satwik sai raj
-
క్వార్టర్ ఫైనల్లో భారత్..
చెంగ్డూ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 21–15తో హ్యారీ హంగ్‌పై గెలిచి భారత్‌కు 1–0తో శుభారంభం ఇచ్చాడు.రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–17, 19–21, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–16, 21–11తో నదీమ్ డాలి్వపై నెగ్గడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–17, 21–19తో రోరీ ఈస్టన్–అలెక్స్ గ్రీన్ ద్వయంపై గెలిచింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 21–18, 21–12తో చోలన్ కేయాన్‌ను ఓడించడంతో భారత్ 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గ్రూప్ తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌పై గెలుపొందింది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది.ఇవి చదవండి: కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
-
సరిపోని పోరాటం
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
మెయిన్ ‘డ్రా’కు సాత్విక్–అశ్విని జంట
ఫుజౌ (చైనా): మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న ఏకైక భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాత్విక్–అశ్విని ద్వయం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్లో ఈ భారత జోడీ 24–22, 21–7తో లీ జె హుయె–వు తి జంగ్ (చైనీస్ తైపీ) జంటపై... రెండో రౌండ్లో 21–16, 19–21, 22–20తో నిక్లాస్ నోర్–సారా తిగెసన్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జోడీతో సాత్విక్–అశ్విని జంట తలపడుతుంది. మరోవైపు బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా నెహ్వాల్; సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో సౌరభ్ వర్మ; లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో హెచ్ఎస్ ప్రణయ్ ఆడతారు. -
భారత్ ఆశలు సజీవం
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): నాకౌట్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటుకుంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్రూప్1–డి మ్యాచ్‌లో భారత్ 4–1తో ఇండోనేసియాను ఓడించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 22–20, 17–21, 21–19తో తొంతోవి అహ్మద్–గ్లోరియా జోడీని ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో జొనాథన్ క్రిస్టీపై గెలవడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 17–21తో మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–8, 21–19తో ఫిత్రియానిపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–12, 21–19తో డెల్లా డెస్తియారా–రొసియాతా జోడీపై నెగ్గడంతో భారత్ 4–1తో గెలుపొందింది. బుధవారం ఇండోనేసియా, డెన్మార్క్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై భారత్ నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇండోనేసియా ఓడిపోతే భారత్, డెన్మార్క్ జట్లు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఇండోనేసియా గెలిస్తే ఈ గ్రూప్‌లోని మూడు జట్లు ఒక్కో విజయంతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన గేమ్‌లు, పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుతాయి. -
సాత్విక్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ రంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్ వియత్నాం ఓపెన్ అంతర్జాతీయ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన చిరాగ్ శెట్టితో జతకట్టి ఆడిన సాత్విక్ విజేతగా నిలిచాడు. వియత్నాంలోని హనోయ్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 17–21, 21–9, 21–15తో ఐదో సీడ్ త్రావుత్ పొతియెంగ్–నంతాకమ్ యోర్డ్‌ఫైసాంగ్ (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 21–11, 21–18తో హెంద్రా గుణవాన్ –మార్కిస్ కిడో (ఇండోనేసియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
సాత్విక్ ‘డబుల్’
సింగిల్స్ చాంప్స్ రితూపర్ణ, సౌరభ్ వర్మ పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో డబుల్స్ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రెండు టైటిల్స్‌ను సాధించగా... తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు (పీఎస్‌పీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ ఆటగాడు సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో రెండోసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వయం 21–17, 16–21, 21–14తో నందగోపాల్ (కాగ్)–సాన్యమ్ శుక్లా (ఎయిరిండియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ కె. మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో 21–14, 21–18తో వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ అమ్మాయి, రెండో సీడ్ రితూపర్ణ దాస్ 21–12, 21–14తో తొమ్మిదో సీడ్ రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచి తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2011 చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 21–12తో ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు.