
హో చి మిన్ సిటీ: వియాత్నం ఓపెన్ సూపర్ 100 టైటిల్‌ను భారత షట్లర్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సౌరభ్ వర్మ 21-12, 17-21, 21-14 తేడాతో సన్ ఫి యింగ్(చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి గేమ్‌ను సౌరభ్ వర్మ అవలీలగా గెలిస్తే.. రెండో గేమ్‌ను కోల్పోయాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో వర్మ వెనుకబడి దాన్ని కోల్పోయాడు.
ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చిన సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలతో పాటు అద్భుతమైన స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. మూడో గేమ్ ఆరంభంలో ఇరువురు 6-6తో సమంగా నిలిచిన సమయంలో సౌరభ్ వర్మ విజృంభించి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సన్ ఫి యింగ్‌ను వెనక్కినెట్టాడు. ఈ క్రమంలోనే కడవరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకున్న సౌరభ్ వర్మ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఫలితంగా వియాత్నం ఓపెన్‌ను చేజిక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment