గురు సాయిదత్‌కు షాక్ | Sourabh Varma upsets RMV Gurusaidutt to enter final | Sakshi
Sakshi News home page

గురు సాయిదత్‌కు షాక్

Published Sun, Dec 15 2013 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

Sourabh Varma upsets RMV Gurusaidutt to enter final

ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. నాలుగో సీడ్ సౌరభ్ వర్మ... టాప్ సీడ్ గురుసాయిదత్‌కు షాకిచ్చాడు. మరో సెమీస్‌లోనూ రాష్ట్రానికి చెందిన రెండో సీడ్ సాయి ప్రణీత్‌కు ఓటమి ఎదురైంది.
 
 
 మూడో సీడ్ ప్రణయ్ చేతిలో అతను కంగుతిన్నాడు. శనివారం ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లకు కలిసిరాలేదు. ఇక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కోర్టుల్లో జరిగిన తొలి సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-16, 18-21, 19-21తో సౌరభ్ చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌ను కైవసం చేసుకున్న గురు తర్వాతి సెట్లలో ఆ మేరకు రాణించలేకపోయాడు. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఏపీ ఆటగాడు 1-2 గేమ్‌ల తేడాతో కంగుతిన్నాడు. మరో సెమీస్‌లో ప్రణయ్ 21-19, 21-10తో సాయి ప్రణీత్‌పై వరుస గేముల్లో విజయం సాధించాడు.
 
  పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మను అత్రి-సుమిత్ రెడ్డి జోడి 21-19, 21-18తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందగోపాల్-హేమ నాగేంద్రబాబు జంటపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో ప్రద్న్యా గాద్రెతో జతకట్టిన ఏపీ అమ్మాయి సిక్కిరెడ్డి టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సెమీస్‌లో ఈ జోడి 19-21, 22-20, 21-17తో ప్రజక్తా సావంత్-ఆరతి సారా ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తరుణ్ కొనా-అశ్విని పొన్నప్ప జోడి 21-14, 21-9తో ప్రణవ్ చోప్రా-మనీషా జంటపై, అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యాగాద్రె ద్వయం 19-21, 21-18, 21-18తో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ జోడిపై గెలుపొందాయి.
 
 మహిళల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి గుత్వా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో జ్వాల-అశ్విని ద్వయం 21-15, 21-13తో మనీషా-సాన్యోగిత ఘోర్పడే జంటపై విజయం సాధించింది. ఫైనల్లో జ్వాల జోడి... సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె జంటతో తలపడుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement