న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్‌లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్(రజత పతక విజేత)లు ఉపయోగించిన రాకెట్‌ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది.
ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ. 80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 90లక్షలు దాటింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా చేతి గ్లౌజులను రూ. 80 లక్షల బేస్‌ప్రైజ్ వద్ద వేలం ప్రారంభించగా.. ప్రస్తుతం రూ.1.80 కోట్ల వద్ద కొనసాగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.
చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే
Comments
Please login to add a commentAdd a comment