‘దశ’ధీర...
పదోసారి వింబుల్డన్ సెమీస్‌లోకి ఫెడరర్
ఆండీ ముర్రేతో తదుపరి పోరు
మరో క్వార్టర్స్‌లో సిలిచ్‌పై జొకోవిచ్ గెలుపు
లండన్: తనకు కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ గంటా 34 నిమిషాల్లో 6-3, 7-5, 6-2తో 12వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై అలవోకగా విజయం సాధించాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పదోసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 12-11తో ఆధిక్యంలో ఉన్నాడు.
వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొమ్మిదిసార్లూ ఫెడరర్ ఫైనల్లోకి వచ్చి... ఏడుసార్లు విజేతగా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈ టోర్నీ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను ఇద్దరు (2008లో రాఫెల్ నాదల్, 2014లో జొకోవిచ్) మాత్రమే ఓడించారు. 33 ఏళ్ల ఈ స్విస్ స్టార్ తన చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను వింబుల్డన్‌లోనే 2012లో సాధించడం గమనార్హం. ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టైటిల్‌ను అత్యధికంగా ఎనిమిదిసార్లు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాలని ఆశిస్తున్న ఫెడరర్‌కు ఈ టోర్నీలో గెలుపోటముల రికార్డు 78-9గా ఉంది.
గతంలో సిమోన్‌తో ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్‌ల పోరాటంలో నెగ్గిన ఫెడరర్ ఈసారీ తన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేదు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ సిమోన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫెడరర్ 3-0తో ఆధిక్యంలో ఉన్నదశలో వర్షం కారణంగా ఆటకు 37 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. వర్షం వెలిశాక ఫెడరర్ మరింత జోరు పెంచి కేవలం 30 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. గెర్రీ వెబెర్ ఓపెన్ నుంచి మొదలు ఈ మ్యాచ్ వరకు వరుసగా 116 సర్వీస్‌లను నిలబెట్టుకున్న ఫెడరర్ రెండో సెట్‌లో స్కోరు 5-4తో ఉన్నదశలో తన సర్వీస్‌ను కోల్పోయాడు.
సిమోన్ స్కోరును 5-5తో సమం చేసినా ఫెడరర్ వెంటనే అతని సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-5తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో మళ్లీ వర్షం రావడంతో దాదాపు గంటపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక ఫెడరర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో ఫెడరర్‌కు ఎదురేలేకుండా పోయింది. కేవలం కేవలం 26 నిమిషాల్లో ఈ సెట్‌ను నెగ్గి ఫెడరర్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
సెంటర్ కోర్టులో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే 6-4, 7-5, 6-4తో అన్‌సీడెడ్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా)పై గెలిచాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌కు రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న పోస్పిసిల్ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌కు చేరే క్రమంలో పోస్పిసిల్ ఐదు సెట్‌లపాటు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచాడు. అయితే ముర్రే ముందు అతని ఆటలు సాగలేదు. ప్రతి సెట్‌లో పోస్పిసిల్ సర్వీస్‌ను ఒక్కోసారి బ్రేక్ చేసిన ముర్రే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 150వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా అరుదైన రికార్డులో భాగస్వామిగా నిలిచాడు. ఆండీ ముర్రే సోదరుడు జేమీ ముర్రే ఇదే టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.
ఫలితంగా 1962 తర్వాత వింబుల్డన్‌లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న సోదర ద్వయంగా ఆండీ ముర్రే, జేమీ ముర్రే నిలిచారు. 1962 లో జాన్ ఫ్రేజర్, నీల్ ఫ్రేజర్ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సా ధించారు. మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెం డింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సా ధించాడు. నాలుగో సీడ్ వావ్రిం కా (స్విట్జర్లాండ్), 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీస్‌లో జొకోవిచ్ తలపడతాడు.