ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనం చోటు చేసుకుంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. ‘సెర్బియా సుందరి’ అనా ఇవనోవిచ్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనాను ఇంటిముఖం పట్టించింది.
మెల్‌బోర్న్: నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ అనా ఇవనోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 4-6, 6-3, 6-3తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది.
2008లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఇవనోవిచ్ ఆ తర్వాత తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సెరెనా విలియమ్స్‌పై ఒక్క సెట్ కూడా నెగ్గని ఇవనోవిచ్ ఈసారి ఏకంగా మ్యాచ్‌లోనే గెలుపొంది సంచలనం సృష్టించింది. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇవనోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 13సార్లు వచ్చి 10సార్లు పాయింట్లు నెగ్గింది. మరోవైపు సెరెనా 13 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు
30వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 6-7 (5/7), 6-2, 6-0తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)పై...
28వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-1, 4-6, 7-5తో తొమ్మిదో సీడ్ కెర్బర్ (జర్మనీ)పై....
నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-0తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై గెలిచారు.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు
రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-0, 6-2తో 15వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ)పై...
మూడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-7 (5/7), 7-5, 6-2, 6-1తో మాయెర్ (జర్మనీ)పై...
ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2, 6-3తో 19వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై...
ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 7-6 (7/3), 7-6 (7/5)తో 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్)పై గెలిచారు.
సెరెనాకు షాక్
Published Mon, Jan 20 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement