నాదల్‌ను నిలువరించేనా! | Djokovic ready to challenge Nadal at French Open | Sakshi
Sakshi News home page

నాదల్‌ను నిలువరించేనా!

Published Sun, May 25 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

నాదల్‌ను నిలువరించేనా!

నాదల్‌ను నిలువరించేనా!

మధ్యాహ్నం గం. 2.30 నుంచి
 నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
 తొలి రోజు బరిలో ఫెడరర్, సెరెనా
 
 పారిస్: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్... అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తి చేసుకోవాలనే పట్టుదలతో జొకోవిచ్... కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే తపనతో ఫెడరర్... క్లే కోర్టులపై కూడా రాణించగలనని నిరూపించుకోవడానికి ఆండీ ముర్రే... ఇలా దిగ్గజాలంతా తలా ఓ లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారం తెరలేవనుంది.
 
  క్లే కోర్టులపై తిరుగులేని రాఫెల్ నాదల్ మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్ ఈసారీ గెలిస్తే వరుసగా ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. గతంలో నాదల్ రెండుసార్లు వరుసగా నాలుగేసి సార్లు (2005 నుంచి 2008 వరకు; 2010 నుంచి 2013 వరకు) ఈ టోర్నీని గెలిచాడు. ఈ టోర్నీలో నాదల్‌కు ఏకైక పరాజయం 2009లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో ఎదురైంది.
 
 మరోవైపు కెరీర్‌లో వరుసగా 58వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న ఫెడరర్ తొలి రోజు లుకాస్ లాకో (స్లొవేకియా)తో పోటీపడనున్నాడు. 1999 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచి... ఒకసారి (2009లో) విజేతగా నిలిచాడు. 10వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జొకోవిచ్ ఐదుసార్లు సెమీస్‌కు చేరుకొని, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు.
 
 సెరెనా నిలిచేనా!
 మహిళల విభాగంలో 2007 నుంచి ప్రతి ఏడాదీ కొత్త చాంపియన్ అవతరిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో అలీజా లిమ్ (ఫ్రాన్స్)తో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్స్‌లోపే సెరెనాకు మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్, మాజీ విజేత షరపోవా (రష్యా) ఎదురయ్యే అవకాశముండటంతో ఈసారి ఆమె టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 16,50,000 యూరోలు (రూ. 13 కోట్ల 14 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement