మూడో రౌండ్‌లో సెరెనా
మెల్‌బోర్న్: అంచనాలకు తగ్గట్టుగా రాణించిన టాప్‌సీడ్ ప్లేయర్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటారు. సెరెనా విలియమ్స్ (అమెరికా), నా లీ (చైనా), ఇవనోవిచ్ (సెర్బియా)తో పాటు పురుషుల విభాగంలో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్)లు తమ ప్రత్యర్థులపై సులువుగా విజయాలు దక్కించుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-1, 6-1తో వెస్నా డోలోంక్ (సెర్బియా)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. తద్వారా ఆసీస్ ఓపెన్‌లో 60 విజయాలు సాధించిన మార్గరెట్ కోర్టు (ఆస్ట్రేలియా) రికార్డును సమం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ నా లీ 6-0, 7-6 (5)తో బెలిండా బెన్సిస్ (స్విట్జర్లాండ్)పై, 9వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-4, 6-2తో అల్లా కుద్రెత్సోవా (రష్యా)పై; 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో అనికా బెక్ (జర్మనీ)పై; 15వ సీడ్ లిసికి (జర్మనీ) 2-6, 6-2, 6-2తో మోనికా న్యూక్లిసెస్ (రుమేనియా)పై; 17వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-2, 6-0తో పెరైంకోవా (బల్గేరియా)పై, 22వ సీడ్ మకరోవా (రష్యా) 6-2, 7-5తో ఇరినా ఫాల్కోని (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
పురుషుల రెండో రౌండ్‌లో రెండోసీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-0, 6-4, 6-4తో లియోనార్డ్ మేయర్ (అర్జెంటీనా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ మొత్తంలో 11సార్లు అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 30 విన్నర్లు కొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-6 (2), 5-7, 6-0, 6-3తో అడ్రియన్ మనరినో (ఫ్రాన్స్)పై; ఏడోసీడ్ బెర్డిచ్ (చెక్) 6-4, 6-1, 6-3తో డీ ష్కీపర్ (ఫ్రాన్స్)పై; 8వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-3, 6-7 (4), 6-4తో అలెజాండో ఫల్లా (కొలంబియా)పై; 9వ సీడ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 7-6 (3), 6-4, 6-4తో డేవిడెంకో (రష్యా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి వెళ్లారు.
రెండోరౌండ్‌లో నాదల్, ఫెడరర్
మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో స్కోరు 6-4 ఉన్న దశలో బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రేలియా) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్)కు విజయం లభించింది.
మరో మ్యాచ్‌లో నాలుగోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-1, 6-3తో గో సోయెదా (జపాన్)పై; 5వ సీడ్ డెల్‌పోట్రో (అర్జెంటీనా) 6-7 (1), 6-3, 6-4, 6-4తో రైనీ విలియమ్స్ (అమెరికా)పై; ఆరోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-4, 6-2తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై; 10వ సీడ్ విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 7-5, 6-3, 6-3తో ఫ్లిపో వాలాండ్రీ (ఇటలీ)పై నెగ్గారు.
మహిళల తొలి రౌండ్‌లో రెండోసీడ్ అజరెంకా (బెలారస్) 7-6 (2), 6-2తో లార్సన్ (స్వీడన్)పై, మూడోసీడ్ మరియా షరపోవా (రష్యా) 6-3, 6-4తో మాటెక్ సాండ్స్ (అమెరికా)పై; ఐదోసీడ్ రద్వాన్‌స్కా (పొలెండ్) 6-0, 5-7, 6-2తో పుటినెత్సోవా (కజకిస్థాన్)పై; 8వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో మిసాకి డో (జపాన్)పై; పదోసీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-0, 6-2తో లౌర్డెస్ లినో (స్పెయిన్)పై గెలవగా; 19వసీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 3-6, 3-6తో ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడింది.
యూకీ జోడి శుభారంభం
బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) 6-2, 7-5తో స్పెయిన్ జోడి రొబెర్టో బర్టిస్టా అగుట్-డానియెల్ జిమోనో ట్రావర్‌లపై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మరో మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు మహేశ్ భూపతి(భారత్)-రాజీవ్ రామ్ (అమెరికా) 4-6, 6-3, 6-4తో సాంటియాగో గిరాల్లో (కొలంబియా)-జో సౌసా (పోర్చుగల్)పై గెలిచారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 4-6, 4-6, 6-7 (2)తో ప్రపంచ 27వ ర్యాంకర్ ఫెల్సియానో లోపెజ్ (స్పెయిన్) చేతిలో ఓడాడు.
రెండు గంటలా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్థాయి మేరకు రాణించినా.. కీలక సమయంలో పాయింట్లు చేజార్చుకున్నాడు. గతేడాది టోర్నీలో సోమ్‌దేవ్ రెండో రౌండ్‌లో ఓడాడు.