మరో టైటిల్‌పై సాయిప్రణీత్ గురి!
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బరిలో సైనా, కశ్యప్, గురుసాయిదత్
బ్యాంకాక్: గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. 64 మందితో కూడిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి 16 మంది క్రీడాకారులు ఉండటం విశేషం. సాయిప్రణీత్‌తోపాటు కశ్యప్, గురుసాయిదత్, సౌరభ్ వర్మ, రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్, సిరిల్ వర్మ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తొలి రౌండ్‌లో నథానియల్ (ఇండోనేసియా)తో సాయిప్రణీత్, మౌలానా (ఇండోనేసియా)తో గురుసాయిదత్, ద్రాత్వా (స్లొవేకియా)తో కశ్యప్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 2012 చాంపియన్ సైనా నెహ్వాల్‌తోపాటు గద్దె రుత్విక శివాని, శ్రీకృష్ణప్రియ, రితూపర్ణ దాస్, సాయి ఉత్తేజిత రావు, శైలి రాణే, రేష్మా కార్తీక్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెలలో జరిగే ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు పీవీ సింధు, భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్, శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.