నాదల్ కుదేల్ | Nick Kyrgios stuns Rafael Nadal with four-set Wimbledon victory | Sakshi
Sakshi News home page

నాదల్ కుదేల్

Published Wed, Jul 2 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

నాదల్ కుదేల్

నాదల్ కుదేల్

లండన్: ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది వింబుల్డన్ టోర్నీలో నిరాశపరిచాడు. ఊహించనిరీతిలో వరుసగా మూడోసారీ అన్‌సీడెడ్ చేతిలోనే ఓడిపోయాడు. 2012లో రెండో రౌండ్‌లో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్-100వ ర్యాంక్) చేతిలో; 2013లో తొలి రౌండ్‌లో స్టీవ్ డార్సిస్ (బెల్జియం-135వ ర్యాంక్) చేతిలో ఓడిన నాదల్.... ఈసారి నాలుగో రౌండ్‌లో 19 ఏళ్ల ఆస్ట్రేలియా యువతార నిక్ కిర్గియోస్ (144వ ర్యాంక్) ధాటికి చేతులెత్తేశాడు.
 
  అందరి అంచనాలను తారుమారు చేస్తూ కిర్గియోస్ ఆద్యంతం దూకుడుగా ఆడి 7-6 (7/5), 5-7, 7-6 (7/5), 6-3తో రెండో సీడ్ నాదల్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. తొలి ప్రయత్నంలోనే వింబుల్డన్ టోర్నీతోపాటు కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 2 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 4 అంగుళాల కిర్గియోస్ 37 ఏస్‌లు సంధించాడు.
 
 షరపోవా నిష్ర్కమణ
 మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ షరపోవా పోరాటం ముగిసింది. నాలుగో రౌండ్‌లో తొమ్మిదో సీడ్  కెర్బర్ (జర్మనీ) 7-6 (7/4), 4-6, 6-4తో షరపోవాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు 23వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సఫరోవా 6-3, 6-1తో 22వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)ను ఓడించింది. ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో నిరుటి రన్నరప్, 19వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) 6-3, 3-6, 6-4తో ష్వెదోవా (కజకిస్థాన్)పై; మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో జరీనా దియాస్ (కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
 
 ఫెడరర్ జోరు
 పురుషుల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్‌లో ఫెడరర్ 6-1, 6-4, 6-4తో టామీ రొబ్రెడో (స్పెయిన్)పై... వావ్రింకా 7-6 (7/5), 7-6 (9/7), 6-3తో లోపెజ్ (స్పెయిన్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 4-6, 6-1, 7-6 (7/4), 6-3తో 10వ సీడ్ నిషికోరి (జపాన్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం ఆలస్యంగా ముగిసిన మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-4, 7-6 (7/5)తో 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్)పై గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement