మిగిలింది వీడ్కోలే(నా)!
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సోమవారం సంచలనానికే సంచలనం కలిగే ఫలితం నమోదైంది. వరుసగా ఐదుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ ఊహించనిరీతిలో నాలుగో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.
సాక్షి క్రీడావిభాగం
‘నేను చూస్తోంది నమ్మశక్యంగాలేదు’ రొబ్రెడో చేతిలో ఫెడరర్ ఓడిపోయాక అమెరికా విఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు జాన్ మెకన్రో నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలివి. నిజమే... 2003 నుంచి 2012 వరకు ప్రతి ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకోవడమో లేక రన్నరప్‌గా నిలవడమో చేసిన వ్యక్తి వరుస సెట్‌లలో ఓడిపోతే ఆశ్చర్యపోవాల్సిందే.
2004 నుంచి 2008 వరకు వరసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి 2009లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ ఈసారి నాలుగో రౌండ్‌లోనే ఓడిపోయాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫెడరర్ ఓడిపోయిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి అతను ఓడిన విధానం చూశాక ఫెడరర్ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందనే అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది ఫెడరర్ ఒకే ఒక్క ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. అతని కెరీర్‌లో ఇలా జరగడం 2001 తర్వాత ఇదే తొలిసారి.
గత ఏడాది వింబుల్డన్‌లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఫెడరర్ ఈ ఏడాది అదే టోర్నీలో ప్రపంచ 116వ ర్యాంకర్ సెర్గీ స్తఖోవ్‌స్కీ (ఉక్రెయిన్) చేతిలో రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన గెస్టాడ్ ఓపెన్‌లో ప్రపంచ 55వ ర్యాంకర్ డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో; హాంబర్గ్ ఓపెన్‌లో ప్రపంచ 114వ ర్యాంకర్ డెల్‌బోనిస్ (అర్జెంటీనా) చేతిలో అనూహ్య పరాజయాలు చవిచూశాడు. ఇన్నాళ్లూ తనకే సాధ్యమైన శైలిలో ఫెడరర్ ఆడుతూ అద్వితీయ విజయాలు సొంతం చేసుకున్నాడు.
కానీ గత మూడేళ్లుగా అతని ఆటలో పదును లోపించింది. గత 15 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కేవలం రెండింటిలో మాత్రమే ఫైనల్‌కు చేరుకొని ఒకదాంట్లో టైటిల్ నెగ్గిన ఫెడరర్ తాజా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అతని ఖాతాలో భవిష్యత్‌లో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరే అవకాశాలకు తెరపడినట్టే. ఫెడరర్ ఎత్తుగడలు, వ్యూహాలకు తగిన సమాధానాలు కనుగొంటూ అతని ప్రధాన ప్రత్యర్థులు జొకోవిచ్ (సెర్బియా), నాదల్ (స్పెయిన్), ముర్రే (బ్రిటన్) పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ‘ఈ ఓటమిని తొందరగా మర్చిపోతాను. శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మున్ముందు మెరుగైన ఆటతీరు కనబరచాలని కోరుకుంటున్నాను’ అని యూఎస్ ఓపెన్‌లో ఓటమి తర్వాత ఫెడరర్ వ్యాఖ్యానించాడు. అయితే జొకోవిచ్, నాదల్, ముర్రే జోరుమీదున్న దశలో ఫెడరర్ మళ్లీ పుంజుకొని పూర్వ వైభవం సాధిస్తాడనేది అనుమానమే. ఈ ఏడాది ఫెడరర్ 32 మ్యాచ్‌ల్లో గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఈ గణాంకాలు చూస్తే ఫెడరర్ ఈ ఏడాదే రిటైరవుతాడని సూచించడంలేదు. కానీ ఇకపై ఆడే ప్రతి టోర్నీ ఈ దిగ్గజానికి పరీక్షలాంటిదే.
32 ఏళ్ల ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం టెన్నిస్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఎవరికీ సాధ్యంకాని విధంగా 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. 302 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడితే వరుసగా 57 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఏ దిగ్గజం కూడా తన కెరీర్‌ను గొప్పగా ముగించలేకపోయాడు. ప్రస్తుతం ఫెడరర్ ఆటతీరును పరిశీలిస్తే అతనికీ ఈ సూత్రం వర్తిస్తుందేమో అనిపిస్తోంది..!
రొబ్రెడో చేతిలో అనూహ్య ఓటమి
న్యూయార్క్: భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి రెండున్నర గంటల తర్వాత మొదలైన మ్యాచ్‌లో ఏడో సీడ్ ఫెడరర్ 6-7 (3/7), 3-6, 4-6తో 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు.
గతంలో ఫెడరర్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన రొబ్రెడో ఈసారి నెగ్గడం విశేషం. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌కు ప్రత్యర్థి సర్వీస్‌ను 16 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ మాజీ నంబర్‌వన్ కేవలం 2సార్లు మాత్రమే సఫలమయ్యాడు. 43 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు రొబ్రెడో తనకు లభించిన ఏడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో నాలుగింటిని సద్వినియోగం చేసుకొని సంచలన ఫలితానికి కార్యరూపం ఇచ్చాడు.
1
2002 తర్వాత ఫెడరర్ తొలిసారి సీజన్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు.
9
తొమ్మిదేళ్ల తర్వాత ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ దశలోనే నిష్ర్కమించాడు.
‘‘నేను చాలా అవకాశాలను వృథా చేసుకున్నాను. మ్యాచ్ మొత్తం ఇబ్బంది పడ్డాను. ఈ అంశమే తీవ్ర నిరాశకు గురిచేసింది. నన్ను నేనే ఓడించుకున్నాననే భావన కలుగుతోంది. రొబ్రెడో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు.
మొత్తానికి ఈ ప్రదర్శన నాకు అసహనం కలిగేలా చేసింది. అన్నింటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం, ఆటలో స్థిరత్వం ఉండాలి. అవి లోపించడమే ఈ మ్యాచ్‌లో నా ఓటమికి కారణం.’’
-ఫెడరర్