
ఫుజౌ (చైనా): మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న ఏకైక భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాత్విక్–అశ్విని ద్వయం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్‌లో ఈ భారత జోడీ 24–22, 21–7తో లీ జె హుయె–వు తి జంగ్ (చైనీస్ తైపీ) జంటపై... రెండో రౌండ్‌లో 21–16, 19–21, 22–20తో నిక్లాస్ నోర్–సారా తిగెసన్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది.
బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జోడీతో సాత్విక్–అశ్విని జంట తలపడుతుంది. మరోవైపు బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా నెహ్వాల్; సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)తో సౌరభ్ వర్మ; లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో హెచ్‌ఎస్ ప్రణయ్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment