మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత  | Sourabh and Uttejitha Rao Enter Main Draw of Thailand Open | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

Published Wed, Jul 31 2019 10:26 AM | Last Updated on Wed, Jul 31 2019 10:26 AM

Sourabh and Uttejitha Rao Enter Main Draw of Thailand Open - Sakshi

సాయి ఉత్తేజిత

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు... మధ్యప్రదేశ్‌ షట్లర్‌ సౌరభ్‌ వర్మ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో సాయి ఉత్తేజిత 16–21, 21–14, 21–19తో బ్రిట్నీ ట్యామ్‌ (కెనడా)పై విజయం సాధించింది. పురుషుల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ తొలి మ్యాచ్‌లో 21–18, 21–19తో కంతావత్‌ లీలావెచాబుత్ర్‌ (థాయ్‌లాండ్‌)పై... రెండో మ్యాచ్‌లో 11–21, 21–14, 21–18తో జౌ జె కి (చైనా)పై గెలుపొంది మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు. భారత్‌కే చెందిన అజయ్‌ జయరామ్‌ క్వాలిఫయింగ్‌ తొలి మ్యాచ్‌లో 16–21, 13–21తో జౌ జె కి (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

సాత్విక్‌ జంట ముందంజ... 
పురుషుల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తన భాగస్వామి చిరాగ్‌ శెట్టితో కలిసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–11, 24–26, 21–11తో భారత్‌కే చెందిన సుమీత్‌ రెడ్డి–మను అత్రి జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 7–21, 13–21తో లి వెన్‌ మె–జెంగ్‌ యు (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో చెన్‌ జియో జిన్‌ (చైనా)తో సాయి ఉత్తేజిత రావు; ఫిత్యాపోర్న్‌ చైవాన్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా నెహ్వాల్‌ ఆడతారు.

పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో కాంటా సునెయామ (జపాన్‌)తో సౌరభ్‌ వర్మ; రెన్‌ పెంగ్‌ బో (చైనా)తో కిడాంబి శ్రీకాంత్‌; వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌; మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో పారుపల్లి కశ్యప్‌; లీ జి జియా (మలేసియా)తో సమీర్‌ వర్మ; కాంతాపోన్‌ వాంగ్‌చరోయిన్‌ (థాయ్‌లాండ్‌)తో సాయిప్రణీత్‌ తలపడతారు. భారత్‌కే చెందిన శుభాంకర్‌ డే తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ కెంటా మొమోటా (జపాన్‌)తో తలపడాల్సింది. అయితే కెంటా మొమోటా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడంతో శుభాంకర్‌ డేకు తొలి రౌండ్‌లో వాకోవర్‌ లభించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement