‘కుమ్‌కుమ్’ షకలక... | Grand Slam woes continue for Kvitova | Sakshi
Sakshi News home page

‘కుమ్‌కుమ్’ షకలక...

Published Tue, Jan 14 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

‘కుమ్‌కుమ్’ షకలక...

‘కుమ్‌కుమ్’ షకలక...

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే ఆరో సీడ్ పెట్రా క్విటోవా, ఏడో సీడ్ సారా ఎరాని, 12వ సీడ్ రొబెర్టా విన్సీ ఇంటిదారి పట్టారు. గత ఐదేళ్లుగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గని మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.
 
 మెల్‌బోర్న్: మండే ఎండలో మెరుపులాంటి ఆటతీరుతో థాయ్‌లాండ్ అనామక క్రీడాకారిణి లుక్‌సికా కుమ్‌కుమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించింది. కెరీర్‌లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడుతోన్న 20 ఏళ్ల ఈ థాయ్‌లాండ్ అమ్మాయి తొలి రౌండ్‌లో ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఇంటిముఖం పట్టించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 87వ ర్యాంకర్ కుమ్‌కుమ్ 6-2, 1-6, 6-4తో వింబుల్డన్ మాజీ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ క్విటోవాను బోల్తా కొట్టించింది. కెరీర్‌లో 23వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన క్విటోవాకు అన్‌సీడెడ్ కుమ్‌కుమ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కుమ్‌కుమ్ శక్తివంతమైన డబుల్ హ్యాండెడ్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హాండ్ షాట్‌లతో హడలెత్తించింది.
 
 
 బేస్‌లైన్ వద్ద క్విటోవాను కట్టిపడేసి అడపాదడపా నెట్ వద్దకూ దూసుకొస్తూ ఈ థాయ్‌లాండ్ యువతార తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి సెట్‌లో క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన కుమ్‌కుమ్ అదే జోరులో 32 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో క్విటోవా తేరుకోవడంతో కుమ్‌కుమ్ జోరు తొలి సెట్‌కే పరిమితమా అన్న అనుమానం కలిగింది. అయితే కుమ్‌కుమ్ మూడో సెట్‌లో గేర్ మార్చింది. క్విటోవా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
 
 
 మ్యాచ్ మొత్తంలో నాలుగు ఏస్‌లు సంధించిన కుమ్‌కుమ్ నెట్‌వద్ద దూసుకొచ్చిన ఎనిమిది పర్యాయాల్లో ఏడుసార్లు పాయింట్లు నెగ్గింది. మరోవైపు క్విటోవా ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 2009 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్విటోవా తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం. తల్లిదండ్రుల వద్దే టెన్నిస్ శిక్షణ తీసుకునే కుమ్‌కుమ్, రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన బార్తెల్‌తో ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో జూలియా (జర్మనీ) 6- 3, 6-2తో ఏడో సీడ్ సారా ఎరాని (ఇటలీ)పై; జెంగ్ జీ (చైనా) 6-4, 6-3తో 12వ సీడ్ విన్సీ (ఇటలీ)పై; అలీసన్ రిస్కీ (అమెరికా) 6-2, 6-2తో 23వ సీడ్ వెస్నినా (రష్యా)పై సంచలన విజయాలు సాధించారు.
 
 వీనస్‌కు నిరాశ
 మహిళల సింగిల్స్ విభాగంలోనే మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. 22వ సీడ్ మకరోవా (రష్యా) 2-6, 6-4, 6-4తో వీనస్‌ను ఓడించింది. అక్క వీనస్ ఓడిపోయినా... చెల్లెలు సెరెనా విలియమ్స్ మాత్రం శుభారంభం చేసింది.
 
  తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-1తో యాష్లే బార్తీ (అమెరికా)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-0తో కోంజూ (క్రొయేషియా)పై, తొమ్మిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 0-6, 6-2తో గజ్దోసోవా (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 6-4, 6-4తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, 15వ సీడ్ లిసికి (జర్మనీ) 6-2, 6-1తో మిర్యానా (క్రొయేషియా)పై, 17వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-4తో జకోపలోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 
 జొకోవిచ్ జోరు
 పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-6 (7/2), 6-1తో లుకాస్ లాకో (స్లొవేకియా)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-3, 6-4, 6-4తో అలెజాంద్రో (కొలంబియా)పై, ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-4, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)పై, తొమ్మిదో సీడ్ గాస్కే (ఫ్రాన్స్) 7-5, 6-4, 6-1తో గుయెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
 
 
 నేటి తొలి రౌండ్ కీలక మ్యాచ్‌లు
 పురుషుల విభాగం
 రాఫెల్ నాదల్ (1) xబెర్నాడ్ టామిక్
 ఆండీ ముర్రే (4) x గో సొయెదా
 డెల్ పొట్రో (5) x రైన్ విలియమ్స్
 ఫెడరర్ (6) x డక్‌వర్త్
 సోంగా (10) x వొలాంద్రీ
 మహిళల విభాగం
 అజరెంకా (2) x జోనా లార్సన్
 షరపోవా (3) x బెథానీ మాటెక్
 రద్వాన్‌స్కా (5) x పుతిన్‌సెవా
 జంకోవిచ్ (8) x మిసాకి దోయ్
 వొజ్‌నియాకి (10) x లార్డెస్
 నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్
 
 ‘చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. క్విటోవాలాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణి చేతిలో ఓడితే నాకు పోయేదేమీ ఉండదు. అందుకే నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడమే లక్ష్యంగా బరిలోకి దిగాను. సంచలన ఫలితం సాధించాను.’     
 - కుమ్‌కుమ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement