సిక్కి రెడ్డి , సుమీత్ జోడిలకు డబుల్స్ టైటిల్స్
ముంబై: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఆదివారం ముగిసిన టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ మినహా... మిగతా నాలుగు ఈవెంట్స్‌లో భారత్‌కే టైటిల్స్ లభించాయి. భారత్ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ చాంపియన్‌గా అవతరించాడు.
డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గ్రాదె ద్వయం... మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ జంట టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి 21-16, 21-13తో జూ చియె తియెన్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. సుమీత్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 21-19, 21-19తో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జంటపై సంచలన విజయం సాధించింది. గత నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను నెగ్గిన సిక్కి-ప్రద్న్యాల ఖాతాలో ఇది రెండో టైటిల్ కావడం విశేషం. గత ఏడాది అపర్ణ బాలన్‌తో కలిసి టాటా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సిక్కి ఈ ఏడాది టైటిల్ సాధించడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-12, 21-17తో భారత్‌కే చెందిన హెచ్.ఎస్.ప్రణయ్‌ను ఓడించాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ ద్వయం 21-17, 18-21, 21-18తో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (భారత్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫెబీ అంగుని (ఇండోనేసియా) 20-22, 21-14, 21-19తో అనా రోవితా (ఇండోనేసియా)పై నెగ్గింది.