స్టోసుర్‌కు షాక్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో తొలి సంచలనం నమోదైంది. 2011 చాంపియన్, 11వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల ‘క్వాలిఫయర్’ విక్టోరియా దువాల్ అద్భుత ఆటతీరుతో 5-7, 6-4, 6-4తో స్టోసుర్‌ను బోల్తా కొట్టించి కెరీర్‌లో ‘తొలి గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 296వ స్థానంలో ఉన్న దువాల్ 2 గంటల 39 నిమిషాల పోరాటంలో స్టోసుర్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అజరెంకా (బెలారస్) 6-0, 6-0తో పిఫిజెన్‌మాయెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6-2, 7-5తో దువాన్ (చైనా), నాలుగో సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-0, 6-0తో రొగోవ్‌స్కా (ఆస్ట్రేలియా)పై నెగ్గారు.
మూడో రౌండ్‌లో రద్వాన్‌స్కా, నా లీ
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో మూడో సీడ్ రద్వాన్‌స్కా (పోలాండ్) 6-0, 7-5తో మరియా తెరిసా టోరోఫ్లోర్ (స్పెయిన్)పై, ఐదో సీడ్ నా లీ 6-2, 6-2తో అర్విడ్‌సన్ (స్వీడన్)పై గెలిచారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2, 6-2తో బెరాన్‌కిస్ (లిథువేనియా)పై, ఏడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 7-5తో జెమాల్జా (స్లొవేనియా)పై గెలిచారు. 12వ సీడ్ హాస్ (జర్మనీ), 13వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) కూడా రెండో రౌండ్‌కు చేరారు.