Grand slam tournment
-
Australian Open 2023: నాదల్, జొకోవిచ్లపైనే దృష్టి
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్)... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్ జొకోవిచ్... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 75వ ర్యాంకర్ రొబెర్టో బేనా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. జొకోవిచ్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా ఏడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. -
జొకోవిచ్ జోరు
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు. మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్‌ను ఓడించారు. సబలెంకా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్చిచ్పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్‌ను బోల్తా కొట్టించింది. -
2009 ఫ్రెంచ్ ఓపెన్ రాకెట్ వేలానికి...
స్విట్జర్లాండ్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో ఏకైక ఫ్రెంచ్ ఓపెన్‌ను 2009లో సాధించాడు. దాంతోనే అతని కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తయింది. ఆ టోర్నీ ఫైనల్లో రాబిన్ సొదర్లింగ్పై గెలిచిన ఫెడరర్... నాటి మ్యాచ్‌లో వాడిన రాకెట్‌ను ఇప్పుడు తన ఫౌండేషన్ కోసం వేలానికి పెట్టాడు. పారిస్ క్లే కోర్టు ఎర్ర మట్టి మరకలు ఇప్పటికీ ఉన్న మ్యాచ్ షూస్‌ను కూడా అతను వేలం కోసం అందుబాటులో ఉంచాడు. వీటితో పాటు పలు జ్ఞాపికలను ఈ ఏడాది జూన్, జులైలలో జరిగిన ఆన్లైన్ వేలంలో అభిమానులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: టోక్యో ఒలంపిక్స్: అడుగడుగునా కరోనా పరీక్షలు -
మరో టాప్ సీడ్ ఔట్
యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ కొరోలినా పిస్కోవా(చెక్) తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్ లో అమెరికా క్రీడాకారిణి టటిస్విలి కొరోలినాకు షాకిచ్చింది. 6-2, 6-1, స్కోర్ తో బోల్తాకొట్టించింది. గంటలోపే ముగిసిన మ్యాచ్ లో కొరోలినా సర్వీస్ ను 5సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ మొత్తానికి 3 డబుల్ ఫాల్ట్ లు చేసిన కరోలీనా తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా సోమా వారం ప్రారంభమైన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఇద్దరు టాప్ సీడ్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగి నట్లైంది. -
‘దశ’ధీర...
పదోసారి వింబుల్డన్ సెమీస్‌లోకి ఫెడరర్ ఆండీ ముర్రేతో తదుపరి పోరు మరో క్వార్టర్స్‌లో సిలిచ్‌పై జొకోవిచ్ గెలుపు లండన్: తనకు కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ గంటా 34 నిమిషాల్లో 6-3, 7-5, 6-2తో 12వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై అలవోకగా విజయం సాధించాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పదోసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 12-11తో ఆధిక్యంలో ఉన్నాడు. వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొమ్మిదిసార్లూ ఫెడరర్ ఫైనల్లోకి వచ్చి... ఏడుసార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈ టోర్నీ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను ఇద్దరు (2008లో రాఫెల్ నాదల్, 2014లో జొకోవిచ్) మాత్రమే ఓడించారు. 33 ఏళ్ల ఈ స్విస్ స్టార్ తన చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను వింబుల్డన్‌లోనే 2012లో సాధించడం గమనార్హం. ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టైటిల్‌ను అత్యధికంగా ఎనిమిదిసార్లు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాలని ఆశిస్తున్న ఫెడరర్‌కు ఈ టోర్నీలో గెలుపోటముల రికార్డు 78-9గా ఉంది. గతంలో సిమోన్‌తో ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్ల పోరాటంలో నెగ్గిన ఫెడరర్ ఈసారీ తన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ సిమోన్కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫెడరర్ 3-0తో ఆధిక్యంలో ఉన్నదశలో వర్షం కారణంగా ఆటకు 37 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. వర్షం వెలిశాక ఫెడరర్ మరింత జోరు పెంచి కేవలం 30 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. గెర్రీ వెబెర్ ఓపెన్ నుంచి మొదలు ఈ మ్యాచ్ వరకు వరుసగా 116 సర్వీస్‌లను నిలబెట్టుకున్న ఫెడరర్ రెండో సెట్లో స్కోరు 5-4తో ఉన్నదశలో తన సర్వీస్‌ను కోల్పోయాడు. సిమోన్ స్కోరును 5-5తో సమం చేసినా ఫెడరర్ వెంటనే అతని సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-5తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో మళ్లీ వర్షం రావడంతో దాదాపు గంటపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక ఫెడరర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో ఫెడరర్‌కు ఎదురేలేకుండా పోయింది. కేవలం కేవలం 26 నిమిషాల్లో ఈ సెట్‌ను నెగ్గి ఫెడరర్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెంటర్ కోర్టులో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే 6-4, 7-5, 6-4తో అన్‌సీడెడ్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా)పై గెలిచాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌కు రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న పోస్పిసిల్ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌కు చేరే క్రమంలో పోస్పిసిల్ ఐదు సెట్లపాటు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచాడు. అయితే ముర్రే ముందు అతని ఆటలు సాగలేదు. ప్రతి సెట్లో పోస్పిసిల్ సర్వీస్‌ను ఒక్కోసారి బ్రేక్ చేసిన ముర్రే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 150వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా అరుదైన రికార్డులో భాగస్వామిగా నిలిచాడు. ఆండీ ముర్రే సోదరుడు జేమీ ముర్రే ఇదే టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఫలితంగా 1962 తర్వాత వింబుల్డన్‌లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న సోదర ద్వయంగా ఆండీ ముర్రే, జేమీ ముర్రే నిలిచారు. 1962 లో జాన్ ఫ్రేజర్, నీల్ ఫ్రేజర్ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సా ధించారు. మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెం డింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సా ధించాడు. నాలుగో సీడ్ వావ్రిం కా (స్విట్జర్లాండ్), 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీస్‌లో జొకోవిచ్ తలపడతాడు. -
నాదల్ కుదేల్
లండన్: ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది వింబుల్డన్ టోర్నీలో నిరాశపరిచాడు. ఊహించనిరీతిలో వరుసగా మూడోసారీ అన్‌సీడెడ్ చేతిలోనే ఓడిపోయాడు. 2012లో రెండో రౌండ్లో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్-100వ ర్యాంక్) చేతిలో; 2013లో తొలి రౌండ్లో స్టీవ్ డార్సిస్ (బెల్జియం-135వ ర్యాంక్) చేతిలో ఓడిన నాదల్.... ఈసారి నాలుగో రౌండ్లో 19 ఏళ్ల ఆస్ట్రేలియా యువతార నిక్ కిర్గియోస్ (144వ ర్యాంక్) ధాటికి చేతులెత్తేశాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కిర్గియోస్ ఆద్యంతం దూకుడుగా ఆడి 7-6 (7/5), 5-7, 7-6 (7/5), 6-3తో రెండో సీడ్ నాదల్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. తొలి ప్రయత్నంలోనే వింబుల్డన్ టోర్నీతోపాటు కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 2 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 4 అంగుళాల కిర్గియోస్ 37 ఏస్‌లు సంధించాడు. షరపోవా నిష్ర్కమణ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ షరపోవా పోరాటం ముగిసింది. నాలుగో రౌండ్లో తొమ్మిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (7/4), 4-6, 6-4తో షరపోవాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సఫరోవా 6-3, 6-1తో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)ను ఓడించింది. ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) 6-3, 3-6, 6-4తో ష్వెదోవా (కజకిస్థాన్)పై; మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో జరీనా దియాస్ (కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఫెడరర్ జోరు పురుషుల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో ఫెడరర్ 6-1, 6-4, 6-4తో టామీ రొబ్రెడో (స్పెయిన్)పై... వావ్రింకా 7-6 (7/5), 7-6 (9/7), 6-3తో లోపెజ్ (స్పెయిన్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 4-6, 6-1, 7-6 (7/4), 6-3తో 10వ సీడ్ నిషికోరి (జపాన్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం ఆలస్యంగా ముగిసిన మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-4, 7-6 (7/5)తో 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలిచాడు. -
నాదల్‌ను నిలువరించేనా!
మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ తొలి రోజు బరిలో ఫెడరర్, సెరెనా పారిస్: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్... అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తి చేసుకోవాలనే పట్టుదలతో జొకోవిచ్... కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే తపనతో ఫెడరర్... క్లే కోర్టులపై కూడా రాణించగలనని నిరూపించుకోవడానికి ఆండీ ముర్రే... ఇలా దిగ్గజాలంతా తలా ఓ లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారం తెరలేవనుంది. క్లే కోర్టులపై తిరుగులేని రాఫెల్ నాదల్ మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్ ఈసారీ గెలిస్తే వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. గతంలో నాదల్ రెండుసార్లు వరుసగా నాలుగేసి సార్లు (2005 నుంచి 2008 వరకు; 2010 నుంచి 2013 వరకు) ఈ టోర్నీని గెలిచాడు. ఈ టోర్నీలో నాదల్కు ఏకైక పరాజయం 2009లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో ఎదురైంది. మరోవైపు కెరీర్లో వరుసగా 58వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న ఫెడరర్ తొలి రోజు లుకాస్ లాకో (స్లొవేకియా)తో పోటీపడనున్నాడు. 1999 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచి... ఒకసారి (2009లో) విజేతగా నిలిచాడు. 10వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జొకోవిచ్ ఐదుసార్లు సెమీస్‌కు చేరుకొని, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు. సెరెనా నిలిచేనా! మహిళల విభాగంలో 2007 నుంచి ప్రతి ఏడాదీ కొత్త చాంపియన్ అవతరిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆదివారం జరిగే తొలి రౌండ్లో అలీజా లిమ్ (ఫ్రాన్స్)తో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్స్లోపే సెరెనాకు మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్, మాజీ విజేత షరపోవా (రష్యా) ఎదురయ్యే అవకాశముండటంతో ఈసారి ఆమె టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 16,50,000 యూరోలు (రూ. 13 కోట్ల 14 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. -
సిబుల్కోవా జైత్రయాత్ర
అంచనాలకు మించి రాణిస్తున్న స్లొవేకియా సుందరి డొమినికా సిబుల్కోవా... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ఐదోసీడ్ రద్వాన్స్కాపై గెలిచి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో నా లీతో సిబుల్కోవా తలపడుతుంది. మెల్బోర్న్: ఆటలో నైపుణ్యం ఉంటే ర్యాంక్‌లతో పని లేదని స్లొవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా నిరూపించింది. తన కంటే మెరుగైన ప్రత్యర్థులను కూడా తనదైన శైలిలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో షరపోవా... క్వార్టర్స్‌లో హలెప్లపై సంచలన విజయాలు నమోదు చేసిన ఆమె సెమీస్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. కెరీర్లో 27వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సిబుల్కోవా తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా 6-1, 6-2తో అగ్నేస్కా రద్వాన్‌స్కా (పొలెండ్)పై విజయం సాధించింది. గతంలో మెల్బోర్న్ పార్క్‌లో నాలుగో రౌండ్ దాటని సిబుల్కోవా ఈసారి మాత్రం అత్యుత్తమ టెన్నిస్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్ మొత్తంలో 21 విన్నర్లు కొట్టిన సిబుల్కోవా రెండుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొమ్మిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకోగా, రద్వాన్‌స్కా ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది. ఫైనల్లో నా లీ మరో సెమీస్‌లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-4తో 30వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 86 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ర్యాపిడ్ ఆరంభంతో అదరగొట్టింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి 5-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కాస్త నెమ్మదించినా ప్రత్యర్థికి మాత్రం పెద్దగా అవకాశం ఇవ్వలేదు. రెండోసెట్లో 19 ఏళ్ల బౌచర్డ్ గట్టిపోటీ ఇచ్చింది. సుదీర్ఘమైన ర్యాలీలు జరగడంతో ఇద్దరి మధ్య ఐదుసార్లు సర్వీస్ బ్రేక్ అయ్యింది. అయితే సెట్ చివర్లో తన అనుభవాన్ని రంగరించి ఆడిన లీ రెండు సర్వీస్ గేమ్‌లను గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పది బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకున్న నా లీ మొత్తం 35 విన్నర్లు, 5 ఏస్‌లు కొట్టింది. సెమీస్‌లో సానియా జోడి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి... ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఆరోసీడ్ సానియా-టెకాయు 6-3, 6-4తో అన్‌సీడెడ్ ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్)-జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచారు. 63 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలిసెట్లో మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో సానియా జోడి ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. అయితే రెండోసెట్ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-హంతుచోవా (స్లొవేకియా) 3-6, 3-6తో క్రిస్టినా మల్దోనోవిచ్ (ఫ్రాన్స్)-డానియెల్ నెస్టర్ (కెనడా) చేతిలో ఓడారు. పురుషుల ఫైనల్లో వావ్రింకా పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో అతను 6-3, 6-7 (1/7), 7-6, (7/3), 7-6 (7/4)తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై గెలిచాడు. మూడు గంటల 31 నిమిషాల పాటు నువ్వా.. నేనా అన్నట్లు జరిగిన నాలుగు సెట్ల పోరాటంలో స్విస్ ఆటగాడు ఆద్యంతం సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు. నాదల్ xఫెడరర్ పురుషుల రెండో సెమీఫైనల్ నేడు మ.గం 3 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో లైవ్ -
సూపర్ సెరెనా
వయసు పెరిగినా వన్నె తగ్గలేదని అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరోసారి నిరూపించింది. మండే ఎండలో మెరిపిస్తూ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. శుక్రవారం నాటి మూడో రౌండ్ గెలుపుతో ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 60 విజయాలతో మార్గరెట్ కోర్టు పేరిట ఉన్న రికార్డును 32 ఏళ్ల సెరెనా బద్దలు కొట్టింది. మెల్బోర్న్: కెరీర్లో అద్భుత ఫామ్‌లో ఉన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సునాయాస గెలుపుతో ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా 6-3, 6-3తో 31వ సీడ్ డానియెలా హంతుచోవా (స్లొవేకియా)పై గెలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించడంతోపాటు రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 18 అనవసర తప్పిదాలు చేసినా 11 విన్నర్స్‌తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సెరెనా ఈ టోర్నీలో తొలిసారి 31 ఏళ్ల హంతుచోవాకు బ్రేక్ పాయింట్ సమర్పించుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో సెరెనా కొత్త రికార్డును సృష్టించడంతోపాటు మరో రికార్డును సమం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో అత్యధికంగా 61 విజయాలు సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సెరెనా... 60 విజయాలతో మార్గరెట్ కోర్టు (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అంతేకాకుండా ఇదే టోర్నీలో అత్యధికంగా 69 మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేసింది. మరో విశేషమేమిటంటే... 1998 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా 30 ఏళ్లు పైబడిన వారిపై వరుసగా 21వ విజయం సాధించింది. 30 ఏళ్లు నిండిన క్రీడాకారిణి చేతిలో సెరెనా ఓడిపోయి ఐదేళ్లయింది. చివరిసారి 2009లో ప్యాటీ ష్నెదర్ చేతిలో ఈ అమెరికా స్టార్ ఓటమి పాలైంది. ఓవరాల్‌గా సెరెనా తన కెరీర్లో... ప్లస్ 30 వయసు ఉన్న క్రీడాకారిణుల చేతిలో కేవలం మూడుసార్లు మాత్రమే పరాజయం చవిచూసింది. భళా... యూకీ జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుక్రవారం భారత్‌కు కలిసొచ్చింది. గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రం చేసిన భారత రైజింగ్ స్టార్ యూకీ బాంబ్రీ తన భాగస్వామి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి సంచలనం సృష్టించాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ-వీనస్ ద్వయం 6-4, 6-4తో 10వ సీడ్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడికి షాక్ ఇచ్చింది. రెండు సెట్లలో ఒక్కోసారి తమ ప్రత్యర్థి సర్వీస్‌ను యూకీ జంట బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట 6-4, 6-1తో లూకాస్ లూహీ-లూకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి చేరుకుంది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6-3, 6-3, 7-5తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు శుక్రవారం రెండు సంచలనాలూ నమోదయ్యాయి. తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 20వ సీడ్ జనోవిచ్ (పోలెండ్) మూడో రౌండ్లో నిష్ర్కమించారు. టామీ రొబ్రెడో (స్పెయిన్) 2-6, 7-5, 6-4, 7-6 (8/6)తో రిచర్డ్ గాస్కేను... ఫ్లోరియన్ మాయెర్ (జర్మనీ) 7-5, 6-2, 6-2తో జనోవిచ్ను ఇంటిదారి పట్టించారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు నా లీ (4వ సీడ్) 1-6, 7-6 (7/2), 6-3తో సఫరోవాపై కెర్బర్ (జర్మనీ) 6-3, 6-4తో రిస్కీ (అమెరికా)పై... 14వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-7 (8/10), 6-4, 6-2తో 17వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు మూడో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 7-6 (7/5), 6-2తో 29వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై... ఏడో సీడ్ బెర్డిచ్ 6-4, 6-2, 6-2తో జుమర్‌పై... 15వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 7-5, 6-4, 6-4తో సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచారు. -
ఆస్ట్రేలియన్ ‘ఓవెన్’
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆటగాళ్లు ఉడికిపోతున్నారు. భానుడి ప్రచండ జ్వాలలకు తట్టుకోలేక మాడిపోతున్నారు. వరుసగా రెండో రోజూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్లేయర్లు ‘నీరు’గారిపోతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక కొంత మంది చచ్చిపోతామని భయపడుతుంటే.. మరికొంత మంది గాయాలబారిన పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 41.5 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత... సాయంత్రం 6 గంటలకు 32డిగ్రీలకు తగ్గింది. అయినా కూడా ఆటగాళ్లు ఉక్కపోత భరించలేకపోతున్నారు. దీంతో ఐస్‌ప్యాక్‌లు, ఐసోటానిక్ డ్రింక్స్‌లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఇవాన్ డుడిగ్ వేడిని తట్టుకోలేక మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన ఆటగాళ్ల సంఖ్య 10కు చేరుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదో రికార్డు. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో వేడిమిని తట్టుకోలేక ఫ్రాంక్ డాన్స్విక్ (కెనడా) రిటైర్డ్‌హర్ట్ కాగా, పెంగ్ షుయ్ (చైనా) వాంతులు చేసుకుంది. ఓ బాల్ బాయ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కోర్టులో వేడికి ప్లాస్టిక్ బాటిల్ కరిగిందని ముర్రే, వోజ్నియాకి తెలిపారు. ఫిజియోతో చికిత్స కోసం నేల మీద పడుకుంటే శరీరం ప్రై అయ్యిందని డబుల్స్ ప్లేయర్ కొలిన్ ఫ్లెమింగ్ వాపోయాడు. అటు ప్రేక్షకులు కూడా స్టేడియం బయట ఫౌంటేన్‌లోకి దిగి చల్లబడుతున్నారు. -
‘కుమ్కుమ్’ షకలక...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే ఆరో సీడ్ పెట్రా క్విటోవా, ఏడో సీడ్ సారా ఎరాని, 12వ సీడ్ రొబెర్టా విన్సీ ఇంటిదారి పట్టారు. గత ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గని మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. మెల్బోర్న్: మండే ఎండలో మెరుపులాంటి ఆటతీరుతో థాయ్‌లాండ్ అనామక క్రీడాకారిణి లుక్సికా కుమ్కుమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించింది. కెరీర్లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడుతోన్న 20 ఏళ్ల ఈ థాయ్‌లాండ్ అమ్మాయి తొలి రౌండ్లో ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఇంటిముఖం పట్టించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ కుమ్కుమ్ 6-2, 1-6, 6-4తో వింబుల్డన్ మాజీ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ క్విటోవాను బోల్తా కొట్టించింది. కెరీర్లో 23వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన క్విటోవాకు అన్‌సీడెడ్ కుమ్కుమ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కుమ్కుమ్ శక్తివంతమైన డబుల్ హ్యాండెడ్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హాండ్ షాట్లతో హడలెత్తించింది. బేస్‌లైన్ వద్ద క్విటోవాను కట్టిపడేసి అడపాదడపా నెట్ వద్దకూ దూసుకొస్తూ ఈ థాయ్‌లాండ్ యువతార తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి సెట్లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన కుమ్కుమ్ అదే జోరులో 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్లో క్విటోవా తేరుకోవడంతో కుమ్కుమ్ జోరు తొలి సెట్‌కే పరిమితమా అన్న అనుమానం కలిగింది. అయితే కుమ్కుమ్ మూడో సెట్లో గేర్ మార్చింది. క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొత్తంలో నాలుగు ఏస్‌లు సంధించిన కుమ్కుమ్ నెట్‌వద్ద దూసుకొచ్చిన ఎనిమిది పర్యాయాల్లో ఏడుసార్లు పాయింట్లు నెగ్గింది. మరోవైపు క్విటోవా ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 2009 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్విటోవా తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే ప్రథమం. తల్లిదండ్రుల వద్దే టెన్నిస్ శిక్షణ తీసుకునే కుమ్కుమ్, రెండో రౌండ్లో జర్మనీకి చెందిన బార్తెల్తో ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో జూలియా (జర్మనీ) 6- 3, 6-2తో ఏడో సీడ్ సారా ఎరాని (ఇటలీ)పై; జెంగ్ జీ (చైనా) 6-4, 6-3తో 12వ సీడ్ విన్సీ (ఇటలీ)పై; అలీసన్ రిస్కీ (అమెరికా) 6-2, 6-2తో 23వ సీడ్ వెస్నినా (రష్యా)పై సంచలన విజయాలు సాధించారు. వీనస్‌కు నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలోనే మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. 22వ సీడ్ మకరోవా (రష్యా) 2-6, 6-4, 6-4తో వీనస్‌ను ఓడించింది. అక్క వీనస్ ఓడిపోయినా... చెల్లెలు సెరెనా విలియమ్స్ మాత్రం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-1తో యాష్లే బార్తీ (అమెరికా)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-0తో కోంజూ (క్రొయేషియా)పై, తొమ్మిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 0-6, 6-2తో గజ్దోసోవా (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-4, 6-4తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, 15వ సీడ్ లిసికి (జర్మనీ) 6-2, 6-1తో మిర్యానా (క్రొయేషియా)పై, 17వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-4తో జకోపలోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-6 (7/2), 6-1తో లుకాస్ లాకో (స్లొవేకియా)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-3, 6-4, 6-4తో అలెజాంద్రో (కొలంబియా)పై, ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-4, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)పై, తొమ్మిదో సీడ్ గాస్కే (ఫ్రాన్స్) 7-5, 6-4, 6-1తో గుయెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. నేటి తొలి రౌండ్ కీలక మ్యాచ్‌లు పురుషుల విభాగం రాఫెల్ నాదల్ (1) xబెర్నాడ్ టామిక్ ఆండీ ముర్రే (4) x గో సొయెదా డెల్ పొట్రో (5) x రైన్ విలియమ్స్ ఫెడరర్ (6) x డక్‌వర్త్ సోంగా (10) x వొలాంద్రీ మహిళల విభాగం అజరెంకా (2) x జోనా లార్సన్ షరపోవా (3) x బెథానీ మాటెక్ రద్వాన్‌స్కా (5) x పుతిన్సెవా జంకోవిచ్ (8) x మిసాకి దోయ్ వొజ్నియాకి (10) x లార్డెస్ నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్ ‘చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. క్విటోవాలాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణి చేతిలో ఓడితే నాకు పోయేదేమీ ఉండదు. అందుకే నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడమే లక్ష్యంగా బరిలోకి దిగాను. సంచలన ఫలితం సాధించాను.’ - కుమ్కుమ్ -
జొకోవిచ్‌తో నాదల్ ‘ఢీ’
సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ మరో ‘గ్రాండ్‌స్లామ్’ సమరానికి సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కగా... ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ వరుస సెట్లలో విజయాన్ని దక్కించుకున్నాడు. న్యూయార్క్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంతిమ సమరానికి అర్హత సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్స్‌లో జొకోవిచ్ 2-6, 7-6 (7/4), 3-6, 6-3, 6-4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై; నాదల్ 6-4, 7-6 (7/1), 6-2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గి 37వ సారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నాదల్ 21సార్లు... జొకోవిచ్ 15సార్లు గెలిచారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన నాదల్ ఈ జాబితాలో పీట్ సంప్రాస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన్ శకంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడిన జోడిగా మెకన్రో-లెండిల్ పేరిట ఉన్న రికార్డును నాదల్, జొకోవిచ్ సోమవారం మ్యాచ్‌తో తెరమరుగు చేయనున్నారు. పురుషుల ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 2.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
జొకోవిచ్‌తో నాదల్ ‘ఢీ’
సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ మరో ‘గ్రాండ్‌స్లామ్’ సమరానికి సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కగా... ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ వరుస సెట్లలో విజయాన్ని దక్కించుకున్నాడు. న్యూయార్క్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంతిమ సమరానికి అర్హత సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్స్‌లో జొకోవిచ్ 2-6, 7-6 (7/4), 3-6, 6-3, 6-4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై; నాదల్ 6-4, 7-6 (7/1), 6-2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గి 37వ సారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నాదల్ 21సార్లు... జొకోవిచ్ 15సార్లు గెలిచారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన నాదల్ ఈ జాబితాలో పీట్ సంప్రాస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన్ శకంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడిన జోడిగా మెకన్రో-లెండిల్ పేరిట ఉన్న రికార్డును నాదల్, జొకోవిచ్ సోమవారం మ్యాచ్‌తో తెరమరుగు చేయనున్నారు. పురుషుల ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 2.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మిగిలింది వీడ్కోలే(నా)!
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సోమవారం సంచలనానికే సంచలనం కలిగే ఫలితం నమోదైంది. వరుసగా ఐదుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ ఊహించనిరీతిలో నాలుగో రౌండ్లోనే నిష్ర్కమించాడు. సాక్షి క్రీడావిభాగం ‘నేను చూస్తోంది నమ్మశక్యంగాలేదు’ రొబ్రెడో చేతిలో ఫెడరర్ ఓడిపోయాక అమెరికా విఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు జాన్ మెకన్రో నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలివి. నిజమే... 2003 నుంచి 2012 వరకు ప్రతి ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకోవడమో లేక రన్నరప్‌గా నిలవడమో చేసిన వ్యక్తి వరుస సెట్లలో ఓడిపోతే ఆశ్చర్యపోవాల్సిందే. 2004 నుంచి 2008 వరకు వరసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి 2009లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ ఈసారి నాలుగో రౌండ్లోనే ఓడిపోయాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫెడరర్ ఓడిపోయిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి అతను ఓడిన విధానం చూశాక ఫెడరర్ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందనే అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది ఫెడరర్ ఒకే ఒక్క ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. అతని కెరీర్లో ఇలా జరగడం 2001 తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది వింబుల్డన్‌లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఫెడరర్ ఈ ఏడాది అదే టోర్నీలో ప్రపంచ 116వ ర్యాంకర్ సెర్గీ స్తఖోవ్స్కీ (ఉక్రెయిన్) చేతిలో రెండో రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన గెస్టాడ్ ఓపెన్‌లో ప్రపంచ 55వ ర్యాంకర్ డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో; హాంబర్గ్ ఓపెన్‌లో ప్రపంచ 114వ ర్యాంకర్ డెల్బోనిస్ (అర్జెంటీనా) చేతిలో అనూహ్య పరాజయాలు చవిచూశాడు. ఇన్నాళ్లూ తనకే సాధ్యమైన శైలిలో ఫెడరర్ ఆడుతూ అద్వితీయ విజయాలు సొంతం చేసుకున్నాడు. కానీ గత మూడేళ్లుగా అతని ఆటలో పదును లోపించింది. గత 15 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కేవలం రెండింటిలో మాత్రమే ఫైనల్‌కు చేరుకొని ఒకదాంట్లో టైటిల్ నెగ్గిన ఫెడరర్ తాజా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అతని ఖాతాలో భవిష్యత్‌లో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరే అవకాశాలకు తెరపడినట్టే. ఫెడరర్ ఎత్తుగడలు, వ్యూహాలకు తగిన సమాధానాలు కనుగొంటూ అతని ప్రధాన ప్రత్యర్థులు జొకోవిచ్ (సెర్బియా), నాదల్ (స్పెయిన్), ముర్రే (బ్రిటన్) పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ‘ఈ ఓటమిని తొందరగా మర్చిపోతాను. శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మున్ముందు మెరుగైన ఆటతీరు కనబరచాలని కోరుకుంటున్నాను’ అని యూఎస్ ఓపెన్‌లో ఓటమి తర్వాత ఫెడరర్ వ్యాఖ్యానించాడు. అయితే జొకోవిచ్, నాదల్, ముర్రే జోరుమీదున్న దశలో ఫెడరర్ మళ్లీ పుంజుకొని పూర్వ వైభవం సాధిస్తాడనేది అనుమానమే. ఈ ఏడాది ఫెడరర్ 32 మ్యాచ్‌ల్లో గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఈ గణాంకాలు చూస్తే ఫెడరర్ ఈ ఏడాదే రిటైరవుతాడని సూచించడంలేదు. కానీ ఇకపై ఆడే ప్రతి టోర్నీ ఈ దిగ్గజానికి పరీక్షలాంటిదే. 32 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం టెన్నిస్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఎవరికీ సాధ్యంకాని విధంగా 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. 302 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడితే వరుసగా 57 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఏ దిగ్గజం కూడా తన కెరీర్‌ను గొప్పగా ముగించలేకపోయాడు. ప్రస్తుతం ఫెడరర్ ఆటతీరును పరిశీలిస్తే అతనికీ ఈ సూత్రం వర్తిస్తుందేమో అనిపిస్తోంది..! రొబ్రెడో చేతిలో అనూహ్య ఓటమి న్యూయార్క్: భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి రెండున్నర గంటల తర్వాత మొదలైన మ్యాచ్‌లో ఏడో సీడ్ ఫెడరర్ 6-7 (3/7), 3-6, 4-6తో 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన రొబ్రెడో ఈసారి నెగ్గడం విశేషం. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌కు ప్రత్యర్థి సర్వీస్‌ను 16 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ మాజీ నంబర్‌వన్ కేవలం 2సార్లు మాత్రమే సఫలమయ్యాడు. 43 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు రొబ్రెడో తనకు లభించిన ఏడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో నాలుగింటిని సద్వినియోగం చేసుకొని సంచలన ఫలితానికి కార్యరూపం ఇచ్చాడు. 1 2002 తర్వాత ఫెడరర్ తొలిసారి సీజన్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. 9 తొమ్మిదేళ్ల తర్వాత ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ దశలోనే నిష్ర్కమించాడు. ‘‘నేను చాలా అవకాశాలను వృథా చేసుకున్నాను. మ్యాచ్ మొత్తం ఇబ్బంది పడ్డాను. ఈ అంశమే తీవ్ర నిరాశకు గురిచేసింది. నన్ను నేనే ఓడించుకున్నాననే భావన కలుగుతోంది. రొబ్రెడో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తానికి ఈ ప్రదర్శన నాకు అసహనం కలిగేలా చేసింది. అన్నింటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం, ఆటలో స్థిరత్వం ఉండాలి. అవి లోపించడమే ఈ మ్యాచ్‌లో నా ఓటమికి కారణం.’’ -ఫెడరర్ -
స్టోసుర్కు షాక్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో తొలి సంచలనం నమోదైంది. 2011 చాంపియన్, 11వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల ‘క్వాలిఫయర్’ విక్టోరియా దువాల్ అద్భుత ఆటతీరుతో 5-7, 6-4, 6-4తో స్టోసుర్‌ను బోల్తా కొట్టించి కెరీర్లో ‘తొలి గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 296వ స్థానంలో ఉన్న దువాల్ 2 గంటల 39 నిమిషాల పోరాటంలో స్టోసుర్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అజరెంకా (బెలారస్) 6-0, 6-0తో పిఫిజెన్మాయెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6-2, 7-5తో దువాన్ (చైనా), నాలుగో సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-0, 6-0తో రొగోవ్స్కా (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. మూడో రౌండ్లో రద్వాన్‌స్కా, నా లీ బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ రద్వాన్‌స్కా (పోలాండ్) 6-0, 7-5తో మరియా తెరిసా టోరోఫ్లోర్ (స్పెయిన్)పై, ఐదో సీడ్ నా లీ 6-2, 6-2తో అర్విడ్సన్ (స్వీడన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2, 6-2తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, ఏడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 7-5తో జెమాల్జా (స్లొవేనియా)పై గెలిచారు. 12వ సీడ్ హాస్ (జర్మనీ), 13వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) కూడా రెండో రౌండ్‌కు చేరారు. -
ఒక్క మ్యాచ్‌కే కోచ్‌పై వేటు
మాస్కో: అమెరికా టెన్నిస్ దిగ్గజం జిమ్మీ కానర్స్, రష్యా స్టార్ మరియా షరపోవాల గురుశిష్యుల బంధం నెలరోజుల ముచ్చటే అయింది. నెలరోజుల క్రితం ఆయనను కోచ్‌గా నియమించుకున్న ఈ రష్యా రమణి ఒక్క మ్యాచ్‌తోనే కానర్స్ కోచింగ్‌కు మంగళం పాడింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో స్లోన్ స్టీఫెన్స్ చేతిలో షరపోవా ఓడింది. కానర్స్ ఈ ఫలితంపై తేలిగ్గా ట్వీట్ చేయడంతో విభేదించిన షరపోవా ఆయన్ను కోచ్‌గా తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో కోచ్ లేకుండా ఆమె యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ బరిలోకి దిగనుంది. జిమ్మీ కానర్స్ను ఆమె గత నెలలోనే కోచ్‌గా నియమించుకుంది. అప్పుడు ఆయన భాగస్వామ్యంపై ఎంతో ఆసక్తిని కనబరిచిన ఆమె అంతలోనే ఆయన కోచ్గిరికి ఫుల్స్టాప్ పెట్టింది.