం ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించి ఔరా అనిపించారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు చేరిన సాత్విక్–చిరాగ్ అంతిమ సమరంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీని బోల్తా కొట్టించి అద్భుతమే చేశారు. బ్యాంకాక్: ఈ ఏడాది సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతున్న దశలో... ఎవరూ ఊహించని విధంగా డబుల్స్ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో చిరస్మరణీయ విజయం సాధించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 21–19, 18–21, 21–18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ ద్వయం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. సూపర్–500 స్థాయి టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 27,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 27 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జంటకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గత మేలో ఈ జోడీ బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన 18 ఏళ్ల సాత్విక్ 2012 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబైకి చెందిన 22 ఏళ్ల చిరాగ్ శెట్టి మూడేళ్లుగా సాత్విక్‌తో కలిసి డబుల్స్‌లో ఆడుతున్నాడు. ఓవరాల్‌గా ఈ జోడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది టైటిల్స్ సొంతం చేసుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం దక్కించుకుంది. హోరాహోరీ... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లి జున్ హుయ్– లియు యు చెన్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన సాత్విక్–చిరాగ్ జంట ఈసారి మాత్రం ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. 62 నిమిషాలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్ కోసం రెండు జోడీలు తీవ్రంగా పోరాడాయి. మూడు గేముల్లోనూ అంతరం మూడు పాయింట్లలోపే ఉండటం మ్యాచ్ తీవ్రతను చాటి చెబుతోంది. గతంలో కీలకదశలో తడబాటుకు లోనై పాయింట్లు కోల్పోయి గొప్ప విజయాలు చేజార్చుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి సంయమనంతో ఆడి పైచేయి సాధించింది. సుదీర్ఘ ర్యాలీలకు అవకాశం ఇవ్వకుండా తక్కువ షాట్లలోనే పాయింట్లను ముగించిన సాత్విక్–చిరాగ్ జోడీ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 1–4తో, 3–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని చేజిక్కించుకుంది. నాకు భుజం నొప్పిగా ఉండటంతో ఫైనల్లో నేను ముందుండి ఆడాలని, చిరాగ్ వెనుకుండి ఆడాలని నిర్ణయించాం. నేను ఎక్కువగా సర్వీస్, నెట్ వద్ద దృష్టి పెట్టాను. షటిల్‌ను తక్కువ ఎత్తులో ఉంచాలని, పాయింట్లను ముగించేందుకు తొందరపడకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాం. మా వ్యూహం ఫలించింది. టోర్నీ మొత్తం ప్రతి మ్యాచ్‌లోనూ మేము ఆశావహ దృక్పథంతో ఆడాం. వెనుకబడిన దశల్లోనూ నిగ్రహం కోల్పోకుండా సంయమనం ప్రదర్శించాం. మా జీవితంలోనే ఇది అతి పెద్ద విజయం. –సాత్విక్ సాయిరాజ్ ఈ విజయం సాత్విక్–చిరాగ్ కెరీర్లో ఎంతో గొప్పది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో మేటి జోడీలు బరిలోకి దిగాయి. ఈ గెలుపు భవిష్యత్‌లో వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక నుంచి డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలకు సాత్విక్–చిరాగ్ జంట నుంచి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
సాత్విక్-చిరాగ్ జోడి కొత్త చరిత్ర
బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున సూపర్-500 టైటిల్‌ను గెలిచిన తొలి జోడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించారు. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా పురుషుల డబల్స్ టైటిల్‌ను గెలవడం ద్వారా నూతన రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌ల జోడి 21-19, 18-21, 21-18 తేడాతో లి జున్ హు- యు చెన్(చైనా) ద్వయంపై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నారు. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్‌ల ద్వయం.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడి అంచనాలకు మించి రాణించింద. రెండో ర్యాంక్ చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టింది. సుదీర్ఘ ర్యాలీలో ఆకట్టకున్న సాత్విక్ జోడి చివరకు గేమ్‌తో మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని భారత పురుషుల డబుల్స్ విభాగంలో నయా రికార్డును లిఖించింది. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడి
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది. సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించింది. హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా భారత టైటిల్ ఆశలను తమ భుజాలపై మోస్తూ వచ్చిన సాయిరాజ్ జోడి మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో ప్రపంచ 16వ ర్యాంక్ సాయిరాజ్ జోడి 22–20, 22–24, 21–9తో 19వ ర్యాంక్ కో సుంగ్ హ్యూన్ – షిన్ బేక్ చియోల్ (కొరియా) జంటను చిత్తుచేసింది. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిరాజ్ జంట టైటిల్ కోసం జరిగే తుది పోరుకు అర్హత సాధించింది. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్‌కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
శ్రమించి నెగ్గిన శ్రీకాంత్, సాయిప్రణీత్
ఈ ఏడాది తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తోన్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో కష్టమ్మీద తొలి రౌండ్ గట్టెక్కారు. పురుషుల సింగిల్స్‌లో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగగా... ఐదుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో ఇద్దరు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బ్యాంకాక్: తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదుర్కొన్నా... కీలక దశలో పైచేయి సాధించిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సౌరభ్, సమీర్‌లకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–13, 17–21, 21–19తో రెన్ పెంగ్ బో (చైనా)పై, సాయిప్రణీత్ 17–21, 21–17, 21–15తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 18–21, 21–8, 21–14తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, ప్రణయ్ 21–16, 22–20తో వింగ్ వోంగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించారు. సౌరభ్ వర్మ 21–23, 19–21, 21–5తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... సమీర్ వర్మ 23–21, 11–21, 5–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్ 21–17, 21–19తో ఫిత్యాపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... సాయి ఉత్తేజిత 17–21, 7–21తో చెన్ జియో జిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సిక్కి రెడ్డి జంట ముందంజ... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–16, 21–13తో కొహి గోండో–అయానె కురిహారా (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–18, 18–21, 21–17తో ఐదో సీడ్ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీని ఓడించి ముందంజ వేసింది. -
మెయిన్ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు... మధ్యప్రదేశ్ షట్లర్ సౌరభ్ వర్మ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ మ్యాచ్‌లో సాయి ఉత్తేజిత 16–21, 21–14, 21–19తో బ్రిట్నీ ట్యామ్ (కెనడా)పై విజయం సాధించింది. పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో సౌరభ్ వర్మ తొలి మ్యాచ్‌లో 21–18, 21–19తో కంతావత్ లీలావెచాబుత్ర్ (థాయ్‌లాండ్)పై... రెండో మ్యాచ్‌లో 11–21, 21–14, 21–18తో జౌ జె కి (చైనా)పై గెలుపొంది మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో 16–21, 13–21తో జౌ జె కి (చైనా) చేతిలో ఓడిపోయాడు. సాత్విక్ జంట ముందంజ... పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ శెట్టితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–11, 24–26, 21–11తో భారత్‌కే చెందిన సుమీత్ రెడ్డి–మను అత్రి జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 7–21, 13–21తో లి వెన్ మె–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చెన్ జియో జిన్ (చైనా)తో సాయి ఉత్తేజిత రావు; ఫిత్యాపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్ ఆడతారు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కాంటా సునెయామ (జపాన్)తో సౌరభ్ వర్మ; రెన్ పెంగ్ బో (చైనా)తో కిడాంబి శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో పారుపల్లి కశ్యప్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ; కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్ తలపడతారు. భారత్‌కే చెందిన శుభాంకర్ డే తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటా మొమోటా (జపాన్)తో తలపడాల్సింది. అయితే కెంటా మొమోటా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడంతో శుభాంకర్ డేకు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. -
వైదొలిగిన సింధు
బ్యాంకాక్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత నంబర్‌వన్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. సింధు గైర్హాజరీలో... మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌పై ఆధారపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంంలో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్లకు ఎంట్రీలు పంపించి... ఆ తర్వాత వైదొలిగింది. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ సాధించడంతో ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా ఆడుతుంది. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు కెనడా ప్లేయర్ బ్రిట్నీ టామ్‌తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే బరిలో ఉన్నారు. -
పసిడి కాంతలు
అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మళ్లీ తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. శనివారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఏడు పతకాలతో భారత బాక్సర్లు అదరగొట్టగా... ఆదివారం ఇండోనేసియాలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్‌లో మనోళ్లు ఏకంగా ఏడు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అద్భుతం చేశారు. ఈ క్రమంలో టోర్నమెంట్లో ఉత్తమ జట్టు పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. న్యూఢిల్లీ : వేదిక మారింది. టోర్నమెంట్ పేరు మారింది. కానీ భారత బాక్సర్లు జోరు మాత్రం కొనసాగింది. ప్రత్యర్థులు ఎవరైనా... తమ పంచ్ ప్రతాపాన్ని చాటుకుంటూ మన బాక్సర్లు పతకాల పంట పండించారు. 24 గంటలు గడవకముందే మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఇండోనేసియాలోని లాబువాన్ బాజోలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు గెల్చుకున్నారు. ఏడు స్వర్ణాల్లో నాలుగు మహిళా బాక్సర్లు అందించగా... మిగతా మూడు పురుష బాక్సర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలోనే మరో రెండు రజతాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమున బోరో (54 కేజీలు), మోనిక (48 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) విజేతలుగా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా సాధన చేస్తున్న మేరీకోమ్‌కు ఈ టోర్నీలో ఎదురులేకుండా పోయింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ మణిపూర్ మెరిక పసిడి కాంతులు విరజిమ్మింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 36 ఏళ్ల మేరీకోమ్ 5–0తో ఏప్రిల్ ఫ్రాంక్స్ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. రెండు నెలల క్రితం ఇండియా ఓపెన్‌లో స్వర్ణం నెగ్గిన మేరీకోమ్ ఆ తర్వాత విరామం తీసుకొని ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఇతర ఫైనల్స్‌లో అస్సాంకు చెందిన జమున బోరో 5–0తో గియులియా లమాగ్న (ఇటలీ)పై, పంజాబ్ అమ్మాయి సిమ్రన్‌జిత్ 5–0తో హసానా హుస్‌వతున్ (ఇండోనేసియా)పై, హరియాణా అమ్మాయి మోనిక 5–0తో ఎన్‌డాంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించి బంగారు పతకాలను దక్కించుకున్నారు. గౌరవ్, దినేశ్‌లకు రజతాలు పురుషుల విభాగంలో ఐదుగురు బాక్సర్లు పసిడి కోసం బరిలోకి దిగారు. అంకుశ్ దహియా (64 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) స్వర్ణాలు నెగ్గగా... గౌరవ్ బిధురి (56 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అంకుశ్ 5–0తో లెయుంగ్ కిన్ ఫాంగ్ (మకావు)పై, అనంత ప్రహ్లాద్ 5–0తో రహమాని రామిష్ (అఫ్గానిస్తాన్)పై, నీరజ్ స్వామి 4–1తో మకాడో జూనియర్ రామెల్ (ఫిలిప్పీన్స్)పై గెలిచారు. గౌరవ్ బిధురి 2–3తో మాన్‌డాగి జిల్ (ఇండోనేసియా) చేతిలో, దినేశ్ 0–5తో సమాద సపుత్ర (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. ఓవరాల్‌గా తొమ్మి ది పతకాలు నెగ్గిన భారత్‌కు ఈ టోర్నీలో ఉత్తమ జట్టు అవార్డు లభించింది. -
రన్నరప్ సింధు
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లోనూ సింధు ఓటమి చవిచూసింది. విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి. -
పీవీ సింధుకు మరోసారి నిరాశే
-
తెలుగు తేజానికి అందని ద్రాక్షగా టైటిల్
బ్యాంకాక్ : ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కోసం చేసిన ప్రయత్నంలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎందురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో 21-15, 21-18 తేడాతో ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీని కోల్పోయిన సింధు.. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం సింధు శ్రమ కొనసాగుతోంది. తొలి గేములో ఒకుహారా దూకుడును ప్రదర్శించి సులువుగానే నెగ్గింది. రెండో గేములో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించినా చివరివరకూ అదే అధిక్యాన్ని కాపాడుకోలేక పోయింది. దీంతో పుంజుకున్న జపాన్ షట్లర్ 18-18తో సింధు స్కోరును సమయం చేసింది. కీలకదశలో మూడు వరుస పాయింట్లు సాధించిన సింధు ప్రత్యర్థి ఒకుహారా గేమ్‌తో పాటు థాయ్‌లాండ్ ఓపెన్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకి ఇది మూడో రజత పతకం కాగా, ఇప్పటివరకూ 11 సార్లు సింధుతో తలపడిన జపాన్ షట్లర్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గింది. -
టైటిల్‌కు విజయం దూరంలో...
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం దూరంలో ఉంది. గత ఫిబ్రవరిలో ఇండియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ తెలుగు తేజం... థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో రెండో సీడ్ సింధు 23–21, 16–21, 21–9తో గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. గంటపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదు ర్కొన్న సింధు... నిర్ణాయక మూడో గేమ్‌లో చెలరేగి తన ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి పోరులో ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఒకుహారాతో తలపడిన సింధు మూడు గేముల్లో నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లోనూ సింధు అలాంటి ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సంవత్సరం ఐదు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన సింధు ఇండియా ఓపెన్‌లో మాత్రం ఫైనల్‌కు చేరింది. కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గిన ఆమె... ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. -
మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది. -
థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం బ్యాంకాక్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 21–14తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ఓడిపోగా... డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్‌లో సోనియా చెహ్ (మలేసియా)తో సింధు తలపడనుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు 21–8, 21–15తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో నాలుగో సీడ్ ప్రణయ్ 21–16, 21–19తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, పారుపల్లి కశ్యప్ 21–15, 21–17తో జేసన్ ఆంథోనీ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సమీర్ వర్మ 18–21, 16–21తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. వైష్ణవి 13–21, 17–21తో సయాకా సాటో (జపాన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–18, 15–21, 21–17తో చెన్ హంగ్ లింగ్–వాంగ్ చీ లిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. అర్జున్–రామచంద్రన్ శ్లోక్ జోడీ 18–21, 21–13, 16–21తో వహ్యూ నాయక ఆర్య పంగకర్యనిరా–యూసుఫ్ సంతోసో (ఇండోనేసియా) జంట చేతిలో; అనిల్ కుమార్ రాజు–వెంకట్ గౌరవ్ ప్రసాద్ ద్వయం 21–14, 12–21, 14–21తో చుంగ్ యొన్నీ–టామ్ చున్ హై (హాంకాంగ్) జోడీ చేతిలో; కోన తరుణ్–సౌరభ్ శర్మ జంట 6–21, 6–21తో లియో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (తైవాన్) ద్వయం చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్విషా రామ్ జంట 21–23, 8–21తో చెన్ సియో హుఆన్–హు లింగ్ ఫాంగ్ (తైవాన్) జోడీ చేతిలో; మిక్స్డ్ డబుల్స్‌లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ ద్వయం 19–21, 15–21తో మాక్ హీ చున్–యెంగ్ గా తింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలయ్యాయి. -
థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగిన శ్రీకాంత్, సైనా
బ్యాంకాక్‌లో నేటి నుంచి జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ వైదొలిగారు. ఫలితంగా భారత ఆశలన్నీ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, పీవీ సింధులపైనే ఉన్నాయి. తొలి రోజు క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ తరఫున రాహుల్ యాదవ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, కార్తికేయ గుల్షన్ కుమార్, చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగనున్నారు. -
సత్యన్ జంటకు రజతం
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ జి. సత్యన్ జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో రజతం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్–సానిల్ శెట్టి జంట 10–12, 11–9, 10–12, 7–11తో టొబియస్ హిప్లర్–కిలియన్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఈ జోడీ 11–7, 5–11, 11–9, 5–11, 11–3తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ జంటపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందు 3–0తో మలేసియా జంటపై; 3–1తో జపాన్ ద్వయంపై నెగ్గి సెమీస్‌కు చేరింది. -
శభాష్... సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సొంతం బ్యాంకాక్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ యవనికపై మరోసారి భారత్ పతాకం రెపరెపలాడింది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత యువతార భమిడిపాటి సాయిప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 17–21, 21–18, 21–19తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయిం ట్లు లభించాయి. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన ప్రపంచ 24వ ర్యాంకర్ సాయిప్రణీత్ కెరీర్లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ ఫైనల్‌కు చేరుకున్నా తుది పోరులో భారత్‌కే చెందిన సమీర్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. తాజా విజయంతో 43 ఏళ్ల చరిత్ర కలిగిన థాయ్‌లాండ్ ఓపెన్‌లో... పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా సాయిప్రణీత్ గుర్తింపు పొందాడు. 2013లో హైదరాబాద్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2012లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీ గెలిచిన ఐదో ప్లేయర్‌గా సాయిప్రణీత్ నిలి చాడు. గతంలో శ్రీకాంత్ మూడు సార్లు (2013 థాయ్‌లాండ్ ఓపెన్, 2015 స్విస్ ఓపెన్, 2016 సయ్యద్ మోడీ ఓపెన్), కశ్యప్ రెండు సార్లు (2012, 2015 సయ్యద్ మోడీ ఓపె న్), అరవింద్ భట్ (2014 జర్మన్ ఓపెన్), సమీర్ వర్మ (2017 సయ్యద్ మోడీ ఓపెన్) ఒక్కోసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీల్లో టైటిల్స్ గెలిచారు. వెనుకబడి పుంజుకొని... ఫైనల్ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోని సాయిప్రణీత్‌కు తుది పోరులో గట్టిపోటీనే లభించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో తొలిసారి ఆడిన ఈ హైదరాబాద్ ప్లేయర్ మొదటి గేమ్‌లో కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో తన పొరపాట్లను సవరించుకొని సాయిప్రణీత్ తేరుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ 3–8తో వెనుకంజ వేశాడు. కానీ సంయమనం కోల్పోకుండా ఆడి నిలకడగా పాయింట్లు సాధించి స్కోరును 9–9తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 17–17తో సమంగా ఉన్నపుడు సాయిప్రణీత్ రెండు పాయింట్లు నెగ్గి 19–17తో ముందంజ వేశాడు. ఆ వెంటనే రెండు పాయింట్లు కోల్పోవడంతో మళ్లీ స్కోరు 19–19తో సమమైంది. ఈ దశలో సాయిప్రణీత్ వెంటవెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం ర్యాలీలపైనే నా దృష్టిని కేంద్రీకరించాను. ఫైనల్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలు నా సహనాన్ని పరీక్షించాయి. అయితే ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడి ఫలితాన్ని సాధించాను. టైటిల్ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. –సాయిప్రణీత్ -
మరో టైటిల్‌పై సాయిప్రణీత్ గురి!
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ బరిలో సైనా, కశ్యప్, గురుసాయిదత్ బ్యాంకాక్: గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. 64 మందితో కూడిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి 16 మంది క్రీడాకారులు ఉండటం విశేషం. సాయిప్రణీత్‌తోపాటు కశ్యప్, గురుసాయిదత్, సౌరభ్ వర్మ, రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్, సిరిల్ వర్మ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో నథానియల్ (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, మౌలానా (ఇండోనేసియా)తో గురుసాయిదత్, ద్రాత్వా (స్లొవేకియా)తో కశ్యప్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 2012 చాంపియన్ సైనా నెహ్వాల్‌తోపాటు గద్దె రుత్విక శివాని, శ్రీకృష్ణప్రియ, రితూపర్ణ దాస్, సాయి ఉత్తేజిత రావు, శైలి రాణే, రేష్మా కార్తీక్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెలలో జరిగే ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు పీవీ సింధు, భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్, శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.