క్వార్టర్స్‌లో సైనా
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
బర్మింగ్‌హమ్: భారత స్టార్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఏడోసీడ్ సైనా 24-22, 18-21, 21-19 ప్రపంచ 41వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి గేమ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. 3-1తో ముందంజ వేసినా.. జాంగ్ 8-8తో స్కోరును సమం చేసింది. ఓ దశలో హైదరాబాద్ ప్లేయర్ 16-11 ఆధిక్యంలో నిలిచినా... జాంగ్ పట్టువిడవకుండా పోరాడుతూ పాయింట్లు సాధించింది. ఫలితంగా చాలాసార్లు ఆధిక్యం చేతులు మారడంతో స్కోరు 18-18, 20-20, 21-21, 22-22తో సమమైంది. కానీ చివరకు వరుసగా రెండు పాయింట్లు కాచుకున్న సైనా గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో కూడా ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో 7-7, 9-9తో స్కోరు సమమైంది. ఓ దశలో అమెరికా అమ్మాయి 16-12 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత సైనా ఒక్కో పాయింట్‌ను జత చేసినా... ప్రత్యర్థి ధాటికి గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైనా 11-9 ఆధిక్యాన్ని సంపాదించింది. తర్వాత ఇద్దరూ చకచకా ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లారు. స్కోరు 18-16 ఉన్న దశలో జాంగ్ మూడు పాయింట్లు గెలిచి 19-19తో సమం చేసింది. కానీ చివర్లో రెండు పాయింట్లు సాధించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. క్వార్టర్స్‌లో సైనా... నాలుగో సీడ్ షిజియాన్ (చైనా)తో తలపడుతుంది.
సింధు ఓటమి
బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ పి.వి.సింధు 16-21, 15-21తో సన్ యూ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. 47 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి గేమ్ ఆరంభంలో 5-9తో వెనుకబడిన సింధు ఆ తర్వాత 12-12, 15-15తో స్కోరును సమం చేసింది. కానీ ఈ దశలో చైనీస్ ప్లేయర్ వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో కూడా సన్ 4-2, 11-7తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఓ దశలో హైదరాబాద్ ప్లేయర్ ఆధిక్యాన్ని 12-13కు తగ్గించినా చివరి వరకు దాన్ని కాపాడుకోలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది.