సిబుల్కోవా జైత్రయాత్ర
అంచనాలకు మించి రాణిస్తున్న స్లొవేకియా సుందరి డొమినికా సిబుల్కోవా... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ఐదోసీడ్ రద్వాన్‌స్కాపై గెలిచి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో నా లీతో సిబుల్కోవా తలపడుతుంది.
మెల్‌బోర్న్: ఆటలో నైపుణ్యం ఉంటే ర్యాంక్‌లతో పని లేదని స్లొవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా నిరూపించింది. తన కంటే మెరుగైన ప్రత్యర్థులను కూడా తనదైన శైలిలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ప్రిక్వార్టర్స్‌లో షరపోవా... క్వార్టర్స్‌లో హలెప్‌లపై సంచలన విజయాలు నమోదు చేసిన ఆమె సెమీస్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. కెరీర్‌లో 27వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సిబుల్కోవా తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 20వ సీడ్ సిబుల్కోవా 6-1, 6-2తో అగ్నేస్కా రద్వాన్‌స్కా (పొలెండ్)పై విజయం సాధించింది.
గతంలో మెల్‌బోర్న్ పార్క్‌లో నాలుగో రౌండ్ దాటని సిబుల్కోవా ఈసారి మాత్రం అత్యుత్తమ టెన్నిస్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్ మొత్తంలో 21 విన్నర్లు కొట్టిన సిబుల్కోవా రెండుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొమ్మిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకోగా, రద్వాన్‌స్కా ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది.
ఫైనల్లో నా లీ
మరో సెమీస్‌లో నాలుగో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-4తో 30వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 86 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ర్యాపిడ్ ఆరంభంతో అదరగొట్టింది.
వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి 5-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కాస్త నెమ్మదించినా ప్రత్యర్థికి మాత్రం పెద్దగా అవకాశం ఇవ్వలేదు. రెండోసెట్‌లో 19 ఏళ్ల బౌచర్డ్ గట్టిపోటీ ఇచ్చింది. సుదీర్ఘమైన ర్యాలీలు జరగడంతో ఇద్దరి మధ్య ఐదుసార్లు సర్వీస్ బ్రేక్ అయ్యింది. అయితే సెట్ చివర్లో తన అనుభవాన్ని రంగరించి ఆడిన లీ రెండు సర్వీస్ గేమ్‌లను గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పది బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకున్న నా లీ మొత్తం 35 విన్నర్లు, 5 ఏస్‌లు కొట్టింది.
సెమీస్‌లో సానియా జోడి
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి... ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఆరోసీడ్ సానియా-టెకాయు 6-3, 6-4తో అన్‌సీడెడ్ ఐజమ్ ఖురేషి (పాకిస్థాన్)-జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచారు.
63 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలిసెట్‌లో మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో సానియా జోడి ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. అయితే రెండోసెట్ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-హంతుచోవా (స్లొవేకియా) 3-6, 3-6తో క్రిస్టినా మల్దోనోవిచ్ (ఫ్రాన్స్)-డానియెల్ నెస్టర్ (కెనడా) చేతిలో ఓడారు.
పురుషుల ఫైనల్లో వావ్రింకా
పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో అతను 6-3, 6-7 (1/7), 7-6, (7/3), 7-6 (7/4)తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై గెలిచాడు.
మూడు గంటల 31 నిమిషాల పాటు నువ్వా.. నేనా అన్నట్లు జరిగిన నాలుగు సెట్ల పోరాటంలో స్విస్ ఆటగాడు ఆద్యంతం సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు.
నాదల్ xఫెడరర్
పురుషుల రెండో సెమీఫైనల్ నేడు
మ.గం 3 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో లైవ్