అన్‌సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్‌లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్‌సీడెడ్‌గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది.
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్‌గా ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది.
2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్‌లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
నలుగురు గ్రాండ్‌స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్‌పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్‌లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్‌హ్యాండ్‌లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది.
వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 6–4తో తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్‌లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్‌లైన్ గేమ్‌తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది.
తొమ్మిదో గేమ్‌లో పదే పదే నెట్‌పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment