బ్యాంకాక్: ఈ సీజన్‌లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత నంబర్‌వన్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. సింధు గైర్హాజరీలో... మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌పై ఆధారపడ్డాయి.
ఈ ఏడాది ఆరంభంంలో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్‌లకు ఎంట్రీలు పంపించి... ఆ తర్వాత వైదొలిగింది. ప్రస్తుతం ఆమె ఫిట్‌నెస్ సాధించడంతో ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో సైనా ఆడుతుంది. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు కెనడా ప్లేయర్ బ్రిట్నీ టామ్‌తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment