సూపర్ సెరెనా | Australian Open: Djokovic, Serena Williams cruise into 4th round | Sakshi
Sakshi News home page

సూపర్ సెరెనా

Published Sat, Jan 18 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

సూపర్ సెరెనా

సూపర్ సెరెనా

 వయసు పెరిగినా వన్నె తగ్గలేదని అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరోసారి నిరూపించింది. మండే ఎండలో మెరిపిస్తూ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. శుక్రవారం నాటి మూడో రౌండ్ గెలుపుతో ఈ మెగా ఈవెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 60 విజయాలతో మార్గరెట్ కోర్టు పేరిట ఉన్న రికార్డును 32 ఏళ్ల సెరెనా బద్దలు కొట్టింది.
 
 మెల్‌బోర్న్: కెరీర్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సునాయాస గెలుపుతో ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 6-3, 6-3తో 31వ సీడ్ డానియెలా హంతుచోవా (స్లొవేకియా)పై గెలిచింది.
 
 
  80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించడంతోపాటు రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 18 అనవసర తప్పిదాలు చేసినా 11 విన్నర్స్‌తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సెరెనా ఈ టోర్నీలో తొలిసారి 31 ఏళ్ల హంతుచోవాకు బ్రేక్ పాయింట్ సమర్పించుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో సెరెనా కొత్త రికార్డును సృష్టించడంతోపాటు మరో రికార్డును సమం చేసింది.
 
  ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో అత్యధికంగా 61 విజయాలు సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సెరెనా... 60 విజయాలతో మార్గరెట్ కోర్టు (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అంతేకాకుండా ఇదే టోర్నీలో అత్యధికంగా 69 మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేసింది. మరో విశేషమేమిటంటే... 1998 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా 30 ఏళ్లు పైబడిన వారిపై  వరుసగా 21వ విజయం సాధించింది.  30 ఏళ్లు నిండిన క్రీడాకారిణి చేతిలో సెరెనా ఓడిపోయి ఐదేళ్లయింది. చివరిసారి 2009లో ప్యాటీ ష్నెదర్ చేతిలో ఈ అమెరికా స్టార్ ఓటమి పాలైంది. ఓవరాల్‌గా సెరెనా తన కెరీర్‌లో... ప్లస్ 30 వయసు ఉన్న క్రీడాకారిణుల చేతిలో కేవలం మూడుసార్లు మాత్రమే పరాజయం చవిచూసింది.
 
 భళా... యూకీ జోడి
 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుక్రవారం భారత్‌కు కలిసొచ్చింది. గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రం చేసిన భారత రైజింగ్ స్టార్ యూకీ బాంబ్రీ తన భాగస్వామి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి సంచలనం సృష్టించాడు.
 
  పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో యూకీ-వీనస్ ద్వయం 6-4, 6-4తో 10వ సీడ్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడికి షాక్ ఇచ్చింది. రెండు సెట్‌లలో ఒక్కోసారి తమ ప్రత్యర్థి సర్వీస్‌ను యూకీ జంట బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట 6-4, 6-1తో లూకాస్ లూహీ-లూకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లోకి చేరుకుంది.
 
 జొకోవిచ్ జోరు
 పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో జొకోవిచ్ 6-3, 6-3, 7-5తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు.
 
  మరోవైపు శుక్రవారం రెండు సంచలనాలూ నమోదయ్యాయి. తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 20వ సీడ్ జనోవిచ్ (పోలెండ్) మూడో రౌండ్‌లో నిష్ర్కమించారు. టామీ రొబ్రెడో (స్పెయిన్) 2-6, 7-5, 6-4, 7-6 (8/6)తో రిచర్డ్ గాస్కేను... ఫ్లోరియన్ మాయెర్ (జర్మనీ) 7-5, 6-2, 6-2తో జనోవిచ్‌ను ఇంటిదారి పట్టించారు.
 
 మహిళల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు
 నా లీ (4వ సీడ్) 1-6, 7-6 (7/2), 6-3తో  సఫరోవాపై
 కెర్బర్ (జర్మనీ) 6-3, 6-4తో  రిస్కీ (అమెరికా)పై...
 14వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-7 (8/10), 6-4, 6-2తో 17వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు.
 
 
 పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు
 మూడో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 7-6 (7/5), 6-2తో 29వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై...
 ఏడో సీడ్ బెర్డిచ్  6-4, 6-2, 6-2తో జుమర్‌పై...
  15వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ) 7-5, 6-4, 6-4తో సామ్ క్వెరీ (అమెరికా)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement