Sourabh Varma
-
సౌరభ్ వర్మదే టైటిల్
హో చి మిన్ సిటీ: వియాత్నం ఓపెన్ సూపర్ 100 టైటిల్‌ను భారత షట్లర్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సౌరభ్ వర్మ 21-12, 17-21, 21-14 తేడాతో సన్ ఫి యింగ్(చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి గేమ్‌ను సౌరభ్ వర్మ అవలీలగా గెలిస్తే.. రెండో గేమ్‌ను కోల్పోయాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో వర్మ వెనుకబడి దాన్ని కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చిన సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలతో పాటు అద్భుతమైన స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. మూడో గేమ్ ఆరంభంలో ఇరువురు 6-6తో సమంగా నిలిచిన సమయంలో సౌరభ్ వర్మ విజృంభించి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సన్ ఫి యింగ్‌ను వెనక్కినెట్టాడు. ఈ క్రమంలోనే కడవరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకున్న సౌరభ్ వర్మ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఫలితంగా వియాత్నం ఓపెన్‌ను చేజిక్కించుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు... మధ్యప్రదేశ్ షట్లర్ సౌరభ్ వర్మ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ మ్యాచ్‌లో సాయి ఉత్తేజిత 16–21, 21–14, 21–19తో బ్రిట్నీ ట్యామ్ (కెనడా)పై విజయం సాధించింది. పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో సౌరభ్ వర్మ తొలి మ్యాచ్‌లో 21–18, 21–19తో కంతావత్ లీలావెచాబుత్ర్ (థాయ్‌లాండ్)పై... రెండో మ్యాచ్‌లో 11–21, 21–14, 21–18తో జౌ జె కి (చైనా)పై గెలుపొంది మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో 16–21, 13–21తో జౌ జె కి (చైనా) చేతిలో ఓడిపోయాడు. సాత్విక్ జంట ముందంజ... పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ శెట్టితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–11, 24–26, 21–11తో భారత్‌కే చెందిన సుమీత్ రెడ్డి–మను అత్రి జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 7–21, 13–21తో లి వెన్ మె–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చెన్ జియో జిన్ (చైనా)తో సాయి ఉత్తేజిత రావు; ఫిత్యాపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్ ఆడతారు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కాంటా సునెయామ (జపాన్)తో సౌరభ్ వర్మ; రెన్ పెంగ్ బో (చైనా)తో కిడాంబి శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో పారుపల్లి కశ్యప్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ; కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్ తలపడతారు. భారత్‌కే చెందిన శుభాంకర్ డే తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటా మొమోటా (జపాన్)తో తలపడాల్సింది. అయితే కెంటా మొమోటా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలగడంతో శుభాంకర్ డేకు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. -
స్లొవేనియా ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరభ్ వర్మ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. శనివారం ముగిసిన స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్‌గా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో టాప్ సీడ్ సౌరభ్ 21–17, 21–12తో నాలుగో సీడ్ మినోరు కొగా (జపాన్)పై నెగ్గాడు. మహిళల డబుల్స్ విభాగంలో దండు పూజ–సంజన (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో టాప్ సీడ్ పూజ–సంజన జోడీ 14–21, 20–22తో జెన్నీ మూర్–విక్టోరియా (ఇంగ్లండ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
రష్యా ఓపెన్ చాంప్ సౌరభ్
వ్లాదివోస్టాక్ (రష్యా): భారత షట్లర్ సౌరభ్ వర్మ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 రష్యా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 25 ఏళ్ల సౌరభ్ 19–21, 21–12, 21–17తో కొకి వతనబె (జపాన్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరభ్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 86 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘ప్రస్తుతం నా ఆటతీరు మెరుగు పర్చుకునేందుకు కష్టపడుతున్నా. ఇందులో పురోగతి సాధించినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో నిలకడ ప్రదర్శించాల్సివుంది. ఈ ఫైనల్ పోరు క్లిష్టంగా సాగింది. చివరకు గెలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్ గెలిచిన సౌరభ్ అన్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ 2016లో చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్ గెలిచి, బిట్‌బర్గర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రెండో సీడ్ భారత జంట రోహన్ కపూర్– కుహూ గార్గ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో ఈ జోడీ 19–21, 17–21తో ఇవనోవ్ (రష్యా)–మిక్ క్యుంగ్ కిమ్ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. -
హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్ సెకండ్ రౌండ్లోకి సైనా
కౌలూన్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో 44 వ ర్యాంకర్ డెన్మార్క్ ప్లేయర్ మెటే పౌల్సేన్పై 21-19, 23-21 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.11వ ర్యాంకరైన సైనా తదుపరి మ్యాచ్ బలమైన ప్రత్యర్థి ఎనిమిదో సీడెడ్ చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయ్ను ఢీ కొననున్నారు. గత ఆగష్టులో గ్లాస్గో టోర్నమెంట్లో కాంస్యం కోసం పోటీపడ్డ సైనాను చెన్ మట్టికరిపించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మలు తొలి రౌండ్‌లోని ఓటమి చెంది ఇంటిదారి పట్టారు. కశ్యప్ కోరియా ప్లేయర్ లీడాంగ్ కీన్‌పై 21-15,19-21,20-22 తేడాతో ఓటమి చెందాడు. సౌరబ్ ఇండోనేషియా ప్లేయర్ టామ్మీ సుగియాట్రో చేతిలో ఓటమి పాలయ్యాడు. -
రన్నరప్ సౌరభ్ వర్మ
జొహర్ బారు: కెరీర్లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశాన్ని భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మ చేజార్చుకున్నాడు. మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ షట్లర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-15, 16-21, 19-21తో సిమోన్ సాంతోసో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సౌరభ్ కీలకదశలో ఒత్తిడికి లోనై మూల్యం చెల్లించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 19-18తో ముందంజలో ఉన్న సౌరభ్ ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకున్నాడు. -
సిక్కి రెడ్డి , సుమీత్ జోడిలకు డబుల్స్ టైటిల్స్
ముంబై: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఆదివారం ముగిసిన టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ మినహా... మిగతా నాలుగు ఈవెంట్స్‌లో భారత్‌కే టైటిల్స్ లభించాయి. భారత్ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ చాంపియన్‌గా అవతరించాడు. డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గ్రాదె ద్వయం... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ జంట టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి 21-16, 21-13తో జూ చియె తియెన్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. సుమీత్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 21-19, 21-19తో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జంటపై సంచలన విజయం సాధించింది. గత నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను నెగ్గిన సిక్కి-ప్రద్న్యాల ఖాతాలో ఇది రెండో టైటిల్ కావడం విశేషం. గత ఏడాది అపర్ణ బాలన్‌తో కలిసి టాటా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సిక్కి ఈ ఏడాది టైటిల్ సాధించడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-12, 21-17తో భారత్‌కే చెందిన హెచ్.ఎస్.ప్రణయ్‌ను ఓడించాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ ద్వయం 21-17, 18-21, 21-18తో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (భారత్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫెబీ అంగుని (ఇండోనేసియా) 20-22, 21-14, 21-19తో అనా రోవితా (ఇండోనేసియా)పై నెగ్గింది. -
గురు సాయిదత్‌కు షాక్
ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. నాలుగో సీడ్ సౌరభ్ వర్మ... టాప్ సీడ్ గురుసాయిదత్‌కు షాకిచ్చాడు. మరో సెమీస్‌లోనూ రాష్ట్రానికి చెందిన రెండో సీడ్ సాయి ప్రణీత్‌కు ఓటమి ఎదురైంది. మూడో సీడ్ ప్రణయ్ చేతిలో అతను కంగుతిన్నాడు. శనివారం ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లకు కలిసిరాలేదు. ఇక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కోర్టుల్లో జరిగిన తొలి సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-16, 18-21, 19-21తో సౌరభ్ చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌ను కైవసం చేసుకున్న గురు తర్వాతి సెట్లలో ఆ మేరకు రాణించలేకపోయాడు. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఏపీ ఆటగాడు 1-2 గేమ్‌ల తేడాతో కంగుతిన్నాడు. మరో సెమీస్‌లో ప్రణయ్ 21-19, 21-10తో సాయి ప్రణీత్‌పై వరుస గేముల్లో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మను అత్రి-సుమిత్ రెడ్డి జోడి 21-19, 21-18తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందగోపాల్-హేమ నాగేంద్రబాబు జంటపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో ప్రద్న్యా గాద్రెతో జతకట్టిన ఏపీ అమ్మాయి సిక్కిరెడ్డి టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సెమీస్‌లో ఈ జోడి 19-21, 22-20, 21-17తో ప్రజక్తా సావంత్-ఆరతి సారా ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో తరుణ్ కొనా-అశ్విని పొన్నప్ప జోడి 21-14, 21-9తో ప్రణవ్ చోప్రా-మనీషా జంటపై, అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యాగాద్రె ద్వయం 19-21, 21-18, 21-18తో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ జోడిపై గెలుపొందాయి. మహిళల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి గుత్వా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో జ్వాల-అశ్విని ద్వయం 21-15, 21-13తో మనీషా-సాన్యోగిత ఘోర్పడే జంటపై విజయం సాధించింది. ఫైనల్లో జ్వాల జోడి... సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె జంటతో తలపడుతుంది.